Apr 14 2021 @ 12:49PM

శంక‌ర్ - ర‌ణ్‌వీర్ కాంబోలో అపరిచితుడు హిందీ రీమేక్‌..! ‌

క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అన్నియన్  ( అపరచితుడు ) ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్ర‌మ్ మూడు విభిన్నమైన పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక శంకర్ కెరీర్‌లో కూడా అపరచితుడు ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయిది. రామానుజం, రెమో, అపరిచితుడుగా ..విక్ర‌మ్  నటన మహా అద్భుతం. ఈ కథ కేవలం విక్రమ్ కోసమే తయారైనట్టు సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమాకి హారీస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమా రేంజ్‌ని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. 2005లో తమిళంలో వచ్చిన అన్నియన్ అదే సమయంలో తెలుగు డబ్బింగ్ సినిమా అపరిచితుడుగా వచ్చి సెన్షేషనల్ హిట్ సాధించింది.

కాగా ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కించడానికి రంగం సిద్దమవుతోంది. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై డా. జ‌యంతిలాల్‌ గడ నిర్మించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా దర్శకుడు శంకర్, నిర్మాత జ‌యంతిలాల్‌, హీరో ర‌ణ్‌వీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. త్వరలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం. కాగా శంకర్ - మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక పాన్ ఇండియన్ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. అలాగే కమల్ హాసన్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 కూడా పూర్తి కావాల్సి ఉంది.