‘‘మమత బెనర్జీ నన్ను మనసు పెట్టి పని చేయమన్నారు. ఆమె నన్ను మనసు పెట్టి పాడమన్నారు’’ అంటున్నారు బాబుల్ సుప్రియో. గాయకుడు కూడా అయిన ఆయన పశ్చిమ బెంగాల్ అసన్సోల్ నుంచీ ఎంపిగా గెలిచారు. అయితే, ఈ మాజీ బీజేపీ మంత్రి గత వారమే టీఎంసీలో జాయిన్ అయ్యారు. తాజాగా తృణమూల్ అధినేత్రి మమతను కలుసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆమెతో భేటీ అయిన బాబుల్ చాలా విషయాలపై చర్చించామని చెప్పారు.
‘‘టీఎంసీ కుటుంబంలోకి నన్ను ప్రేమ, ఆప్యాయతలతో మమత బెనర్జీ ఆహ్వానించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె నన్ను మనసు పెట్టి పని చేస్తూ, మనసు పెట్టి పాడమని చెప్పారు’’ అంటూ సుప్రియో తమ సమావేశంలోని ముఖ్య విశేషాన్ని మీడియాతో పంచుకున్నారు. పార్టీలో చేరిన తరువాత మొదటిసారి దీదీని కలిసిన సింగర్ కమ్ పొలిటీషన్ ‘‘ఆమె మాటలు నా చెవులకు సంగీతంలా అనిపించాయి’’ అన్నారు. మరోవైపు, మమత బెనర్జీ 2024లో ప్రధాని కావాలని కూడా ఆయన కోరిక వ్యక్తం చేశారు.