ఆరంభం అదిరింది..

ABN , First Publish Date - 2021-03-01T05:24:09+05:30 IST

ఈ ఏడాది (2021) షార్‌లో ఆరంభమే అదిరింది. ఆదివారం పీఎస్‌ఎల్వీ-సీ51 గురితప్పకుండా సునాయాసంగా లక్ష్యానికి చేరి 19 వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసి షార్‌కు హుషారు కలిగించింది.

ఆరంభం అదిరింది..
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోతున్న పీఎస్‌ఎల్లీ-సీ51

నింగిలోకి విజయాశ్వం పీఎస్‌ఎల్వీ -సీ 51

తొలి ప్రయోగ విజయంతో షార్‌ హుషార్‌ 

ఈ ఏడాది మరో ఏడు రాకెట్‌ ప్రయోగాల లక్ష్యం 


శ్రీహరికోట, (సూళ్లూరుపేట) ఫిబ్రవరి 28 : ఈ ఏడాది (2021) షార్‌లో ఆరంభమే అదిరింది. ఆదివారం పీఎస్‌ఎల్వీ-సీ51 గురితప్పకుండా సునాయాసంగా లక్ష్యానికి చేరి 19 వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసి షార్‌కు హుషారు కలిగించింది. గత ఏడాది కేవలం రెండు ప్రయోగాలకే షార్‌ను కరోనా కట్టడి చేసింది. అయితే ఈ ఏడాది తొలి ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్‌ శివన్‌ మరో ఏడు రాకెట్‌లు ఈ ఏడాదిలో ప్రయోగిస్తామని ప్రకటించడం విశేషం. 2018లో నాలుగు పీఎస్‌ఎల్వీలు, 1 జీఎస్‌ఎల్వీ, ఒక మార్క్‌3, 2019లో 5 పీఎస్‌ఎల్వీలు, ఒక జీఎస్‌ఎల్వీ, ఒక మార్క్‌-3 షార్‌ నుంచి ప్రయోగించారు. దాంతో 2020లో ఏకంగా  12 రాకెట్‌లు ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. కాని అనూహ్యంగా కొవిడ్‌ ఇస్రో లక్ష్యాన్ని నీరుగార్చేసింది. గత ఏడాది కొవిడ్‌తో అంతా అతలాకుతలమైన ఇస్రో కోలుకొని నవంబరు, డిసెంబరులలో ఒక్కొక్క పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగిం చింది. ఈ ఏడాది పీఎస్‌ఎల్వీ-సీ51ని విజయవంతంగా నిర్వహించి రాకెట్‌ ప్రయోగాల పరంపరకు సిద్ధమైంది.  దాంతో షార్‌ బిజీ అయ్యే పరిస్థితులు కలుగుతున్నాయి.

 

ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీసిటీ ఎండీ అభినందనలు 


పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, శ్రీసిటీ వ్యవస్థాపక నిర్వాహక సంచాలకుడు రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో చైర్మన్‌ శివన్‌, షార్‌ డైరెక్టర్‌ రాజరాజ ఆర్మూగం, ఇతర శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. 


ఉపగ్రహాన్ని ఎగరేసిన తిరుపతి కుర్రాళ్లు


 షార్‌ నుంచి నింగిలోకి ఎస్డీ శాట్‌


తిరుపతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోట నుంచి ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌  ద్వారా 19 ఉపగ్రహాల ను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. వీటిల్లో ఒక ఉపగ్రహం ఏడుగురు విద్యార్ధులు రూపొందించింది. ఈ ఏడుగురిలో  ఇద్దరు తిరుపతివాసులు. ఒకరు యజ్ఞసాయి. మరొకరు రఘుపతి. ఈ ఇద్దరు తిరుపతి కుర్రాళ్ళు ఇస్రోతో కలిసి ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం అయ్యారు. 


మన తిరుపతి కుర్రాళ్లు


 గతంలో పంపిన రెండు ఉపగ్రహాల రూపకల్పనలో పాలుపంచుకున్న తిరుపతికి చెందిన యజ్ఙసాయి తాజా ఉపగ్రహం సతీశ్‌ఽధావన్‌ శాట్‌లోనూ భాగం పంచుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన కీర్తిచంద్‌, నల్గొండకు చెందిన అబ్దుల్‌ కషిఫ్‌లతోపాటూ యజ్ఙసాయి, రఘుపతి ఈ ప్రాజెక్టులో పనిచేశారు. యజ్ఙసాయి విద్యావంతుల కుటుం బం నుంచి రాలేదు. తిరుపతికి చెందిన పంబాల రాము, వాణి దంపతుల కుమారుడు ఇతను. ట్రావెల్స్‌ నిర్వహించే రాముది మధ్యతరగతి కుటుంబం. వీరి కుటుంబంలో పదవతరగతిపైన ఎవరూ చదవలేదు. చదువుమీద శ్రద్ధ, కృషి యజ్ఙసాయిని ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చేసేలా చేశాయి. అంతరిక్షశాస్త్రం పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి ఇతన్ని కిడ్జ్‌ ఇండియాలో భాగం చేసింది. 

 ఇక రఘుపతి తిరుపతి సుందరయ్య నగర్‌కు చెందిన పళని, మంజుల దంపతుల  కుమారుడు. పళని సివిల్‌ సప్లైస్‌ విభాగంలో హమాలీగా పనిచేస్తున్నారు. రఘుపతి పదోతరగతి వరకు స్థానిక లక్ష్మీపురంలోని ప్రభుత్వ తమిళ మీడియం స్కూల్లో చదువుకున్నారు. ఎంటెక్‌ పూర్తిచేసిన ఇతను స్పేస్‌ సైన్స్‌ పట్ల ఉన్న ఇష్టంతో  స్పేస్‌కిడ్జ్‌లో చోటు సంపాదించాడు. ప్రతిష్టాత్మకమైన ప్రయోగంలో వీరిద్దరూ భాగమయ్యారు.  








Updated Date - 2021-03-01T05:24:09+05:30 IST