శశికళ వెడలే.. అన్నాడీఎంకే అదరగా!

ABN , First Publish Date - 2021-10-27T14:40:53+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలవారీ పర్యటనకు ఆమె మంగళవారం ఉదయం 20 వాహనాలతో అట్టహాసంగా బయలుదేరారు. స్థానిక టి.నగర్‌లో

శశికళ వెడలే.. అన్నాడీఎంకే అదరగా!

ప్యారీస్‌(Chennai): మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలవారీ పర్యటనకు ఆమె మంగళవారం ఉదయం 20 వాహనాలతో అట్టహాసంగా బయలుదేరారు. స్థానిక టి.నగర్‌లో వందలాదిమంది కార్యకర్తలు వీడ్కోలు పలుకుతుండగా, మద్దతుదారులతో కలిసి అన్నాడీఎంకే పతాకం కట్టిన లగ్జరీ కారులో శశికళ పయనమయ్యారు. జైలు నుంచి విడుదలైన అనంతరం అన్నాడీఎంకే నేతలతో టచ్‌లోకి వెళ్లిన శశికళ.. ఆ తరువాత రాజకీయాల నుంచి పక్కకు తొలగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మళ్లీ తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక అన్నాడీఎంకేను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ తన మనసులోని మాట చెప్పారు. అయితే ఆమె మాటల్ని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ మంత్రి డి.జయకుమార్‌ వంటి నేతలు తీవ్రంగా ఖండించగా, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్తగా వున్న పన్నీర్‌సెల్వం మాత్రం.. శశికళ వ్యవహారంలో అధిష్టానం ఆలోచించి, తగిన నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శశికళ మంగళవారం తంజావూరు వెళ్లారు. బుధవారం అక్కడ జరుగనున్న అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. 28వ తేదీ మదురై నగరంలో పర్యటించి ఆ ప్రాంతంలో ఉన్న ముత్తురామలింగం దేవర్‌, మరుదు సోదరుల విగ్రహాలకు నివాళులర్పిస్తారు. అనంతరం మదురై గోరిపాళ యంలో తమ మద్దతుదారులతో సమావేశం కానున్న శశికళ.. భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చించే అవకాశముంది. 29వ తేదీ రామనాథ పురం జిల్లాలో పర్యటించనున్న ఆమె.. 30వ తేదీన పసుమ్‌పొన్‌ గ్రామంలో నిర్వహించనున్న ముత్తు రామలింగ దేవర్‌ గురుపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ జిల్లా మద్దతుదారులతో భేటీ అయిన అనంతరం ఆ రోజు రాత్రి తంజావూరులో బస చేస్తారు. నవంబరు 1వ తేదీ నుంచి తిరునల్వేలి జిల్లా సహా పలు దక్షిణాది జిల్లాల్లో శశికళ పర్యటించనున్నారు. కాగా శశికళ పర్యటన అన్నాడీ ఎంకేలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమెతో ఏ జిల్లా నుంచి ఏఏ నేతలు టచ్‌లో వున్నారన్నదానిపై పళనిస్వామి వర్గం ఆరా తీస్తోంది. 

Updated Date - 2021-10-27T14:40:53+05:30 IST