Abn logo
Jul 23 2021 @ 16:23PM

పౌరుల ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం: శశిథరూర్

న్యూఢిల్లీ: పెగాసస్ స్పై వేర్ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో న్యాయవిచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్థాయీ కమిటీ చైర్మన్ శశిథరూర్ డిమాండ్ చేశారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రెండు అంశాలు ఇందులో ప్రధానమైనవని అన్నారు. పౌరుల ప్రైవసీ, భద్రత అనేది ఇందులో ఒకటని, రెండవది సైబర్ సెక్యూరిటీ అని అన్నారు. ఈ ఎజెండాల పరిధిలోకి పెగాసస్ ప్రాజెక్టు వస్తుందన్నారు. ప్రభుత్వ కార్యదర్శులను ప్రశ్నించే హక్కు స్టాండింగ్ కమిటీకి ఉంటుందని చెప్పారు. మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.

కాగా, పెగాసస్ స్నూపింగ్ వివాదంపై న్యాయవిచారణ జరిపించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. "పెగాసస్ స్నూప్ గేట్'' అనే నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శించారు. దేశంలోని సంస్థలపై నిఘా కోసం ఇజ్రాయెల్ క్లాసిఫైడ్ వెపన్‌ను పెగాసస్‌ను ప్రధానమంత్రి, హోం మంత్రి ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇది దేశద్రోహమని, ఇంకో మాట లేదని ఆయన తెగేసి చెప్పారు.