అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని నేనే

ABN , First Publish Date - 2022-07-08T13:17:36+05:30 IST

అన్నాడీఎంకేలో పైచేయి సాధించేందుకు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి కొట్లాడుకుంటుండగా, మరోవైపు ఆ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని నేనే

చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో పైచేయి సాధించేందుకు ఒకవైపు మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి కొట్లాడుకుంటుండగా, మరోవైపు ఆ పార్టీని కైవసం చేసుకుంటానంటూ బహిష్కృత నాయకురాలు వీకే శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకేకు ఇప్పటికీ తానే ప్రధాన కార్యదర్శినని పేర్కొన్నారు. దిండివనం, విల్లుపురం ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో రోడ్‌షోలు నిర్వహించిన శశికళ మాట్లాడుతూ.. పార్టీ ఒకరి వ్యక్తిగత ఆస్తి కాదని, ప్రజల సంక్షేమం కోసం ఎంజీఆర్‌ పార్టీని ప్రారంభించారని చెప్పారు. ఎంజీఆర్‌, జయలలిత ఆశయాలను నెరవేర్చే బాధ్యత పార్టీకి, పార్టీశ్రేణులదేనని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎవరు రావాలన్న విషయంపై వ్యక్తులు నిర్ణయం తీసుకోలేరని, పార్టీ శ్రేణులే నిర్ణయిస్తారని తెలిపారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అవకతవకలను పార్టీ శ్రేణులు, ప్రజలు గమనిస్తున్నారని, పార్టీకి ద్రోహం తలపెడుతున్నవారిని ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రేణులను వెంటబెట్టుకుని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లడమే తన తదుపరి చర్య అని ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవకతవకలను చూస్తూ ఊరుకోనని, తక్షణ చర్యలకు దిగుతానని హెచ్చరించారు. సర్వసభ్యమండలి, కార్యాచరణ మండలి నిర్వహించే అధికారం కూడా పార్టీ శ్రేణులదేనని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నవి సర్వసభ్యమండలి సమావేశాలు కావని వ్యాఖ్యానించారు. తన రాజకీయ పర్యటనను ప్రత్యర్థులు యెద్దేవా చేస్తున్నారని, తనను విమర్శించేవారికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ శ్రేణులంతా తన వెంటే ఉన్నారన్నారు. పార్టీని కైవసం చేసుకున్న అనంతరం ఎంజీఆర్‌ తరహాలో పార్టీని నడుపుతానన్నారు. కొడనాడు కేసు, జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి వాస్తవాలు బయటపడాలని అన్నారు. జయ మృతి కేసుపై విచారణ జరుపుతున్న కమిటీ తన వద్ద రెండు రోజులపాటు విచారణ జరిపిందని, తనకు తెలిసిన వాస్తవాలను తెలిపానని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభ ఎన్నికల సమయంలో కొడనాడు ఎస్టేట్‌ దోషులను అరెస్టు చేసి శిక్షిస్తానంటూ ప్రగల్భాలు పలికారని, ఇప్పటికీ ఆ కేసు విచారణ పూర్తికాలేదని శశికళ మండిపడ్డారు. 

Updated Date - 2022-07-08T13:17:36+05:30 IST