వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే శంకర్‌ హత్య

ABN , First Publish Date - 2021-11-30T05:39:50+05:30 IST

వివాహే తర సంబంధానికి అడ్డువస్తున్నాడని పథకం ప్రకారం ప్రియురాలి భర్తను ఇంటికి పిలిచి పథకం ప్రకారం హత్య చేశాడు.

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే శంకర్‌  హత్య
వివరాలు వెల్లడిస్తున్న సీపీ

- నిందితుడు రాజు అరెస్టు

- వివరాలు వెల్లడించిన సీపీ చంద్రశేఖర్‌రెడ్డి


జ్యోతినగర్‌, నవంబరు 29: వివాహే తర సంబంధానికి అడ్డువస్తున్నాడని పథకం ప్రకారం ప్రియురాలి భర్తను ఇంటికి పిలిచి  పథకం ప్రకారం హత్య చేశాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు క్రైమ్‌ సినిమాల సీన్‌లను ఫాలో అయ్యాడు... మృతదేహాన్ని ముక్కలుగా చేసి నాలుగు ఠాణాల పరిధిలో పడేశాడు. సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీకి చెందిన మీ సేవ కేంద్రం ఉద్యోగి కాంపెల్లి శంకర్‌ హత్య కేసులో నిందితుడు పోయిల రాజును పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. సహకరించిన మృతుడి భార్య ను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు  వెల్లడించారు. శంకర్‌ భార్య హేమలత ఎన్టీపీసీలోని ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పొయిల రాజు స్వీపర్‌గా పని చేస్తున్నాడు. అతనికి శంకర్‌ భార్య హేమలతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శంకర్‌కు తెలియడంతో వారి కుటుంబంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. తనను భర్త వేధిస్తున్నాడని ఆమె ప్రియుడు పొయిల రాజుతో చెప్పుకునేది. ఎలాగైనా శంకర్‌ను కడతేర్చాలని హేమలత, రాజు పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా రాజు రెండు కత్తులను కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ నెల 25న రాత్రి శంకర్‌ సెల్‌కు హేమలత, రాజు చనువుగా ఉన్న ఫొటోలను పంపించాడు. దీంతో శంకర్‌కు ఫోన్‌ చేసి గొడవ పడ్డాడు. ఇదే అదనుగా భావించి అతన్ని రెచ్చగొట్టి ఎన్టీపీసీ టీటీఎస్‌లోని తన క్వార్టర్‌కు పిలిచాడు. అతడితో మద్యం తాగించాడు. అనంతరం బీరు సీసాతో శంకర్‌ తలపై రాజు బలంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం కత్తులతో తల, మెడపై నరికి శంకర్‌ను హత్య చేశాడు. 

- సినిమా తరహాలో తప్పించుకునే యత్నం

శంకర్‌ను హత్య చేసిన తరువాత క్రైం సినిమాల్లో చూపిన విధంగా సాక్ష్యాధారాలను మాయం చేయాలని భావించాడు. శంకర్‌ మృతదేహాన్ని ఏడు భాగాలుగా నరికాడు. వీటిని హత్య చేసిన రాత్రి మూట కట్టుకుని ఎన్టీపీసీ, బసంత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తల, చేతులు, కాళ్లను పడవేశాడు. అనంతరం హేమలతకు శంకర్‌ను హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. మిగిలిన శరీర భాగాలను కూడా పడవేయాలని ఆమె సూచించడంతో ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మేడిపల్లి ఓసీపీ4 శ్మశానవాటికలో, మిగిలిన రెండు శరీర భాగాలను గోదావరిఖని సప్తగిరికాలనీలోని ఆర్టీసీ క్వార్టర్ల సమీపంలో వేశాడు. బైక్‌ను పెద్దపల్లి వద్ద వదిలేశాడు. శంకర్‌ కనబడకపోవడంతో అతని తల్లి కాంపెల్లి పోచమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అయ్యింది. అతని శరీర భాగాలు ఈ నెల 27వ తేదీన లభ్యమవడంతో తన కుమారుడు శంకర్‌ను కోడలు హేమలత, ఆమె ప్రియుడు రాజు హత్య చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజును ఎన్టీపీసీ పవర్‌ ప్రాజెక్టు వద్ద పట్టుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయాలు వెలుగు చూశాయి. అతడు చూపిన చోట్ల శరీర భాగాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజును అరెస్టు చేశామని, అతనికి సహకరించిన హేమలతను అదుపులోకి తీసుకున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసును పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌ పర్యవేక్షణలో చాకచక్యంగా విచారణ చేసి నిందితులను పట్టుకున్నారన్నారు. కేసును ఛేదించిన రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ, అంతర్గాం, రామగుండం ఎస్‌ఐలతో పాటు సిబ్బంది సుమన్‌, మల్లికార్జున్‌లను సీపీ అభినందించి క్యాష్‌ రివార్డులను అందజేశారు. విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, ఎస్‌ఐలు స్వరూప్‌రాజ్‌, శ్రీధర్‌, శైలజ, ప్రొబెషనరీ ఎస్‌ఐలు మహేష్‌, రాజశేఖర్‌, శరణ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T05:39:50+05:30 IST