Abn logo
Jul 16 2021 @ 00:00AM

ఆధ్యాత్మికం ఆరోగ్యప్రదం

త్రిమూర్తులలో స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. ఏడాదిలో ఎనిమిది నెలలపాటు లోక సంరక్షణ కార్యాన్ని సాగించి... నాలుగు నెలల పాటు  యోగ నిద్రలో విశ్రమిస్తాడు. అలా ఆయన నిద్రకు ఉపక్రమించే రోజు శయన ఏకాదశి. దీనికే  ‘తొలి ఏకాదశి’ అనే పేరుంది. చాతుర్మాస్య దీక్ష మొదలయ్యేది ఆ రోజే!


సంక్రాంతి నుంచి ఉత్తరాయనాన్ని సాగించే సూర్యుడు దక్షిణం వైపు పయనం ప్రారంభించే కాలం... అంటే దక్షిణాయనం ధార్మిక కార్యాలకు ఎంతో పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. నోములకూ, వ్రతాలకూ ఇది విశిష్టమైన సమయం. తొలి ఏకాదశిగా ప్రాచుర్యంలో ఉన్న ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చేసే వ్రతంతో వీటికి అంకురార్పణ జరుగుతుంది. 


ఏకాదశికి ప్రాధాన్యం ఎందుకంటే...

ఏకాదశి తిథికి ఆ విశిష్టత చేకూరడం వెనుక ఒక పురాణ కథ ఉంది. కృతయుగంలో మురాసురుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మ ప్రసన్నుడై వరాలు ఇవ్వడంతో తనకు ఎదురులేదనుకున్నాడు. గర్వంతో విర్రవీగి, దేవతలనూ, మానవులను హింసించడం మొదలుపెట్టాడు. మహా విష్ణువుకు దేవతలు మొరపెట్టుకోగా, మురాసురుడిపై ఆయన యుద్ధానికి తలపడ్డాడు. ఎన్నో ఏళ్ళపాటు కొనసాగిన ఈ యుద్ధంలో అలసిపోయిన విష్ణువు ఒక గుహలో విశ్రాంతి విశ్రమించాడు. ఇదే అదనుగా ఆయనను చంపడానికి మురాసురుడు అక్కడికి వచ్చాడు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి శరీరంలోంచి ఒక యువతి రూపంలో శక్తి బయటకు వచ్చి, మురాసురుణ్ణి సంహరించింది. నిద్ర రనుండి మేలుకున్న మహా విష్ణువు ఆ శక్తి చేసిన కార్యాన్ని మెచ్చుకొని ఏ వరం కావాలో కోరుకొమన్నాడు. తన పేరిట ‘ఏకాదశి’ని ఒక పవిత్రమైన తిథిగా పాటించేలా, ఆ రోజున పుణ్యకార్యాలు చేసేలా వరం ఇవ్వాలని ఆమె కోరగా... విష్ణుమూర్తి అనుగ్రహించాడు. దీని ప్రకారం... ప్రతి మాసంలో వచ్చే శుక్ల, కృష్ణ పక్ష ఏకాదశులు దైవారాధనలకూ, ఉపవాసాలకూ విశేషమైనవిగా పరిగణన పొందుతున్నాయి. ప్రధానంగా... తొలి ఏకాదశి రోజున చేసే ఏకాదశీ వ్రతానికి అనంతమైన ఫలం లభిస్తుందన్న విశ్వాసం ఉంది. పూర్వం ఆషాఢ శుద్ధ ఏకాదశినే సంవత్సరాదిగా పాటించేవారనీ, అందుకే దీనికి ‘తొలి ఏకాదశి’గా పేరు వచ్చిందనీ చెబుతారు.


ఆరోగ్య దీక్ష... చాతుర్మాస్యం

మహా విష్ణువు ఆ రోజున శేష తల్పంపై యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకే  దీన్ని ‘శయన ఏకాదశి’ అని పిలుస్తారు. నాలుగు నెలల తరువాత... తిరిగి ఆయన మేలుకొనే కార్తిక శుద్ధ ఏకాదశిని ‘ఉత్థాన ఏకాదశి’ అంటారు. ఈ నాలుగు నెలలనూ చాతుర్మాస్యంగా పాటిస్తారు. వ్రతాలన్నీ భగవదానుగ్రహం పొందడానికే. అయితే వీటిలో చాతుర్మాస్య వ్రతం భిన్నమైనదీ, విశిష్టమైనదీ. 


ఆషాఢే తు సితే పక్షే ఏకాదశ్యా ముపోషితః!

చాతుర్మాస్య వ్రతం కుర్యా దత్కించిన్నయతో నరః!! ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసంతో మొదలుపెట్టి, వ్రత నియమాలను పాటిస్తూ, కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఈ వ్రతాన్ని కొనసాగిస్తారు. స్త్రీ పురుష, వర్గ కుల బేధాలేవీ లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. వాతావరణం చల్లబడి, వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వ్రతంగా దీన్ని పేర్కొంటున్నాయి. ఈ నాలుగు నెలల కాలంలో ఆరోగ్యం కోసం పాటించాల్సిన ఆహార నియమాలను కూడా అవి వివరించాయి.


శ్రావణే వర్జయేత శాకం దధి భద్రపదే తథా!

దుగ్ధ మాశ్వయుజే మాసి కార్తికే ద్విదళాం తథా!!

శ్రావణ మాసంలో కాయ గూరలనూ, బాధ్రపద మాసంలో పెరుగునూ, ఆశ్వయుజ మాసంలో పాలనూ, కార్తిక మాసంలో రెండు బద్దలుగా ఉండే పప్పు ధాన్యాలనూ, వాటితో వండిన పదార్థాలనూ తినకూడదన్నది చాతుర్మాస్య నియమాల్లో ప్రధానమైనది. ఇలా నియమబద్ధంగా చాతుర్మాస్య దీక్షను ఆచరించలేకపోయినా... ఆ నాలుగు నెలలూ నిరంతర దైవ చింతనలో ఉంటూ, సత్కార్యాలు చేసే వారు భగవదానుగ్రహానికి పాత్రులవుతారన్నది పెద్దల మాట.