నేనున్నంత వరకు పార్టీ విచ్ఛిన్నం కాదు

ABN , First Publish Date - 2022-07-13T13:29:17+05:30 IST

తానున్నంత వరకు అన్నాడీఎంకే విచ్ఛిన్నం కాదని, అది పరాధీనం కాబోదని ఆ పార్టీ బహిష్కృత నేత వీకే శశికళ స్పష్టం చేశారు. పార్టీని ఐకమత్యంతో విజయబాటలో

నేనున్నంత వరకు పార్టీ విచ్ఛిన్నం కాదు

                      - అన్నాడీఎంకే బహిష్కృత నేత Shashikala


పెరంబూర్‌, జూలై 12: తానున్నంత వరకు అన్నాడీఎంకే విచ్ఛిన్నం కాదని, అది పరాధీనం కాబోదని ఆ పార్టీ బహిష్కృత నేత వీకే శశికళ స్పష్టం చేశారు. పార్టీని ఐకమత్యంతో విజయబాటలో నడిపించడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. శశికళ సోదరుడు దివాకరన్‌ నేతృత్వంలోని అన్నా ద్రావిడకళగంను శశికళ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో విలీనం చేసే కార్యక్రమం తంజావూరు మణిమండపం సమీపంలోని తమిళరసి కల్యాణ మండపంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ జయలలిత మరణానంతరం విధివశాత్తు తాను జైలుకెళ్లడంతో ఐక్యంగా ఉన్న పార్టీలో లుకలుకలు ఏర్పడ్డాయన్నారు. ఎంజీఆర్‌, జయ హయాంలో పలువురు పార్టీ నుంచి వెళ్లిపోయినా, పార్టీ బలోపేతంకోసం వారిని మళ్లీ కలుపుకొని పనిచేశారన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకురావడమెలాగో తాను వారివద్దే నేర్చుకున్నానన్నారు. బెంగుళూరు నుంచి వచ్చిన తాను పార్టీ బలోపేతానికి సమష్టి కృషిచేయాలని ప్రయత్నించానన్నారు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయన్నారు. కొందరు తమ స్వార్ధం కోసం చేస్తున్న పనులు కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. జయ మరణానంతరం 2016 డిసెంబరు వరకు నిర్వహించిన సర్వసభ్య సమావేశాలు కార్యకర్తల అభిప్రాయాల మేరకు పార్టీ విధివిధానాలు రూపొందాయన్నారు. తరువాత జరిగిన సర్వసభ్య సమావేశాలు కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసం నిర్వహిస్తున్నారని అన్నారు. పార్టీలోని వారందరిని ఐకమత్యం చేసి బలోపేతం చేస్తానని శశికళ తెలిపారు. 

Updated Date - 2022-07-13T13:29:17+05:30 IST