చేవెళ్ల టూ చేవెళ్ల

ABN , First Publish Date - 2021-10-19T05:09:30+05:30 IST

రేపటి నుంచి వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర ప్రారంభించనుంది.

చేవెళ్ల టూ చేవెళ్ల

  • రేపటి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు
  • పాదయాత్ర జయప్రదం చేసేందుకు సన్నాహాలు
  • జిల్లాలో ఏడు రోజుల పర్యటన షెడ్యూల్‌ విడుదల
  • ప్రతి రోజూ 12 నుంచి 15కి.మీ పాదయాత్ర
  • మార్గమధ్యలో మాట- ముచ్చట, నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమాలు
  • ప్రారంభ సభకు భారీగా జనసమీకరణ 
  • వేదికకు వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం పేరు ఖరారు


రేపటి నుంచి వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. చేవెళ్లలో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా 14నెలలపాటు కొనసాగి.. మళ్లీ చేవెళ్లలోనే ముగియనుంది. తొలి రోజు చేవెళ్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలం వేదికకు  వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం వేదిక అని నామకరణం చేశారు.


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఈనెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభిస్తున్న పాదయాత్రకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తోంది.  పాదయాత్ర ప్రారంభం సందర్భంగా చేవెళ్లలో నిర్వహించే బహిరంగసభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. 2004లో కూడా ఉమ్మడిరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా వైఎస్‌ ఇదే సెంటిమెంట్‌తో అనేక సంక్షేమపథకాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత వైఎస్‌ కుమార్తె షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ స్థాపించి రాజ్యాధికారం కోసం అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 14 నెలలపాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తన తండ్రి వైఎస్‌కు ఎంతో అచ్చివచ్చిన చేవెళ్ల నుంచే ఆమె కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. రేపు చేవెళ్ల నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 14నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా సాగి తిరిగి చేవెళ్లలోనే ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలిరోజు చేవెళ్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలం వేదికకు  వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం వేదిక అని నామకరణం చేశారు. బహిరంగసభ స్థలాన్ని వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడి, పార్టీ నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభమై 14 నెలల పాటు రాష్ట్రంలో కొనసాగి చేవెళ్లలోనే ముగుస్తుందన్నారు.  ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి షర్మిలను  ఆశీర్వదించి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ను నిలదీసేందుకే వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు షర్మిల తన తండ్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కొనసాగించేందుకుగాను ప్రజల ముందుకు వస్తున్నారని స్పష్టం చేశారు. పాదయాత్రకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కె. డేవిడ్‌, చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌, శంకర్‌పల్లి మండలాల పార్టీ కన్వీనర్లు శివారెడ్డి, యాదగిరి, మన్మోహన్‌, కరుణాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 


రోజుకు 12 కి.మీ. నుంచి 15 కి.మీ.

 వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల రేపు చేవెళ్ల నుంచి ప్రారంభించే పాదయాత్ర రంగారెడ్డిజిల్లాలో దాదాపు ఈనెలాఖరు వరకు కొనసాగనుంది. మొదటివారం షెడ్యూల్‌ను పార్టీ నాయకత్వం సోమవారం విడుదల చేసింది. రోజుకు సగటు 12 నుంచి 15కి.మీ పాదయాత్ర కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 8:30గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుందని పార్టీ శ్రేణులు తెలిపాయి. పాదయాత్ర మొదటిరోజు (బుధవారం) షర్మిల హైదరాబాద్‌ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు చేవెళ్లకు చేరుకుంటారు. చేవెళ్లలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి పక్కనే రెండు ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభస్థలికి చేరుకుంటారు. ఆ తర్వాత షర్మిల ఉదయం 11.15గంటలకు వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం వేదికపైనే సర్వమత ప్రార్థనలు  నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న మాజీ సీఎం దివంగత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి కందవడ గ్రామం మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. కందవాడ గ్రామంలోనే రచ్చబండ మాటముచ్చట అనే కార్యక్రమం ద్వారా గ్రామస్తులతో షర్మిళ ముఖాముఖీగా మాట్లాడుతారు. మొదటి రోజు పాదయాత్ర చేవెళ్ల మండలంలో ముగించుకుని మొయినాబాద్‌ మండల పరిధిలోని నక్కలపల్లి రెవెన్యూలో ఉన్న ఓ వెంచర్‌లో షర్మిళ రాత్రిబస చేయనున్నారు. జిల్లాలో ఆమె పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభలతోపాటు స్థానిక ప్రజలతో మాటముచ్చట కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే కందుకూరు మండలం అగర్మియాగూడలో ఒకరోజు నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. 


మొదటివారం పాదయాత్ర ఇలా..


2వ రోజు

నక్కలపల్లి నుంచి మొదలై కేతిరెడ్డిపల్లి క్రాస్‌రోడ్డు, వెంకటాపూర్‌, కవ్వాడిగూడ  క్రాస్‌ రోడ్డు, మల్కాపురం, అమ్డాపూర్‌, నవాజీపూర్‌ క్రాస్‌ రోడ్డు,  కాచారం మీదుగా  వర్థమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వరకు కొనసాగనుంది. 


3వ రోజు 

వర్థమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి ప్రారంభమై సుల్తాన్‌పల్లి క్రాస్‌ రోడ్డు, ఎం ఎస్‌సీ కాలనీ, నర్కూడ, అమ్మపల్లి,  రాళ్ల గూడ మీదుగా శంషాబాద్‌ పోసెట్టిగూడ వరకు కొనసాగుతుంది. 


4వ రోజు 

పోసెట్టిగూడ నుంచి ప్రారంభమై  గొల్లపల్లి, కొత్తగూడ, రషీద్‌గూడ, హమీదుల్లానగర్‌,  చిన్న గోల్కండ, సాంఘీగూడ, పెద్ద గోల్కొండ, మీదుగా నాగారం వరకు కొనసాగుతుంది. 


5వ రోజు 

నాగారం నుంచి ప్రారంభమై కొత్త తండా, డబ్లీగూడ, మన్‌ సాన్‌పల్లి,  కేసీ తండా, మహేశ్వరం జంక్షన్‌ మీదుగా తుమ్మలూరు వరకు కొనసాగనుంది. 


6వ రోజు 

తుమ్మలూరు నుంచి ప్రారంభమై మహబత్‌ నగర్‌, తుమ్మలూరు గేట్‌, రాచలూరు గేట్‌, భైరాగిగూడ, లేమూరు మీదుగా అగర్మి యాగూడకు పాదయాత్ర చేరుకుంటుంది. 


7వ రోజు

అగర్మియాగూడ నుంచి ప్రారంభమై తిమ్మా పూర్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఒక రోజు నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. 

Updated Date - 2021-10-19T05:09:30+05:30 IST