Delhi: శశిథరూర్‌ నా చిన్న తమ్ముడులాంటి వాడు: ఖర్గే

ABN , First Publish Date - 2022-10-02T19:49:25+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బరిలో తనతో తలపడుతున్న శశిథరూర్‌ను తన చిన్న సోదరుడితో మల్లికార్జున్ ఖర్గే ..

Delhi: శశిథరూర్‌ నా చిన్న తమ్ముడులాంటి వాడు: ఖర్గే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బరిలో తనతో తలపడుతున్న శశిథరూర్‌ను తన చిన్న సోదరుడితో మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పోల్చారు. అధ్యక్షుడి రేసులో మల్లికార్జున్ ఖర్గే, శిశథరూర్ ముఖాముఖీ తలపడుతున్నారు. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్‌ను పోటీ నుంచి ఉపసంహరించుకోమని కోరే అవకాశంపై ఖర్గేను ఆదివారంనాడు మీడియా ప్రశ్నించినప్పుడు, పోటీ నుంచి తప్పుకోవాలని తాను ఒత్తిడే చేసేది లేదని అన్నారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎన్నుకోవడం మంచిదని గతంలో తాను శశిథరూర్‌కు సూచించినప్పటికీ, ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని ఆయన అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న  సోదరుడు వంటి వాడని అన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకే తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్టు ఖర్గే తెలిపారు.


దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని, బీజేపీ చేసిన వాగ్దానాలేవీ కూడా  నెరవేరలేదని ఖర్గే అన్నారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో, సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు తనను కోరారని అన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ తీర్మానానికి కట్టుబడి నామినేషన్ వేసిన రోజే  రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా ఇచ్చానని  చెప్పారు. పార్టీ కోసం పనిచేయడం అనేది పార్ట్‌టైమ్ జాబ్ కాదని, పూర్తి సమయం వెచ్చించాల్సిన పని అని ఆయన అన్నారు. కేవలం కాంగ్రెస్ అధ్యక్ష పదవికే తాను పోటీ పడటం లేదని, సిద్ధాంతాల కోసం పార్టీ జరుపుతున్న పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. గాంధీ జయంతి రోజే తన ప్రచారం మొదలుపెట్టినట్టు తెలిపారు.

Updated Date - 2022-10-02T19:49:25+05:30 IST