వాటా పంచు గూగుల్‌!

ABN , First Publish Date - 2021-02-28T09:28:50+05:30 IST

ఇటీవలి కాలంలో విస్తృతస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయమిది. ఒక్క ఆస్ట్రేలియానే కాదు, యూర్‌పలోని పలు దేశాలు ఇప్పుడు గూగుల్‌ ఏకఛత్రాధిపత్యంపై, న్యూస్‌ కంటెంట్‌ ద్వారా అది ఆర్జిస్తున్న భారీ ఆదాయంపైన దృష్టిసారించాయి.

వాటా పంచు గూగుల్‌!

న్యూస్‌ ఫీడ్‌ వాడుకుంటున్నందుకు వార్తాసంస్థలకు ఆదాయం పంచాల్సిందే

ఇటీవల చట్టం చేసిన ఆస్ట్రేలియా సర్కారు

గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఆదాయంపై 

ఐరోపా యూనియన్‌ దేశాల ప్రభుత్వాల దృష్టి

85ు వాటా కోరుతున్న భారత వార్తాపత్రికలు

మధ్యే మార్గంగా ‘న్యూస్‌ షోకేస్‌’ పేరుతో

కొత్త ఉత్పత్తిని తెరపైకి తెచ్చిన గూగుల్‌

దాని ద్వారా సంస్థలకు నెలవారీ చెల్లింపు

త్వరలోనే భారత్‌లోనూ చెల్లించే అవకాశం!


మా వార్తలను, సమాచారాన్ని వాడుకుంటున్న గూగుల్‌ అందుకు తగిన చెల్లింపు చేయాలి. ప్రకటనల ఆదాయంలో 85% మాకు ఇవ్వాలి.

భారత వార్తాపత్రికల సంఘం (ఐఎన్‌ఎస్‌) డిమాండ్‌


న్యూస్‌ కంటెంట్‌ను వాడుకుంటున్న గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు తమ యాడ్‌ రెవెన్యూలో వార్తా సంస్థలకు వాటా ఇవ్వాలి.

 ఆస్ట్రేలియా చట్టం 


ఇటీవలి కాలంలో విస్తృతస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయమిది. ఒక్క ఆస్ట్రేలియానే కాదు, యూర్‌పలోని పలు దేశాలు ఇప్పుడు గూగుల్‌ ఏకఛత్రాధిపత్యంపై, న్యూస్‌ కంటెంట్‌ ద్వారా అది ఆర్జిస్తున్న భారీ ఆదాయంపైన దృష్టిసారించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన చట్టం నేపథ్యంలో.. ఫ్రాన్స్‌తో, ఈయూతో కూడా ప్రచురణకర్తలకు మెరుగైన మూల్యం, వాణిజ్యప్రకటనల ఆదాయంలో వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే భారత వార్తాపత్రికల సంఘం కూడా గూగుల్‌ ఆదాయంలో వాటా కోసం డిమాండ్‌ చేస్తోంది. సంప్రదాయ పాఠకులతో పోలిస్తే ఆన్‌లైన్‌ పాఠకులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య ప్రకటనలు కూడా ఎక్కువ భాగం ఆన్‌లైన్‌ బాట పట్టాయి. 


ఈ పరిణామాన్ని ఎక్కువగా సొమ్ము చేసుకుంటున్న టెక్‌ దిగ్గజాలు రెండే. ఒకటి గూగుల్‌, రెండోది ఫేస్‌బుక్‌. వార్తాపత్రికల సైట్లకు గూగుల్‌, ఫేస్‌బుక్‌ ద్వారా వచ్చే పాఠకులు 80 శాతం దాకా ఉంటారని అంచనా. వాటి ఆదాయం కూడా ఆ ట్రాఫిక్‌కు అనుగుణంగానే ఉంటుంది. ఆ ఆదాయంలో 70-80 శాతం దాకా గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలోకే వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆన్‌లైన్‌ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో దాదాపు ఈ రెండు సంస్థలకే పోతోంది. వాస్తవానికి ఆ రెండు సంస్థలకూ పాత్రికేయంతో ఏ సంబంధమూ లేదు. వార్తాపత్రికల సిబ్బంది కష్టపడి సేకరించిన విలువైన సమాచారాన్ని న్యూస్‌ ఫీడ్‌గా ఇవ్వడం ద్వారా భారీగా ఆర్జిస్తున్నాయి. ఆ సమాచారమంతా తాము కష్టపడి సేకరించింది కాబట్టి.. అందుకు తగ్గట్టుగానే ఆదాయంలో వాటా కూడా ఇవ్వాలన్నది వార్తాపత్రికల డిమాండ్‌. నిజానికి ఈ తరహా డిమాండ్లు కొత్త కాదు. 2014లోనే స్పెయిన్‌ ఇలాంటి వాదనతో ఒక చట్టాన్ని తెచ్చింది. వార్తాసంస్థల స్నిపెట్లు ఆన్‌లైన్‌లో ప్రచురించినందుకు గూగుల్‌ సంస్థ వాటికి తన ఆదాయంలో వాటా ఇవ్వాలని ఆదేశించింది.


అందుకు నిరాకరించిన గూగుల్‌ సంస్థ.. స్పెయిన్‌లో తన న్యూస్‌ సర్వీ్‌సను నిలిపివేసింది. స్పెయిన్‌ ప్రభుత్వం చేసిన చట్టం వల్ల మేం వార్తాసేవలను అందించలేకపోతున్నామంటూ స్పెయిన్‌లోని నెటిజన్లను ఉద్దేశించి ఒక ప్రకటన చేసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా అదే తరహాలో చట్టం చేస్తే.. ఈసారి గూగుల్‌ తన సేవలను నిలిపివేస్తానని మొండి పట్టు పట్టలేదు. స్థానిక వార్తాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలుపెట్టింది. దీనికి కారణం.. ఆస్ట్రేలియా సర్కారు తెచ్చిన చట్టాలకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ అంగీకరించడమే. మైక్రోసా్‌ఫ్టకు చెందిన ‘బింగ్‌’ సెర్చింజన్‌ తనకు పోటీగా ఉండడంతో గూగుల్‌ ఈసారి పంతానికి పోలేదు. ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించి వెంటనే సెవెన్‌ వెస్ట్‌ మీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద మీడియా గ్రూపుల్లో అది ఒకటి. అలాగే మీడియా బ్యారన్‌ రూపర్ట్‌ మర్డోక్‌కు చెందిన న్యూస్‌ కార్ప్‌తో కూడా డీల్‌ కుదుర్చుకుంది. మరింతమంది ప్రచురణకర్తలతో ఒప్పందాలు కుదుర్చుకునే యత్నాల్లో ఉంది. మరోవైపు 2014లో స్పెయిన్‌లో గూగుల్‌ చేసిన పనినే ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఆస్ట్రేలియాలో చేసింది. ఆస్ట్రేలియా సర్కారు చేసిన చట్టం ప్రకారం తాము చెల్లింపులు చేయలేమని.. కాబట్టి న్యూస్‌ఫీడ్‌ను ఆపేస్తామని పేర్కొంటూ ఫేస్‌బుక్‌లోని న్యూస్‌ కంటెంట్‌ మొత్తాన్నీ తొలగించింది.


ఫేస్‌బుక్‌ సంస్థ తన ఆదాయం కోసం కేవలం న్యూస్‌ కంటెంట్‌ మీద ఆధారపడకపోవడం, ఫేస్‌బుక్‌ వినియోగదారుల బేస్‌ వేరే కావడమే ఈ ధైర్యానికి కారణం. ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్‌ అయ్యే మొత్తం సమాచారంలో కేవలం 4 శాతం మాత్రమే న్యూస్‌ కంటెంట్‌ ఉంటుంది. అందుకే ఫేస్‌బుక్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యూస్‌ కంటెంట్‌ మొత్తాన్నీ ఒక్కదెబ్బతో తీసేసింది. దీనివల్ల న్యూస్‌ వెబ్‌సైట్ల ట్రాఫిక్‌ బాగా తగ్గిపోవడంతో ఆస్ట్రేలియా సర్కారు మెట్టు దిగి చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఫేస్‌బుక్‌ కూడా రాజీకి వచ్చి వార్తాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాల్లో పడింది. ఆస్ట్రేలియాలో తొలుత మొండిగా వ్యవహరించిన ఫేస్‌బుక్‌.. అమెరికాలో మాత్రం గత ఏడాదే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ వంటి వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.


రూ.వేల కోట్ల ఆదాయం..

బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ నివేదిక ప్రకారం.. 2019-20లో గూగుల్‌, ఫేస్‌బుక్‌ కలిసి మనదేశంలో సంపాదించిన వాణిజ్య ప్రకటనల స్థూల ఆదాయం అక్షరాలా రూ.18,054.9 కోట్లు. అంతకు ముందు సంవత్సరం రూ.11,456.7 కోట్లు. ఈ ఆదాయంలో సింహ భాగం గూగుల్‌ సంస్థదే. 2019-20లో గూగుల్‌ ఆదాయం రూ.11,442.3 కోట్లు. 2018-19లో అది రూ.9,203 కోట్లు. ఫేస్‌బుక్‌ ఆదాయం 2018-19లో రూ.2,253.7 కోట్లు కాగా.. 2019-20లో రూ.6,612.6 కోట్లు. ఈ స్థూల ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలే నికర ఆదాయం శాతం తక్కువే. అయితే, ఆ ఆదాయానికి కూడా కారణం తమ కష్టమే కాబట్టి, అందులో తమ వాటా కూడా ఆ స్థాయిలోనే ఉండాలన్నది వార్తాసంస్థల డిమాండ్‌.


న్యూస్‌ షో కేస్‌..

ఆస్ట్రేలియాలో ఇప్పటికే పలు మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న గూగుల్‌ సంస్థ.. ఆయా సంస్థల న్యూస్‌ కంటెంట్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించడానికి ‘న్యూస్‌ షోకేస్‌’ అనే ఉత్పత్తిని తెరపైకి తెచ్చింది. దీని ద్వారా ప్రదర్శించిన న్యూస్‌ ఫీడ్‌కు సంబంధించి నెలవారీ చెల్లింపులు చేస్తుంది. దీనిపై మూడేళ్లలో రూ.7,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. గూగుల్‌ న్యూస్‌ షోకేస్‌ తొలి భాగస్వామి రాయ్‌టర్స్‌ కాగా.. ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్‌, అర్జెంటీనా తదితర దేశాలకు చెందిన వార్తాసంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి.  త్వరలోనే భారత్‌లోని వార్తాసంస్థలతో కూడా గూగుల్‌ అలా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వార్తాసంస్థలకు అది శుభవార్తే.


గూగుల్‌ లేకపోతే మనలేవా?

గూగుల్‌ ద్వారా వార్తాసంస్థల వెబ్‌సైట్లకు ట్రాఫిక్‌ పెరుగుతుందన్న మాట నిజమే. కానీ, గూగుల్‌ లేనంత మాత్రాన వాటి ఆదరణ తగ్గిపోదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే వార్తాసంస్థలు ‘ఒరిజినల్‌ కంటెంట్‌ క్రియేటర్లు’. గూగుల్‌ ఆ వార్తలను న్యూస్‌ఫీడ్‌ రూపంలో ఇస్తుందంతే. ఉదాహరణకు 2014లో స్పెయిన్‌లో గూగుల్‌ తన సేవలను నిలిపివేయడంతో తొలుత కొన్ని వార్తాసంస్థల వెబ్‌సైట్లకు వ్యూస్‌ తగ్గాయి. కానీ, ఏడాది తిరిగేసరికే ఆయా సైట్లను వీక్షించేవారి సంఖ్య రెట్టింపు అయ్యింది.


సెంట్రల్‌ డెస్క్‌


Updated Date - 2021-02-28T09:28:50+05:30 IST