రూ.240 కోట్ల రుణం ఎగవేత కేసు.. శరవణా స్టోర్లకు సీలు

ABN , First Publish Date - 2022-01-20T14:41:49+05:30 IST

ఇండియన్‌ బ్యాంకులో రూ.240 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించని కేసులో నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణ సంస్థ శరవణా స్టోర్స్‌కు చెందిన రెండు షాపులను బ్యాంకు అధికారులు జప్తు చేశారు. స్థానిక

రూ.240 కోట్ల రుణం ఎగవేత కేసు.. శరవణా స్టోర్లకు సీలు

- ఎగ్మోర్‌ కోర్టు ఆదేశం

- చర్యలు తీసుకున్న బ్యాంకు అధికారులు


అడయార్‌(చెన్నై): ఇండియన్‌ బ్యాంకులో రూ.240 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించని కేసులో నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణ సంస్థ శరవణా స్టోర్స్‌కు చెందిన రెండు షాపులను బ్యాంకు అధికారులు జప్తు చేశారు. స్థానిక ఎగ్మోరు కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. స్థానిక టి.నగర్‌ ప్రధాన కేంద్రంగా శరవణా స్టోర్స్‌ వస్త్రవ్యాపారం నిర్వహిస్తోంది. టి.నగర్‌ రంగనాథన్‌ వీధి, నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డులోని దుకాణాల విస్తరణ కోసం దుకాణాల యజమానులు ఇండియన్‌ బ్యాంకు నుంచి 2017లో రూ.240 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఆ తర్వాత రుణం, దాని వడ్డీ చెల్లించకుండా సాగదీస్తూ వచ్చారు. దీంతో పలుమార్లు శరవణ యాజమాన్యాన్ని బ్యాంకు అధికారులు సంప్రదించి రుణం తిరిగి చెల్లించాలని కోరినా కానీ, వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో శరవణ యాజమాన్యం తీసుకున్న రుణం, దానికి వడ్డీతో కలిపి మొత్తం రూ.450 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించేలా దుకాణ యజమానులకు ఆదేశించాలని కోరుతూ బ్యాంకు అధికారులు ఎగ్మోరు కోర్టులో పిటిషన్‌ వేశారు.. ఈ కేసు విచారణ పలుమార్లు జరిగింది. ఈ విచారణ సమయంలో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు రంగనాథన్‌ వీధి, నార్త్‌ ఉస్మాన్‌ రోడ్డులో ఉన్న శరవణా స్టోర్స్‌ ప్రైమ్‌ దుకాణాలను జప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో నగర పోలీసుల సహకారంలో బ్యాంకు అధికారులు బుధవారం ఉదయం ఈ రెండు దుకాణాలను సీజ్‌ చేశారు. ఈ జప్తుకు సంబందించి ఎగ్మోర్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీలను దుకాణాలకు అంటించారు. ఆ సమయంలో ఆయా దుకాణాల్లో ఉన్న సిబ్బంది, కొనుగోలుదార్లను పోలీసులు బయటకు పంపించి సీలు వేశారు. నగరంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ అయిన శరవణా స్టోర్స్‌ భవనాలకు బ్యాంకులోను వ్యవహారంలో జప్తు చేయడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-01-20T14:41:49+05:30 IST