ప్రజలకు జయ పాలన అందించడమే నా ఆశయం: Shashikala

ABN , First Publish Date - 2022-05-08T14:09:47+05:30 IST

రాష్ట్ర ప్రజలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు వీకే శశికళ తెలిపారు. శనివారం ఆమె

ప్రజలకు జయ పాలన అందించడమే నా ఆశయం: Shashikala

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్ర ప్రజలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు వీకే శశికళ తెలిపారు. శనివారం ఆమె తిరుచెందూరు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆ సందర్భంగా చేతిలో 5 అడుగుల ఎత్తున్న శూలాయుధాన్ని పట్టుకుని విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అనంతరం పంచలింగాలు, షణ్ముఖస్వామి సన్నిధులను దర్శించి, వల్లి గుహాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని శూలాయుధాన్ని కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా శశికళ విలేఖరులతో మాట్లాడుతూ, ఓ కోరికతో శూలాయుధాన్ని కానుకగా సమర్పించానన్నారు.అతి త్వరలోనే రాజకీయ ప్రయాణం  ప్రారంభించి ప్రజలను కలుసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ, తాను ప్రస్తుతం అన్నాడీఎంకేలోనే ఉన్నానని, తమ పార్టీ అన్నాడీఎంకే అని అన్నారు. డీఎంకే పాలనలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, రాత్రి 9 గంటల తర్వాత మహిళలు నిర్భయంగా బయటకు వెళ్లే పరిస్థితులు లేవని చెప్పారు. డీఎంకే నేతలు పోలీస్ స్టేషన్లలో కట్ట పంచాయితీలు చేస్తుండడంతో న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో లేదన్నారు. అధికారులు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఈ విషయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టికి వెళ్లిందా? లేదా? అని ప్రశ్నించారు. జయలలిత పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవించారని, అలాంటి పాలన అందించాలని తాను భావిస్తున్నట్లు శశికళ తెలిపారు. కాగా, శశికళను ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం చెల్లుతుందని న్యాయస్థానం ప్రకటించినా, శశికళ అన్నాడీఎంకే జెండాతో ఉన్న వాహనంలో రావడం చర్చనీయాంశమైంది.

Read more