Jun 20 2021 @ 18:58PM

శంకర్‌కి మాళవిక.. చరణ్‌కి కియారా!

సంచలన దర్శకుడు శంకర్‌, మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందబోతోన్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ విషయంలో అనేకానేక వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్ల పేర్లు ఈ సినిమా విషయంలో బాగా వినబడుతున్నాయి. అందులో ఒకరు తమిళ, తెలుగు, హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న మలయాళ భామ మాళవికా మోహనన్‌ కాగా, మరొకరు టాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసి, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా బిజీగా మారిన కియారా అద్వానీ.


తమిళంలో విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రంలో నటించి, సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయించుకుంది మాళవిక. ఈ చిత్రం తర్వాత ఆమెకు సినీ అవకాశాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ కోవలో సినీ దర్శకుడు కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నటించే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. లాక్‌డౌన్‌ తర్వాత పూర్తి స్థాయిలో ఊపందుకోనుంది. రామ్‌ చరణ్‌తో చేసే చిత్రం కోసం శంకర్‌ ఈ భామను పరిశీలిస్తున్నట్లుగా టాక్‌ నడుస్తుంటే.. టాలీవుడ్‌ సైడ్‌ నుంచి మాత్రం కియారా పేరు గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో 'భరత్‌ అనే నేను', 'వినయ విధేయ రామా' చిత్రాలలో నటించిన కియారాకు ఇప్పుడు బాలీవుడ్‌లో తిరుగులేదు. అందుకే కియారాకు భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చైనా సరే.. ఈ సినిమాలో నటింపజేయాలని, తద్వారా బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీ అవుతుందని చరణ్‌, దిల్‌ రాజులు ఆలోచిస్తున్నారట. మరి చివరికి ఈ సినిమాలో నటించే అవకాశం ఏ భామను వరిస్తుందో వేచిచూడాల్సిందే.