ఆమె... బ్యాట్‌ ఉమన్‌ అతను... బ్యాట్‌ మ్యాన్‌

ABN , First Publish Date - 2021-09-29T05:30:00+05:30 IST

ప్రేమ గుర్తుగా, పెళ్లి బహుమతిగా... గులాబీలు, అమూల్యమైన

ఆమె... బ్యాట్‌ ఉమన్‌ అతను...  బ్యాట్‌ మ్యాన్‌

ప్రేమ గుర్తుగా, పెళ్లి బహుమతిగా... గులాబీలు, అమూల్యమైన వస్తువులను బహూకరించుకుంటారు.  కానీ ఓ జంట ఈ రెండు సందర్భాల్లోనూ గబ్బిలాలనే ఇచ్చిపుచ్చుకుంది. అంతరించిపోతున్న గబ్బిల ప్రజాతుల పరిరక్షణే లక్ష్యమైన ఆ శాస్త్రవేత్తల జంట...  డాక్టర్‌ చెల్మల భార్గవి, డాక్టర్‌ చెల్మల శ్రీనివాసులు.  ‘బ్యాట్‌ ఉమన్‌ అండ్‌ బ్యాట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకున్న ఆ దంపతులు నవ్యతో పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు...


‘‘మా ఇద్దరిదీ హైదరాబాదే! బిఎస్సీ నుంచి ఇద్దరం ఉస్మానియా యూనివర్శిటీలో క్లాస్‌మేట్స్‌. చదువుకునే సమయంలో మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలూ ఒకటేనని గ్రహించాం. అంతరించిపోయే ప్రజాతులు, జంతువుల గురించిన చర్చ మా ఇద్దరి మఽధ్య నిరంతరంగా సాగుతూ ఉండేది. ఆ సమయంలో ఓ రోజు కరెంటు షాకుతో చనిపోయిన ఓ గబ్బిలం మా ఇంటి పరిసరాల్లో నాకు కనిపించింది. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఆయనను కలిసిన నేను, ఆ గబ్బిలాన్ని మా ప్రేమకు గుర్తుగా ఆయనకు బహూకరించాను. మా పెళ్లి నాడు ఆయన కూడా నాకు అలాంటి బహుమతినే అందించారు. ఇదంతా మిగతావాళ్లకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.


కానీ పరిశోధనల్లో మునిగి తేలే మాకు అవే అమూల్యమైన బహుమతులు. 1992లో బిఎస్సీ చదివే అప్పటి రోజులు మొదలు, పిహెచ్‌డిలు పూర్తి చేసి, శాస్త్రవేత్తలుగా కొనసాగుతున్న ఈనాటి వరకూ మా ఇద్దరి లక్ష్యం చెక్కుచెదరలేదు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటన ఒకటి హనుమాన్‌హళ్లిలో జరిగింది.’’




ఏళ్ల తరబడి పోరాడి...

కర్ణాటక, కోలార్‌ జిల్లాలో ఉన్న హునుమాన్‌హళ్లి గ్రామంలో, ఆకు మూతి గబ్బిలాలు సంచరించిన రిపోర్టు మా దగ్గర ఉంది. 30 ఏళ్ల క్రితం ఆ అరుదైన గబ్బిలాలు ఆ ప్రాంతంలో కనిపించాయి. అవి ఇప్పటికీ ఉన్నాయా? ఆ గబ్బిలాల ప్రజాతి పూర్తిగా అంతరించిపోయిందా? అనేది కనిపెట్టడం కోసం ముగ్గురు రీసెర్చ్‌ స్కాలర్స్‌తో కలిసి అక్కడకు వెళ్లాను. ఆరా తీస్తే, ఆ గ్రామంలో గుట్ట మీదున్న ఓ గుహలో అవి ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అయితే పగటి వేళ వెళ్లి, వాటిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సాయంత్రం చీకటి పడే వేళ గుట్ట మీదున్న గుహ దగ్గరకు చేరుకున్నాం. వాటిని వలలతో పట్టుకుని, ఫొటోలు తీసుకుని, శరీర కొలతలు సేకరించాలనేది మా ఆలోచన.


కానీ ఆ ప్రదేశం అక్రమ మైనింగ్‌ ఏరియా. మేం అక్కడ ఉన్నట్టు మా తలలకున్న హెడ్‌ ల్యాంప్స్‌ ద్వారా మైనింగ్‌ కూలీలు పసిగట్టారు. గట్టిగా కేకలు పెడుతూ, చేతుల్లో టార్చ్‌లైట్లతో మా వైపు పరిగెత్తుకు రావడం మాకు కనిపించింది. అది అక్రమ మైనింగ్‌ ఏరియా కావడంతో అక్కడకు అపరిచితులు ఎవరొచ్చినా, కూలీలు భయభ్రాంతులకు గురి చేసి వెళ్లగొట్టేస్తారు. దాంతో మా ఉనికి పసిగట్టే వీలు లేకుండా హెడ్‌ లైట్స్‌ ఆపేసి, వేగంగా గుట్ట కిందకు పరిగెత్తాం. అప్పటికే మేం ఎనిమిది గబ్బిలాలను పట్టుకోగలిగాం. వాటిని గుడ్డ సంచీల్లో వేసుకుని, పడుతూ లేస్తూ, గుట్ట దిగువకు చేరుకుని ఊపిరి పీల్చుకున్నాం. ఆ గుట్ట నిలువుగా ఉంటుంది. ఎక్కేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, జారి పడిపోకుండా ఎక్కినవాళ్లం, కూలీల దాడిని తప్పించుకుని, ఎలాగైనా సరే హైవే చేరుకోవాలనే తొందల్లో త్వరత్వరగా దిగేశాం. జారి పడిపోతామేమోననే భయం ఆ సమయంలో మాకు కలగలేదు.


హైవే చేరుకున్న తర్వాత గబ్బిలాలను కొలిచి, ఫొటోలు తీసుకుని, వాటిని వదిలేశాం. ఏదైతేనేం మేం అనుకున్నది సాధించాం. అవి ప్రపంచంలో మరెక్కడా లేని కోలార్‌ ఆకు మూతి గబ్బిలాలు. అత్యంత అరుదైన ప్రజాతికి చెందిన ఆ గబ్బిలాలు రెండు నుంచి మూడు వందలే మిగిలాయి. ఆ మొత్తం సంఘటన ఆ ప్రజాతి పరిరక్షణ పట్ల మా బాఽధ్యతను రెట్టింపు చేసింది. అవి అంతరించిపోకుండా ఉండాలంటే స్థానికుల మద్దతు కూడగట్టుకోవాలి. అందుకోసం వారిని చైతన్యపరచాలి. మరీ ముఖ్యంగా గబ్బిలాల మనుగడకు ముప్పుగా మారిన మైనింగ్‌ను అడ్డుకోవాలి. అందుకోసం మేం ఏళ్ల తరబడి మా శాయశక్తులా పోరాడాం.




గబ్బిలాల రిజర్వ్‌... 

గబ్బిలాల ప్రయోజనాల గురించి మనకు తెలియదు. అవి నిరుపయోగమైనవనీ, అశుభాలను, కీడులను కలుగజేస్తాయనీ మన నమ్మకం. పైగా ఈ నిర్దిష్టమైన ప్రజాతి గబ్బిలాలు కొంత దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. దాంతో హనుమాన్‌హళ్లి గ్రామస్థులకు వాటి పట్ల ఏహ్య భావం మరింత పెరిగింది. దాంతో పొగ పెట్టి గుహల్లో నివసించే గబ్బిలాలను చంపడం మొదలుపెట్టారు. మరోపక్క మైనింగ్‌ సమయంలో పగిలే కొండరాళ్లు భారీ శబ్దాలను వెలువరించడంతో పాటు, గుహలో ప్రకంపనలు కలిగిస్తాయి. ఇవన్నీ గబ్బిలాల మనుగడను ఆటంకపరిచేవే! ఇలా ఆ ప్రాంతంలో క్రమేపీ ఆకు మూతి గబ్బిలాల సంఖ్య తగ్గిపోతూ, అంతరించే దశకు చేరుకుంది.


కాబట్టి వాటి పట్ల స్థానికులకు అవగాహన పెంచడంతో పాటు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, మైనింగ్‌ కార్యకలాపాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం వర్క్‌షాపులు, ప్రెజెంటేషన్లను ఏర్పాటు చేశాం. హనుమాన్‌హళ్లి చుట్టూ మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో మైనింగ్‌ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేయగలిగాం. అలాగే సందర్శకుల నుంచి వాటికి రక్షణ కల్పించడం కోసం అటవీ శాఖాధికారుల సహాయాన్ని అర్ధించాం. వారి సహాయంతో ఆ ప్రాంతాన్ని బ్యాట్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా ప్రకటించడం జరిగింది. ఇలా కోలార్‌ గబ్బిలాలతో మా ప్రయాణం 2012లో మొదలై 2019 వరకూ కొనసాగింది. 


 



మా అబ్బాయి కూడా...

మా అబ్బాయి చెల్మల ఆదిత్య శ్రీనివాసులు ప్రస్తుతం కన్జర్వేషన్‌, ప్రయారటైజేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఏసియా బ్యాట్స్‌ గురించి పిహెచ్‌డి చేయబోతున్నాడు. గబ్బిలాల పరిశోధనలో మా అబ్బాయి పాత్ర కూడా ఉంది. కాబట్టి మాది బ్యాట్‌ ఫ్యామిలీ అని కూడా చెప్పుకోవచ్చు.


గబ్బిల ప్రజాతుల అధ్యయనం కోసం...

గబ్బిలాలు ఏ ఏ కీటకాలను తింటాయి? ఆ కీటకాలు ఏ ఏ మొక్కల మీద ఆధారపడి ఉన్నాయి? లాంటి గబ్బిలాల జీవావరణ వివరాల అధ్యయనం ద్వారా వాటి సంఖ్యను పెంచే వాతావరణాన్ని కల్పించవచ్చు. ఇందుకు సంబంఽధించిన అధ్యయనాల కోసం అమెరికాకు చెందిన బ్యాట్‌ కన్జర్వేషన్‌ అనే సంస్థ నుంచి మాకు స్వల్ప నిధి అందింది. ఈ నిధులను సద్వినియోగపరుచుకుని గబ్బిలాల పరిరక్షణకు తోడ్పడాలనేది మా ఆలోచన. ‘సైంటిఫిక్‌ అమెరికన్‌’ అనే జర్నల్‌ మమ్మల్ని ది బ్యాట్‌ ఉమన్‌ అండ్‌ బ్యాట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తించి, మా పరిశోధనను ప్రచురించడంతో పాటు, యూట్యూబ్‌లో కూడా పోస్ట్‌ చేసింది. ఆకు మూతి గబ్బిలాల పరిరక్షణతోనే మా లక్ష్యం ఆగిపోదు.


ప్రపంచ వ్యాప్త పరిశోధకులకు మా కోలార్‌ పరిశోధన ఓ కేస్‌ స్టడీగా ఉపయోగపడుతోంది. ఇదే తరహాలో పూర్వం అండమాన్‌ దీవుల్లో సైతం గబ్బిలాల గురించి పరిశోధనలు చేసి, అవగాహన పెంచి ఫలితాలను సాధించగలిగాం. పర్యావరణాన్ని ప్రభావితం చేసే మరిన్ని గబ్బిల ప్రజాతుల మీద దృష్టి పెట్టాలనేది మా ఆలోచన. మన దేశంలో 36 గబ్బిలాల ప్రజాతులున్నాయి. వీటి గురించిన సమగ్ర సమాచారం మన దగ్గర లేదు. కాబట్టి లక్షణాలు, కొలతలతో వాటిని గుర్తుపట్టడం, కనిపెట్టడానికి సంబంధించిన సమాచారాన్ని డాక్యుమెంట్‌ చేస్తున్నాం. ఇవి ముందు తరాల పరిశోధకులకు ఎంతో తోడ్పడతాయి.

- చెల్మల భార్గవి శ్రీనివాసులు,రీసెర్చర్‌.




వాటితో ప్రయోజనాలే ఎక్కువ

పులులు, సింహాలు, ఏనుగులు... ఇలా ఆకర్షణీయమైన జంతువుల గురించిన పరిశోధనలనే అందరూ ఎంచుకుంటూ ఉంటారు. అయితే సాలీళ్లు, గబ్బిలాలు ఇలాంటి చిన్న జీవుల గురించిన పరిశోధనలు, అధ్యయనాలు చేసేవాళ్లు తక్కువ. మరీ ముఖ్యంగా గబ్బిలాను అసహ్యించుకుంటాం. ఇంటి పరిసరాల్లో కనిపిస్తే, వాటిని వెళ్లగొట్టేస్తూ ఉంటాం. సినిమాల్లో సైతం వాటిని రక్తం తాగే డ్రాకులాలుగా చిత్రీకరిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 1460కి మించి గబ్బిల ప్రజాతులుంటే, వాటిలో కేవలం మూడు రకాల గబ్బిలాలు మాత్రమే రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ మూడూ దక్షిణ అమెరికా, అమెజాన్‌ అడవుల్లో మాత్రమే ఉన్నాయి. ఇవి మినహా మిగతావన్నీ పళ్లు, కీటకాలు తినేవే! పంట పొలాలను నాశనం చేసే పురుగులను ఇవి తినేస్తూ, పంటలకు మేలు చేస్తాయి.


నిజానికి గబ్బిలాల సంఖ్య పెరిగితే, పంటలకు పురుగు మందుల వాడకం తగ్గుతుంది. అయితే చీడపీడల నివారణకు వాడే పురుగు మందుల్లోని రసాయనాల వల్ల, ఆ పురుగులను ఆహారంగా తినే గబ్బిలాలు చనిపోతూ, క్రమేపీ వాటి జాతి అంతరించే స్థితికి చేరుకుంటోంది. కాబట్టి మేమిద్దరం ఇలాంటి గబ్బిలాల గురించిన పరిశోధననే ఎంచుకున్నాం. ఇందుకోసం కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా దక్షిణాసియా అంతటా ఉన్న గబ్బిలాల గురించి పరిశోధన చేస్తున్నాం. ఈ ప్రజాతుల గురించిన నాలెడ్జ్‌ గ్యాప్‌ను కూడా మేం భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాం. పరిశోధనలో భాగంగా భారత ఉపఖండంలో 113 గబ్బిల ప్రజాతులు ఉంటాయని మాకు తెలిసింది. వాటిలో 20 రకాల గబ్బిలాల గురించి మనకు ఏ మాత్రం సమాచారం లేదని తేలింది. వీటిలో కోలార్‌ ఆకు మూతి గబ్బిలాలు కేవలం కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతానికే ప్రత్యేకం. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. 

- డాక్టర్‌ చెల్మల శ్రీనివాసులు,

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా యూనివర్శిటీ.


Updated Date - 2021-09-29T05:30:00+05:30 IST