‘ముందస్తు’కు షా సై!

ABN , First Publish Date - 2022-05-15T08:24:30+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా..

‘ముందస్తు’కు షా సై!

  • తుక్కుగూడ సభలో 3 సార్లు ప్రస్తావన..!
  • భారీగా హాజరైన కేడర్‌.. సభ సక్సెస్‌
  • రేపే ఎన్నికలకు వెళ్లాలంటూ కేసీఆర్‌కు సవాల్‌


హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. తుక్కుగూడ బహిరంగ సభలో చేసిన ప్రకటన ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చింది. తన ప్రసంగంలో ముందస్తు ఎన్నికల గురించి మూడుసార్లు ప్రస్తావించిన షా.. రేపే ఎన్నికలకు వెళ్లాలంటూ సీఎం కేసీఆర్‌ను సవాల్‌ చేయడం.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ పేర్కొనడం కాషాయ పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపింది. అంతేగాక తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యాన్ని తామే నెరవేరుస్తామంటూ షా చేసిన ప్రకటన తమకు ఎన్నికల ప్రచారంలో కీలక అస్త్రంగా మారుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ప్రకటించారని అంటున్నారు.


కేసీఆర్‌ సర్కారుపై సూటిగా..

ఒకవైపు హామీల అమల్లో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మరోవైపు కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో తన ప్రసంగంలో షా వివరించారు. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేర్లు మార్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. కాగా, కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయి విమర్శలతో షా చేసిన ఉత్తేజపూరిత ప్రసంగానికి కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. తన పర్యటనపై టీఆర్‌ఎస్‌ నాయకత్వ విమర్శలను తిప్పికొట్టేలా జవాబిచ్చారని పేర్కొంటున్నారు. దాదాపు అరగంట ప్రసంగించిన షా.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మైత్రిని ఎండగట్టడంతో పాటు పలుసార్లు కేసీఆర్‌ను నిజాంగా సంబోధించారు. కేసీఆర్‌ కటుంబ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 8 ఏళ్లలో కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో పథకాలు, గణాంకాలు సహా వివరించారు.


సంజయ్‌పై ప్రశంసల జట్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ను అమిత్‌షా మరోమారు పొగడ్తలతో ముంచెత్తారు. ఆరు నెలల్లో మూడోసారి రాష్ట్ర పర్యటనకు వచ్చిన షా.. సంజయ్‌ పనితీరును బహిరంగంగానే ప్రశంసించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు సంజయ్‌ ఒక్కరు చాలని.. తాను రావాల్సిన అవసరం లేదంటూ ఆకాశానికి ఎత్తారు. అంతకుముందు షాను సంజయ్‌ శాలువా కప్పి సన్మానించబోగా.. సంజయ్‌ ఎడమ చేతిని తన కుడి చేతితో కలిపి పైకెత్తి షా ప్రజలకు అభివాదం చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేయడం, పాలనా వైఫల్యాలను ఎండగట్టడం తప్ప తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం లేదన్న విమర్శల నేపథ్యంలో షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్పష్ట హామీలిచ్చారు.


సంగ్రామ సభ సక్సెస్‌..

టీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అంటున్న సమయంలో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సక్సెస్‌ అయింది. దీంతో పార్టీ నేతల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. రాష్ట్ర పార్టీ చరిత్రలో తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహించామని.. అమిత్‌ షా రాక తమ దూకుడును మరింత పెంచుతుందని వారు సంబర పడుతున్నారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీఎత్తున కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చాయి. దీంతో భారీ ప్రాంగణం నిండిపోయింది. ఎన్నడూ లేని విధంగా పార్టీ బూత్‌ కమిటీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా గుర్తించామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు చెప్పారు. దీంతో సుమారు 26 వేల పోలింగ్‌ బూత్‌ కమిటీలు సభకు తరలివచ్చాయని తెలిపారు. పార్టీ పరిణామ క్రమంలో ఇది శుభ సూచకమని అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 5 వేల మందిని సమీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర నాయకత్వం.. అందులో విజయవంతమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-05-15T08:24:30+05:30 IST