ఆధ్యాత్మిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదు: శశికళ

ABN , First Publish Date - 2022-05-09T16:47:03+05:30 IST

ఆధ్యాత్మిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని, అధికార డీఎంకే మఠాధిపతుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం గర్హనీయమని అన్నాడీఎంకే అసమ్మతి వర్గం

ఆధ్యాత్మిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదు: శశికళ

చెన్నై: ఆధ్యాత్మిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని, అధికార డీఎంకే మఠాధిపతుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం గర్హనీయమని అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ దుయ్యబట్టారు. ఆదివారం ఉదయం తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీపంలోని వయలూరులోని మునీశ్వరాలయాన్ని ఆమె సందర్శించారు. ఆ ఆలయంలో జరుగుతున్న సిద్ధపురుషుల మహోత్సవంలో పాల్గొనేందుకు హాజరైన శశికళకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యాగంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్ళీ జయలలిత పాలన రానుందని, ఆ దిశగానే తాను త్వరలో రాజకీయ పర్యటన ప్రారంభించనున్నానని తెలిపారు.

డీఎంకే పాలనలో ఆధ్యాత్మిక వ్యవహారాలలో రాజకీయ జోక్యం అధికమైందని ఆరోపించారు. ఆలయాలలో, మఠాలలో ప్రాచీన సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలపై నిషేధం అమలు చేయడం తగదన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆలయాల్లో అమలులో ఉన్న ప్రాచీన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ థర్మల్‌ కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు లేవని ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత విద్యుత్‌ శాఖ మంత్రి బొగ్గు కొరతలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  

Read more