కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: షర్మిల

ABN , First Publish Date - 2021-08-24T23:23:53+05:30 IST

తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ బందీ అయినట్టు.. సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ..

కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: షర్మిల

 మంచిర్యాల: తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ బందీ అయినట్టు.. సీఎం కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని వైఎస్సార్‌టీపీ అధినేత్రి  వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో  నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో షర్మిల మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. యువకులు, విద్యార్థులను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది నిరుద్యోగులు చనిపోతున్నా కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారన్నారు. ఫాంహౌస్‌లో పడుకుంటున్న కేసీఆర్‌కు  రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో తెలియదన్నారు. 


కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప కేసీఆర్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నరేష్ నాయక్ లాంటి అనేక మంది యువకులు బతికే వారని చెప్పారు. కేసీఆర్ నిర్వాకంతో ఏడేళ్లలో నిరుద్యోగం తీవ్రమైందన్నారు. గడిచిన ఏడు రోజుల్లో  ముగ్గురు నిరుద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలని చెప్పారు. ఈ చావులకు కారణం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హంతకుడు, మోసగాడని దుయ్యబట్టారు. పనికి మాలిన నీతి మాలిన రాజకీయాల కోసమేనా తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు. సిగ్గులేని ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని నిదీశారు. రాష్ట్రంలో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదు, మంత్రులు ,ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడో తాలిబన్‌లో చావులపై ఐక్యరాజ్యసమితి ఏం చేసిందని మంత్రి కేటీఆర్ అడుగుతున్నారు, తెలంగాణలో ఉద్యోగాలు లేక యువకులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని  షర్మిల ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-24T23:23:53+05:30 IST