వైసీపీలో వాటాల వివాదం

ABN , First Publish Date - 2022-07-15T07:43:10+05:30 IST

నిరుపేద కూలీలతో చేయించాల్సిన ఉపాధి పనులను అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి పూర్తి చేయించేశారు.

వైసీపీలో వాటాల వివాదం

ఉపాధి పనుల బిల్లులో భాగాల కోసం మంత్రి వద్దకు పంచాయితీ  

వర్కు ఇచ్చిన వారివద్దే తేల్చుకోమన్న రోజా 

తిరుపతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : నిరుపేద కూలీలతో చేయించాల్సిన ఉపాధి పనులను అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి పూర్తి చేయించేశారు. తీరా బిల్లులు వచ్చాక వాటాల కోసం పోట్లాట పెట్టుకున్నారు. గ్రామ, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవడంతో పంచాయితీ మంత్రి రోజా వద్దకు చేరింది. తనకేమీ తెలియదని, ఎవరు వర్కు ఇచ్చారో వారి వద్దే తేల్చుకోండంటూ మంత్రి మొహమాటం లేకుండా చెప్పేశారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.వడమాలపేట మండలంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్వాపరాలిలా వున్నాయి.బంగారెడ్డి కండ్రిగ పంచాయతీ బుట్టిరెడ్డి కండ్రిగ గ్రామంలో 2019-20వ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద మూడు వీధుల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మించే పనులు మంజూరయ్యాయి. తొమ్మిది నెలల పాటు ఎవరూ పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ పనులు రద్దయ్యాయి. 2020లో మళ్ళీ పనులు మంజూరయ్యాయి. గ్రామానికి ఉపయోగపడే పనులు ఎవరో ఒకరు చేయండంటూ మండల స్థాయి నేత ఒకరు పురమాయించగా గ్రామస్తులకు తెలిసే బంగారెడ్డి కండ్రిగకు చెందిన వైసీపీ నేత మురగారెడ్డి సొంత డబ్బు ఖర్చు చేసి సిమెంటు రోడ్లు వేయించారు. మంజూరైన మేరకు మొత్తం రూ. 17.50 లక్షలకు బిల్లులు పెట్టారు. నిబంధనల ప్రకారం అయితే పంచాయతీ కార్యదర్శి ఉపాధి హామీ కూలీలతో పనులు చేయించాలి. కానీ ఇక్కడ వైసీపీ నేత పనులు చేయించారు. ఏడాదిన్నర పాటు బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. తర్వాత రూ. లక్షన్నర మినహా మిగిలిన మొత్తం విడుదలైంది. పెండింగ్‌ పడిన రూ. లక్షన్నర నిధులు రెండు నెలల కిందట విడుదలయ్యాయి. అప్పుడు వివాదం మొదలైంది. బుట్టిరెడ్డి కండ్రిగకు చెందిన వైసీపీ నేత, మాజీ సర్పంచ్‌ వాసుదేవరెడ్డి బిల్లులో తన వాటా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇద్దరం కలసి పనులు చేశామని, పెట్టుబడి పెట్టిన డబ్బు, దానికైన వడ్డీ పోనూ మిగిలిన మొత్తం చెరిసగం పంచాలంటూ మండల స్థాయి నేతలను ఆశ్రయించారు. తిరుపతిలో పంచాయితీ జరగ్గా మండల స్థాయి నేత ఒకరు వాసుదేవరెడ్డికి రూ. 30వేలు చెల్లించాలని తీర్మానం చేశారు. దానికి వాసుదేవరెడ్డి కుటుంబం అంగీకరించలేదు. ఇద్దరం కలసి పని చేసినందున సగం వాటా ఇవ్వాలని పట్టుబట్టడంతో వివాదం కొనసాగుతూనే వుంది. ఈ నేపధ్యంలో బుధవారం మంత్రి రోజా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుట్టిరెడ్డి కండ్రిగకు వెళ్ళారు. గ్రామంలో వాసుదేవరెడ్డి కుటుంబం పక్క గ్రామానికి చెందిన మురగారెడ్డి తమ గ్రామంలో ఉపాధి పనులు ఎలా చేశారని ప్రశ్నిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంత్రి ఎదుట ఈ విషయమై వాసుదేవరెడ్డి భార్య బుజ్జమ్మ మాట్లాడుతూ తమకు అన్యాయం జరిగిందంటూ బావురుమన్నారు. అయితే మంత్రి తనకివేమీ తెలియవని, ఉపాధి పనులు ఎవరు కేటాయించారో వారి వద్దే తేల్చుకోవాలంటూ సమాధానమిచ్చి వెళ్ళిపోయారు. ఇందులో ఎవరి వాటా ఎంతన్నది పక్కన పెడితే గ్రామ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అధికార పార్టీ నేతలు తమ సొంత ఆదాయ వనరుగా ఎలా మార్చుకుంటున్నారనేది ఈ ఉదంతం బయట పెట్టింది.

Updated Date - 2022-07-15T07:43:10+05:30 IST