Apr 15 2021 @ 19:45PM

‘అన్నియన్’ నిర్మాతకు శంకర్‌ స్ట్రాంగ్‌ రిప్లయ్‌

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌.. టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ్‌తో రీసెంట్‌గా ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే.. శంకర్‌ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌తో 'అన్నియన్‌' (అపరిచితుడు) చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగాభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. కానీ చరణ్‌ సినిమా అయిన తర్వాతే ఈ చిత్ర రీమేక్‌ ఉంటుందని మెగాభిమానులకు శంకర్‌ క్లారిటీ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్‌లో.. ఇప్పుడు ‘అన్నియన్’ నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్‌ శంకర్‌కు మెయిల్‌ ద్వారా ఓ సందేశం పంపడం, దానికి శంకర్‌ స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అవడం వంటివి.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారాయి. 


ముందుగా రవిచంద్రన్‌.. శంకర్‌కు పంపిన మెసేజ్‌లో.. 'అన్నియన్‌' చిత్రానికి సంబంధించిన కథను స్వర్గీయ సుజాత గారి దగ్గర నుంచి తాను హక్కులు కొనుగోలు చేశానని, పూర్తి హక్కులు నా దగ్గర ఉంటే.. నన్ను సంప్రదించకుండా ఆ సినిమా రీమేక్‌ చేయడం ఏమటని శంకర్‌ని ప్రశ్నించాడు. కాదు, కూడదు అంటే లీగర్ సమస్యలు ఫేస్‌ చేయాల్సి ఉంటుందని శంకర్‌ని నిర్మాత రవిచంద్రన్‌ హెచ్చరిస్తూ మెసేజ్‌ పంపాడు. ఈ మెసేజ్‌కు శంకర్‌ కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్‌ అయ్యారు. 

శంకర్‌ రియాక్ట్ అవుతూ.. '' 'అన్నియన్‌' సినిమాకు సంబంధించి హక్కులు మీ దగ్గర ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం శంకర్‌ అని టైటిల్స్‌లో పడుతుంది. ఈ చిత్ర కథ మొత్తం నాదే. మీరు సుజాతగారి దగ్గర రైట్స్‌ తీసుకున్నానని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం విషయంలో సుజాతగారికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం సుజాతగారు డైలాగ్స్‌ వరకు పార్ట్‌ అయ్యారు. ఈ సినిమాను ఎలా అయినా రీమేక్‌ చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. మీకు ఎటువంటి హక్కులు లేవు. ఈ సినిమాతోనే మీకు నిర్మాతగా గుర్తింపు వచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా హక్కులు నావంటూ.. నా ప్రాజెక్ట్స్‌ ద్వారా గుర్తింపు పొందాలనుకోవడం దురదృష్టకరం. నా వివరణ తర్వాత అయినా.. మీరు మీ బుద్ది మార్చుకుంటారని భావిస్తున్నాను. నిరాధారమైన వార్తలతో కోర్టులు అంటూ బెదిరించడం మానుకోండి. నా కెరీర్‌పై జరుగుతున్న ఇటువంటి అన్యాయమైన ఆరోపణలను ఖండిస్తూ.. మీకు వివరణ ఇస్తున్నాను.." అని శంకర్‌ పేర్కొన్నారు.