లొంగుబాటు దిశగా శారదక్క?!

ABN , First Publish Date - 2021-09-13T18:06:03+05:30 IST

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ..

లొంగుబాటు దిశగా శారదక్క?!

ప్రజాప్రతినిధుల ద్వారా పోలీసుల ఆశ్రయం

దివంగత మావోయిస్టు నేత హరిభూషణ్‌ భార్య

పార్టీలో పలు కీలక పదవుల నిర్వహణ


గంగారం(హన్మకొండ): మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ భార్య వెంకటాపురం ఏరియా కమిటీ, తూర్పు గోదావరి జిల్లా శబరి ఏరియా కమిటీ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యురాలు జజ్జరి సమ్మక్క అలియాస్‌ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దండకార్యణంలో కరోనాతో భర్త హరిభూషణ్‌ మృతి చెందిన తర్వాత శారదక్క కూఛ్ఛి కొవిడ్‌ బారినపడి కోలుకుంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె.. మనోవేదనకు గురై అనారోగ్య పాలవడంతో పార్టీ ఆదేశానుసారం జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు ప్రజాప్రతినిధుల సహకారంతో శారదక్క మూడురోజుల కిందట వరంగల్‌ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. 


కీలక నేతగా..

మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలకేంద్రానికి చెందిన జజ్జరి ముత్తయ్య-లింగమ్మ దంపతులకు మూడో సంతానంగా సమ్మక్క జన్మించారు. ఆమె ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే కొనసాగింది. ఆ దశలోనే ప్రజా నాట్యమండలిలో గాయకురాలిగా, నృత్య ప్రదర్శనలతో గుర్తింపు పొంది నక్సలైట్‌ పార్టీలో కొరియర్‌గా పనిచేస్తూ పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో మండలంలోని మడగూడెంకు చెందిన సమ్మక్క.. మేనబావ అయిన యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌తో ఏర్పడిన పరిచయంతో 1990లో దళంలో చేరారు. కొత్తగూడ మండలం పాండవ దళంలో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రమంలోనే పీపుల్స్‌వార్‌ పార్టీ అధినాయకత్వం హరిభూషణ్‌కు శారదక్కకు దండకారణ్యంలోనే వివాహం చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పాల్వంచ డివిజన్‌ కిన్నెర దళంలో సభ్యురాలిగా పనిచేశారు. ఆ సమయంలోనే ప్రభుత్వం ఆమెకు రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది. 


2008లో అనారోగ్య కారణాలతో శారదక్క పోలీసులకు లొంగిపోయింది. దీంతో ఆ రివార్డును ప్రభుత్వం ఆమెకు అందచేశారు. నాలుగేళ్లు గంగారంలో ఇంటివద్ద వ్యవసాయపనులు చేసుకున్న ఆమె.. 2012లో  భర్త యాప నారాయణ చొరవతో తిరిగి దళంలో చేరారు. భర్త హరిభూషణ్‌తో కలిసి పనిచేస్తూనే 2015లో చర్ల-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శిగా, 2016లో దుమ్ముగూడెం-చింతూరు ఏరియా కమిటీ కార్యదర్శిగా శారదక్క పదవులు చేపట్టారు. ఉమ్మడి బస్తర్‌ జిల్లా ప్రజానాట్యమండలి అధ్యక్షురాలిగా కొనసాగుతూ.. ఆదివాసీ మహిళలకు తెలుగును బోధించారు. అక్కడే గోండు, హిందీ భాషలో ప్రావీణ్యం పొందారు. 2019లో ఈస్ట్‌ గోదావరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్‌ కమిటీ మెంబర్‌ (డీసీఎం)గా పనిచేశారు. భర్త హరిభూషణ్‌ మరణం తర్వాత మనోవేదనతో అనారోగ్యం పాలైంది. దీంతో ఆమె జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-13T18:06:03+05:30 IST