కపిల్ సిబల్‌కు శశి థరూర్ మద్దతు

ABN , First Publish Date - 2021-10-01T00:51:48+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌కు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ మద్దతుగా

కపిల్ సిబల్‌కు శశి థరూర్ మద్దతు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్‌కు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ మద్దతుగా నిలిచారు. సిబల్ నిజమైన కాంగ్రెస్ నేత అని ప్రశంసించారు. పార్టీ తరపున ఆయన అనేక న్యాయ పోరాటాలు చేశారన్నారు. ఓ ప్రజాస్వామిక పార్టీగా మనం ఆయన చెప్పేదేమిటో వినాలన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం నేపథ్యంలో కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. 


కాంగ్రెస్‌ పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలని కోరుతూ గత ఏడాది 23 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. వీరిలో శశి థరూర్, కపిల్ సిబల్ కూడా ఉన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం నేపథ్యంలో కపిల్ సిబల్ బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి సన్నిహితులుగా పేరు పడినవారు దూరంగా వెళ్ళిపోయారని, సన్నిహితులుకానివారుగా పేరు పడినవారు పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. జీ-23 నేతలు ‘జీ హుజూర్ 23 నేతలు’ కాదన్నారు. తాము పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సిబల్ నివాసం వద్ద నిరసన తెలిపారు. ఓ కారును ధ్వంసం చేశారు. సిబల్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు.


ఈ నేపథ్యంలో శశి థరూర్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఓ ప్రజాస్వామిక పార్టీగా మనం ఆయన చెప్పాలనుకున్నదానిని వినాలి, తప్పదనుకుంటే మీరు అంగీకరించకండి, కానీ ఈ విధంగా కాదు. బీజేపీని ఎదుర్కొనడానికి మనం బలోపేతమవడమే మన ప్రాధాన్యంకావాలి’’ అని పేర్కొన్నారు. కపిల్ సిబల్ నిజమైన కాంగ్రెస్‌వాది అని మనందరకు తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అనేక కోర్టు కేసుల్లో వాదనలు వినిపించారన్నారు. సిబల్ నివాసంపై దాడి చేయడం సిగ్గు చేటు అని ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా కపిల్ సిబల్‌కు మద్దతుగా నిలిచారు. శర్మ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, కపిల్ సిబల్ నివాసం వద్ద దాడి, దాదాగిరి వార్తలు విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. ఈ దయనీయమైన చర్యలు పార్టీకి అప్రతిష్ఠ తెస్తాయన్నారు. దీనిని తీవ్రంగా ఖండించాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను బలపరచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. సిబల్ నివాసంపై దాడికి బాధ్యులైనవారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై విచారణ జరిపి, గట్టి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. 


పంజాబ్ శాసన సభకు ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగుతాయి. కాంగ్రెస్ నేతలు నవజోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ అభిప్రాయానికి వ్యతిరేకంగా నవజోత్ సింగ్ సిద్ధూను పీపీసీసీ చీఫ్ పదవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సిద్ధూ పీపీసీసీ చీఫ్ పదవికి ఇటీవల రాజీనామా చేశారు. సిద్ధూ, చన్నీ మధ్య విభేదాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా కాంగ్రెస్ నేతలు పరస్పరం తలపడుతున్నారు. 


Updated Date - 2021-10-01T00:51:48+05:30 IST