Abn logo
Oct 17 2021 @ 10:03AM

chennai: జయకు చిన్నమ్మ నివాళి

- సమాధి వద్ద కన్నీటి పర్యంతమైన నెచ్చెలి 

- పెనుభారం దింపేసుకున్నా 

- పార్టీని ఎంజీఆర్‌, జయ కాపాడుతారు: శశికళ


చెన్నై: అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ తన నెచ్చెలి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులర్పించారు. నాలుగేళ్ల అనంతరం తొలిసారిగా శనివారం ఉదయం 11.30 గంటల కు మెరీనాకు వెళ్లిన శశికళ.. జయకు కన్నీటినివాళి అర్పిం చారు. అక్రమార్జన కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభ వించిన శశికళ పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలైన తర్వాత గత ఫిబ్రవరి ఎనిమిదిన చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆ సమయంలో జయ సమాధిని సందర్శించాలన్న ఆమె కోరక కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా నెరవేరలేదు. తరచూ పార్టీ కార్యకర్తలు, జిల్లా శాఖ నాయకులతో ఫోన్‌లో సంభాషిస్తూ జయ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటిస్తూ అన్నాడీఎంకే వర్గీయులలో గుబులు పుట్టిస్తూ వచ్చారు. గత ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికల నోటి ఫికేషన్‌ జారీ అయినప్పడు ఉన్నట్టుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలై బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అదే సమయంలో శశికళ మళ్ళీ రాజకీయాల్లో వచ్చి అన్నా డీఎంకేని కాపాడుతానంటూ ప్రకటనలు గుప్పించారు. పార్టీ పత్రిక ‘నమదు ఎంజీ ఆర్‌’లో పార్టీకి పూర్వవైభవం కల్పించేందుకు నడుంబిగిస్తానంటూ శపథం చేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ శశికళ శనివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక టి.నగర్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు. ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ ‘పురట్చి తాయ్‌ చిన్నమ్మ వర్థిల్లాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. జయ ఉపయో గించిన లగ్జరీ కారులో అన్నాడీఎంకే పతాకం పెట్టుకుని మరీ మెరీనాకు వెళ్లారు. తొలుత అన్నాడీఎంకే వ్యవ స్థాపకుడు ఎంజీఆర్‌ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి ఆమె నివాళులర్పించారు. ఆ తర్వాత జయ సమాధివద్దకు వెళ్లారు. సమాధి వద్దకు వెళ్లగానే ఆమె దుఃఖం పెల్లుబుకింది. దాంతో సమాధిని చూస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి, పూలు చల్లి ముకుళిత హస్తాలతో నిస్తేజంగా నిలబడిపోయారు. అనంతరం ఆమె సమాధి వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. శశికళతోపాటు మాజీ మంత్రి సెంతమిళన్‌, ఆవిన్‌ వైద్యలింగం తదితర నాయకులు కూడా వెళ్లారు. శశికళ రాక సందర్భంగా మెరీనాతీరానికి భారీగా ఆమె అభిమానులు తరలివచ్చారు. సరైన భద్రత కల్పించకపోవడంతో అభిమానుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. 


ఆ ఇద్దరే పార్టీని కాపాడుతారు...

జయ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత శశికళ మీడియాతో మాట్లాడు తూ... తన మనస్సులోని భారాన్ని దింపే సుకున్నానని ప్రకటించారు. జయ సమాధి వద్ద తాను నివాళులర్పించేందుకు జరిగిన జాప్యానికి గల కారణాలు ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఎంజీఆర్‌, జయలలిత ప్రజలకు సేవలు చేసిన మహానాయ కులని, ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీని, కార్యకర్తలను ఆ ఇరువురు నాయకులే తప్పకుండా కాపాడుతారని అన్నారు.


అన్నాడీఎంకే ఆఫీసు వద్ద...

శశికళ జయ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో పార్టీ సీనియర్‌ నాయకులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శశికళ వస్తే కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు ప్రధాన ద్వారం వద్ద మాజీ మంత్రి వలర్మతి, జిల్లా శాఖ నాయకులు బాలగంగా, ఆదిరాజారామ్‌, అశోక్‌, వీఎన్‌రవి, ఆర్‌ఎస్‌ రాజేష్‌ తదితరులు నేలపై బైఠాయించారు. వీరితోపాటు కార్యకర్తలు కూడా కార్యాలయం గేటు వద్ద నిలిచారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా నాయకులు కాపలా కాశారు. చివరకు శశికళ ఆ దరిదాపులలోకి రావటం లేదని తెలుసుకున్నాక నాయకులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.


శ్రీవారి దర్శనం...

శశికళ మెరీనాబీచ్‌కు వెళ్ళటానికి ముందు టి.నగర్‌లోని టిటీడీ సమాచార కేంద్రంలోని శ్రీవారి ఆలయాన్ని దర్శించారు. కాసేపు పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఎదుట నిలిచి మొక్కుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మెరీనాబీచ్‌కు చేరుకున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption