ప్రజాభీష్టం మేరకే నిర్ణయం: Shashikala

ABN , First Publish Date - 2022-05-26T16:17:05+05:30 IST

రాష్ట్ర ప్రజలంతా తాను అన్నాడీఎంకే పగ్గాల చేపట్టాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు వీకే శశికళ వ్యాఖ్యానించారు. బుధవారం టి.నగర్‌లో జరిగిన ఓ వివాహ

ప్రజాభీష్టం మేరకే నిర్ణయం: Shashikala

- పార్టీ పగ్గాలు స్వీకరించాలని వారి కోరిక

- చిన్నమ్మతో పేరరివాలన్‌ భేటీ


చెన్నై: రాష్ట్ర ప్రజలంతా తాను అన్నాడీఎంకే పగ్గాల చేపట్టాలని కోరుకుంటున్నారని ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు వీకే శశికళ వ్యాఖ్యానించారు. బుధవారం టి.నగర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న శశికళ మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే నుంచి వేరైన పార్టీలన్నీ ఏకమైతే మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను ఇదివరకే ప్రకటించానని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ శ్రేణులేనని వెల్లడించారు. త్వరలో జరుగనున్న అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంపై ఆమె వ్యాఖ్యానిస్తూ ఆ సమావేశంలో ఇప్పుడున్న పార్టీ నేతలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేరని, దీనికి కారణం ఆ నేతల వెంట కార్యకర్తలెవరూ లేకపోవడమేనని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొందరు పార్టీలో ఏవైనా పదవులు వస్తాయనే ఆశతోనే పనిగట్టుకుని తనను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో తనను చేర్చుకునే ప్రసక్తేలేదని కొందరు నేతలు చెబుతుండటంపై మాట్లాడుతూ... పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయంపై దివంగత మాజీ నేతలు ఇదివరకే స్పష్టం చేశారని, ఆ ప్రకారం పార్టీ నాయకత్వం ఎవరికి అప్పగించాలో కార్యకర్తలే నిర్ణయిస్తారని ఆమె అభిప్రాం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేకు ప్రస్తుతం జయలలిత లాంటి నాయకత్వం లేదని, ఆ పార్టీ ప్రస్తుతం బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదన్నారు. ఆ కారణంగానే రాష్ట్ర ప్రజలంతా పార్టీ నాయకత్వాన్ని స్వీకరించాలని తనను పదేపదే కోరుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో హత్యలు దోపిడీలు అధికమయ్యాయని, శాంతి భద్రతలు క్షీణించాయని, ముఖ్యమంత్రి నిర్వర్తిస్తున్న హోంశాఖ సమర్థవంతంగా పనిచేయడం లేదనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. డీఎంకే నేతలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ కేంద్రప్రభుత్వాన్ని అదేపనిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు ముద్దాయి పేరరివాలన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేయడం సమంజసమేనని, ఆయన విడుదలకు మొదట శ్రీకారం చుట్టింది దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితేనని చెప్పారు. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వంతో సత్సంబంధాలపై మీడియాముందు ఎలా చెబుతానని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పేరరివాలన్‌, ఆయన తల్లి అర్బుదమ్మాళ్‌ బుధవారం ఉదయం శశికళను టి.నగర్‌లోని ఆమె నివాసంలో కలిసి సుమారు పావుగంట సేపు చర్చించారు. 

Updated Date - 2022-05-26T16:17:05+05:30 IST