సగం సీట్లు మహిళలకే: షర్మిల

ABN , First Publish Date - 2021-07-09T01:03:03+05:30 IST

వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలో సగం సీట్లు మహిళలకే ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు

సగం సీట్లు మహిళలకే: షర్మిల

హైదరాబాద్: వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలో సగం సీట్లు మహిళలకే ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆమె విమర్శించారు. వెనకబాటు తనం ఉన్నది బీసీల్లో కాదు, పాలకుల ఆలోచనల్లో ఉందని ఆమె అన్నారు. బీసీలు పైకి వస్తే ఓటు బ్యాంక్‌ రాజకీయం నడవదని వారని దూరం పెడుతున్నారని ఆమె ఆరోపించారు. బడ్జెట్‌లో కేవలం 3 శాతం కేటాయిస్తే బీసీల అభివృద్ధి ఎలా జరుగుంతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను కేసీఆర్‌ 24శాతానికి తీసుకొచ్చారని ఆమె విమర్శించారు. బీసీలకు పాలనలో కూడా సరైన భాగస్వామ్యం కల్పించాలన్నారు.


మరి తల సంగతేంటి?

తల నరుక్కుంటా, కానీ మాట తప్పనని కేసీఆర్‌ అన్నారని, దళితుడిని సీఎం చేస్తానని చేయలేదుని, మరి తల సంగతేంటని షర్మిల ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగితే కేసీఆర్‌ రాక్షసానందం పొందుతున్నారని  ఆరోపించారు. దళితుల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 

మైనార్టీలను కేసీఆర్‌ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మైనార్టీలను బీజేపీ హేట్‌ బ్యాంక్‌గా చూపిస్తోందన్నారు. 



అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమ నిధి

ఉద్యమంలో 1200 మంది చనిపోతే కేసీఆర్‌ కేవలం 400 మందినే గుర్తించారని ఆమె పేర్కొన్నారు. ఉద్యమకారులపై కేసులు ఇంత వరకు ఎత్తివేయ లేదని షర్మిల గుర్తు చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం తాము పనిచేస్తామన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించినట్లు ఉద్యమకారుల్ని గుర్తిస్తామని ఆమె ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని షర్మిల పేర్కన్నారు.




Updated Date - 2021-07-09T01:03:03+05:30 IST