కానుకలు తేవద్దు... కాళ్లపై పడొద్దు!

ABN , First Publish Date - 2022-06-04T12:41:05+05:30 IST

తనను మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు వచ్చే పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు బొకేలు, శాలువలు, కానుకలు తేవాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే

కానుకలు తేవద్దు... కాళ్లపై పడొద్దు!

                 - పార్టీ శ్రేణులకు చిన్నమ్మ హితవు


పెరంబూర్‌(చెన్నై): తనను మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు వచ్చే పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు బొకేలు, శాలువలు, కానుకలు తేవాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదలచేస్తూ అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌, పురట్చితలైవి జయలలిత ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న అన్నాడీఎంకే ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమాన్నే కోరుకుటుందని తెలిపారు. ఇక తనను రోజూ కలుసుకునేందుకు వస్తున్న పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు శాలువలు, పుష్పగుచ్చాలు, కానుకలు తీసుకువస్తున్నారని, తనతో కలిసి ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తనకు కానుకలు తీసుకురావటం కన్నా వాటికయ్యే ఖర్చుతో తమ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఆర్థిక సాయం గానీ, లేదా వారికి భోజన సదుపాయం గానీ కల్పించి సేవలు చేయడం మంచిదని ఆమె సూచించారు. ఇకపై తనను కలుసుకుని, తనతోపాటు ఫొటో తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, తన సూచనను అందరూ మన్నించాలని ఆమె కోరారు. అంతే కాకుండా తనపై అభిమానంతో కొందరు కాళ్ళకు మొక్కే పద్ధతికి కూడా స్వస్తిపలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రముఖులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకునే దిశగా సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడ ఉన్నవారికి అన్నదానం కూడా చేయాలని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలపైనే తన అభిమానులు, పార్టీ ప్రముఖులు దృష్టిసారించాలని, అవే తనకు సంతోషాన్ని కలిగిస్తాయని శశికళ ఆ ప్రకటనలతో పేర్కొన్నారు.

Updated Date - 2022-06-04T12:41:05+05:30 IST