బిట్‌ కాయిన్లంటూ బురిడీ..షేర్‌ మార్కెటంటూ మోసం

ABN , First Publish Date - 2022-04-15T17:48:34+05:30 IST

తక్కువ సమయంలోనే ఎక్కువమొత్తం సంపాదించాలని ఆశపడుతూ విద్యావంతులు సైతం సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు

బిట్‌ కాయిన్లంటూ బురిడీ..షేర్‌ మార్కెటంటూ మోసం

ఉద్యోగులకు వల విసురుతున్న సైబర్‌ నేరగాళ్లు

రూ.60 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

మరో సివిల్‌ ఇంజనీర్‌కు రూ.20 లక్షలు టోకరా


హైదరాబాద్‌ సిటీ: తక్కువ సమయంలోనే ఎక్కువమొత్తం సంపాదించాలని ఆశపడుతూ విద్యావంతులు సైతం సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. కొత్తగా వచ్చే డబ్బు అటుంచి తమ కష్టార్జితం రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన రెండు ఉదంతాల్లో ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా, మరొకరు సివిల్‌ ఇంజనీర్‌ ఉన్నారు. మరికొందరు షేర్‌ మార్కెట్‌ అనుభవం ఉన్నవారు కావడం గమనార్హం. 


హైదరాబాద్‌ మాదాపూర్‌కు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ ఫోన్‌కు ఓ లింక్‌ వచ్చింది.. అది తెరవకుండానే అతడి నంబరును వాట్సాప్‌ గ్రూపులో చేర్చారు. ఇంతలో సివిల్‌ ఇంజనీర్‌కు ఫోన్‌ చేసి తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు సాధించవచ్చని తెలిపారు. షేర్‌ మార్కెట్‌, ట్రేడింగ్‌పై పట్టుండడంతో సివిల్‌ ఇంజనీర్‌ కొంత పెట్టుబడి పెట్టాడు. వెంటనే అతడి పేరుతో కొన్నిబిట్‌ కాయిన్స్‌ కొనుగోలు చేసి లాభాలు చూపించారు. తర్వాత మరికొంత పెట్టుబడి పెట్టించారు. అయితే, డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని సదరు వ్యక్తి సూచించాడు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించినా విత్‌డ్రా ఆప్షన్‌ ఇవ్వలేదు. తనకు దీనిని పరిచయం చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తే ఈసారి తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయండి.. ఉన్నతాధికారులతో మాట్లాడి విత్‌డ్రా చేసుకునేలా చూస్తానని నమ్మించాడు. ఇలా 15 రోజుల్లో రూ.20లక్షలు పెట్టినా స్పందన లేకపోవడంతో బాధితుడు మళ్లీ నిలదీశాడు. దీంతో సైబర్‌ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. మీ డబ్బు మొత్తం రూ.కోటి అయింది. దానిపై మనీలాండరింగ్‌ కేసు నమోదైందని, మీపై అరెస్టు వారెంట్‌ జారీ అయిందని అంటూ ఆ వారెంట్‌ను వాట్సాప్‌ చేశారు. డబ్బు వదులుకో, లేదంటే జైలుకెళ్లు అంటూ బెదిరింపులు ప్రారంభించాడు. మోసపోయానని గుర్తించిన సివిల్‌ ఇంజనీర్‌.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 


మరోఘటనలో రూ.60 లక్షలు..

మరో ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అతడికి తెలియకుండానే వాట్సాప్‌ గ్రూపులో చేర్చారు. అందులో ఉన్న వందలమంది ఇన్వెస్టర్‌లు అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయి అంటూ నమ్మిస్తూ గ్రూపులో మెస్సేజ్‌లు, లింకులు పంపారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లింకులో రిజిస్టర్‌ అయ్యాక కొంత పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుతో నిర్వాహకులు అంతర్జాతీయ కంపెనీల్లో తక్కువ పెట్టుబడితో షేర్లు కొన్నట్లు చూపారు. రోజుల వ్యవధిలోనే అమాంతం విలువ పెరిగిందని, లాభాలను వర్చువల్‌ ఖాతాల్లో చూపించి మరికొంత పెట్టుబడితో షేర్లు కొనిపించారు. 15 రోజుల్లోనే రూ. 60లక్షలు పెట్టుబడులు పెట్టించారు. అయితే, షేర్లు అమ్ముకునే ఆప్షన్‌ లేకుండా చేశారు. ఫోన్‌ చేసినా, వాట్సాప్‌ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2022-04-15T17:48:34+05:30 IST