Shashikala ఆశలకు గండి

ABN , First Publish Date - 2022-04-12T13:04:50+05:30 IST

అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆరాటపడుతున్న ఆ పార్టీ అసమ్మతి నాయకురాలు శశికళ ఆశలకు గండి పడింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినని, త్వరలో పార్టీపై

Shashikala ఆశలకు గండి

- పార్టీ పదవి తొలగింపు సమంజసమే

- సిటీ సివిల్‌ కోర్టు తీర్పు


చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆరాటపడుతున్న ఆ పార్టీ అసమ్మతి నాయకురాలు శశికళ ఆశలకు గండి పడింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శినని, త్వరలో పార్టీపై పెత్తనం చెలాయిస్తానని పదే పదే ప్రకటనలు చేసిన శశికళకు స్థానిక కోర్టు షాక్‌ ఇచ్చింది.  అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం పార్టీ సర్వసభ్య మండలి చేసిన తీర్మానం చెల్లుబాటవుతుందని సిటీ సివిల్‌ కోర్టు సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి  తర్వాత 2016 డిసెంబర్‌ 29న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో ఆమె సన్నిహితురాలైన వీకే శశికళను ప్రధాన కార్యదర్శిగాను, టీటీవీ దినకరన్‌ను డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు శశికళ సిద్ధమవుతున్న సమయంలో అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 2017 సెప్టెంబర్‌ 12న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో శశికళ, దినకరన్‌లను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామికి అప్పగిస్తూ వారిని పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులలో నియమించారు. ఆ సమావేశంలో చేసిన తీర్మానాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ శశికళ  2017 నవంబర్‌ ఒకటిన చెన్నై కోర్టులో పిటిషన్‌ వేశారు. అన్నాడీఎంకే మాజీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌, మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్యమండలి సమావేశం పార్టీ నియమనిబంధనలకు వ్యతిరేకమని, పార్టీ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా జరిగిన ఆ సమావేశం చట్ట ప్రకారం వ్యతిరేకమని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై జరిగిన విచారణ సందర్భంగా ప్రతివాదులైన ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తూ రెండుగా విడిపోయిన వర్గాలు ఒక్కటైన తర్వాత సర్వసభ్య మండలి సమావేశం నిర్వహించి సమష్టి నిర్ణయం తీసుకున్నామని, పార్టీలో కొత్తగా ఏర్పాటు చేసిన సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తింపునిచ్చిందని, మండలి సమావేశం నిర్వహించే అధికారం తమకు ఉందని వివరించారు. శశికళ మళ్ళీ ఓ పిటిషన్‌ వేస్తూ అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదన్‌ మృతి చెందారని, దినకరన్‌ పార్టీ నుంచి విడిపోయి అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారని, ఈ పరిస్థితుల్లో పార్టీలో చీలికలు సంభవించిన సమయంలో సర్వసభ్యమండలి సభ్యులందరి చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన తనకే పార్టీలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని వాదించారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనలు ముగియడంతో ఈ కేసులో ఈ నెల ఎనిమిదిన తీర్పు వెలువడుతుందని ప్రకటించారు. కానీ ఆ రోజున మేజిస్ట్రేట్‌ సెలవుపై వెళ్ళటంతో తీర్పు వాయిదా వేశారు. తరువాత సోమవారం ఉదయం సిటీ సివిల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ శ్రీదేవి తీర్పువెలువరించారు. అన్నాడీఎంకే సర్వసభ్య మండలిలో శశికళను పార్టీ పదవి నుంచి తొలగిస్తూ చేసిన తీర్మానం చెల్లుబాటవుతుందని తీర్పునిస్తూ ఆమె తరఫు పిటిషన్‌ తోసిపుచ్చారు.  ఈ తీర్పు శశికళ వర్గానికి తీవ్ర నిరాశ కలిగించింది. అన్నాడీఎంకే న్యాయవిభాగం సంయుక్త కార్యదర్శి ఏఎం బాబు మురుగవేల్‌ ఈ తీర్పుపై స్పందిస్తూ అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వాదనలను సివిల్‌కోర్టు అంగీకరించి చక్కటి తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుతో పార్టీకి శశికళకు ఏ మాత్రం సంబంధాలు లేవని కోర్టు స్పష్టం చేసిందన్నారు.


అప్పీలుకు వెళ్లనున్న శశికళ...

ఇదిలా ఉండగా సిటీ సివిల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శశికళ హైకోర్టులో అప్పీలుకు వెళ్ళనున్నారని ఆమె అనుచరులు తెలిపారు. హైకోర్టులో మరిన్ని బలమైన ఆధారాలతో అప్పీలు పిటిషన్‌ వేస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఇప్పటికీ శశికళను ప్రధాన కార్యదర్శిగానే భావిస్తున్నారని తెలిపారు.  ఐదేళ్ల తర్వాత పార్టీ సానుకూలమైన తీర్పు రావడం పట్ల అన్నాడీఎంకే ఉపసమన్వయకర్త పళనిస్వామి, సమన్వయకర్త పన్నీర్‌సెల్వం హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ తర్వాత వీరిద్దరూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Updated Date - 2022-04-12T13:04:50+05:30 IST