చిన్నమ్మతో ఓపీఎస్‌ తమ్ముడి భేటీ

ABN , First Publish Date - 2022-03-06T14:49:23+05:30 IST

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళతో రెండు సార్లు సమావేశమైన ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌ సెల్వం సోదరుడు ఒ.రాజాపై వేటు పడింది.ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు

చిన్నమ్మతో ఓపీఎస్‌ తమ్ముడి భేటీ

- రాజాపై బహిష్కరణ వేటు

- మరో 30 మంది తొలగింపు

- అన్నాడీఎంకేలో కొనసాగుతున్న ప్రకంపనలు

- ఓపీఎస్‌ వ్యవహారశైలిపై ఈపీఎస్‌ వర్గంలో అనుమానాలు


చెన్నై: అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళతో రెండు సార్లు సమావేశమైన ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌ సెల్వం సోదరుడు ఒ. రాజాపై వేటు పడింది. ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి శనివారం సంయుక్తంగా ప్రకటిం చారు. అయితే తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఓపీఎస్‌, ఈపీఎస్‌కు లేదంటూ రాజా మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళే అయినప్పుడు తొలగించడానికి వీరెవరిని ధిక్కార స్వరం వినిపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే గతంలో లేనంత ఘోరప రాజయాన్ని చవి చూసింది. ఈనేపథ్యంలో పార్టీ ఓటమిపాలైనందుకు ద్వంద్వ నాయకత్వమే కారణమంటూ పార్టీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. మరో వర్గం పార్టీకి పూర్వ వైభవం కల్పించాలంటే శశికళ, దినకరన్‌లను పార్టీలో చేర్చు కోవాలంటూ ఒత్తిడి చేస్తోంది.ఈ పరిస్థితులలో దక్షిణాది జిల్లాల్లో పర్యటిస్తున్న శశికళను శుక్రవారం మధ్యాహ్నం తిరుచెందూరులోని గెస్ట్‌హౌస్‌లో పన్నీర్‌ సెల్వం సోదరుడు రాజా కలుసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తన అనుచరులతో కలిసి రాజా ఆమెతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ వ్యవహారంలో అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన్ని ఇలాగే వదిలేస్తే మరికొంత మంది నేతలు ధిక్కారస్వరం వినిపించడం ఖాయమని, శశికళతో చేయి కలిపేందుకు ఉత్సాహం చూపుతారన్న కారణంగా ఒ.రాజా పై క్రమశిక్షణా చర్యలకు అన్నాడీఎంకే అధిష్టానం సిద్ధమైంది. అతనితో సహా సహచర గణాన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఆదేశాలపై ఓపీఎస్‌, ఈపీఎస్‌ సంతకాలుండడం గమనార్హం. అంతేగాక పార్టీ నియమ నిబంధనల్ని అతిక్రమిం చినందుకుగాను రాజాతో పాటు తేని జిల్లా పార్టీ సాహిత్య విభాగంకార్యదర్శి ఎస్‌.మురుగేశన్‌, జాలర్ల సంఘం కార్యదర్శి వైగై కరుప్పుజీ, కడలూరు పురట్చితలైవర్‌ పేరవై కార్యదర్శి ఎస్‌. సేతుపతిని తక్షణమే పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవు లకు జరిగిన పరోక్ష ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా వ్యవహరించారంటూ కొంతమంది కౌన్సిలర్లు సహా 33 మంది అన్నాడీఎంకే నేతలను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. 


నన్ను తొలగించేందుకు వారెవరు? : రాజా

తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఈపీఎస్‌, ఓపీఎస్‌లకు ఎవరిచ్చారని పన్నీర్‌ సెల్వం సోదరుడు రాజా ధ్వజమెత్తారు. తేనిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ కాలం నుంచి తాను పార్టీలో ఉంటున్నానని, జయలలిత నాయకత్వంలోనూ పార్టీ సభ్యుడిగానే కొనసాగానని చెప్పారు. తనకు సంబంధించినంతవరకూ శశికళే పార్టీ ప్రధాన కార్యదర్శి కనుక, తనను పార్టీ నుంచి తొలగించడం చెల్లదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటానికి పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామే ప్రధాన కారణమని రాజా ఆరోపించారు. పార్టీ శ్రేణులంతా ప్రస్తుత నాయ కత్వంపై తీవ్ర ఆగ్రహంతో వున్నారని, ఈ విషయం తెలిసే ఓపీఎస్‌, ఈపీస్‌ నాటకమాడుతున్నారని రాజా విమర్శించారు.


ఓపీఎస్‌కు తెలిసే జరిగిందా.. ఎడప్పాడి వర్గం అనుమానం: మూడు రోజుల క్రితం తేనిలో పన్నీర్‌సెల్వం సమక్షంలోనే జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో శశికళను పార్టీలో చేర్చుకోవాలంటూ తీర్మానం చేయడం, దానిని ఆయన అడ్డుకోకపోవడం పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమావేశంలో ప్రతిపాదన చేసిన పార్టీ నిర్వాహకులపై బహిష్క రణ వేటు పడినా, ఆ సమావేశానికి ప్రతక్ష్య సాక్షిగా ఉండి మౌనం వహించిన పన్నీర్‌సెల్వంను ఎందుకు తొలగించలేదంటూ ఎడప్పాడిని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పన్నీర్‌సెల్వ మే ఈ నాటకం ఆడిస్తు న్నారని పళనిస్వామి వర్గం అనుమానిస్తోంది. కాగా పళనిస్వామి వర్గం నుంచి తనకు ముప్పుందని ఓపీఎస్‌ కూడా అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తనపై బహిష్కరణ వేటు పడకుండా ఉండేందుకు పార్టీలో తన బలాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సర్వసభ్య మండలిలో యాభై శాతానికి పైగా సభ్యుల అండ ఉంటేనే పార్టీపై పట్టు సాధించి శశికళ చెంత చేరవచ్చన్న భావనతో పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.



Updated Date - 2022-03-06T14:49:23+05:30 IST