షేన్‌వార్న్ గదిలో రక్తపు మరకలు.. బాత్ టవల్స్: అసలేం జరిగింది?

ABN , First Publish Date - 2022-03-06T22:44:09+05:30 IST

చూస్తుంటే ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ మృతి మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి హాలిడేస్

షేన్‌వార్న్ గదిలో రక్తపు మరకలు.. బాత్ టవల్స్: అసలేం జరిగింది?

కో సమూయి (థాయ్‌లాండ్): చూస్తుంటే ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ మృతి మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి హాలిడేస్ కోసం థాయిలాండ్ వచ్చిన వార్న్.. శుక్రవారం గుండెపోటుతో మరణించినట్టు తెలిసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది.


పొద్దుపోతున్నా డిన్నర్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఓ స్నేహితుడు వార్న్ గదికి వెళ్లేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో కంగారు పడిన అతడు ‘సీపీఆర్’ ద్వారా వార్నర్‌ను బతికించే ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోవడంతో వెంటనే థాయ్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వార్న్ మృతి చెందినట్టు ప్రకటించారు. 


వార్న్ గుండెపోటుతోనే మరణించినట్టు వైద్యులు కూడా ధ్రువీకరించారు. అయితే, వార్న్ మృతిపై దర్యాప్తు ప్రారంభించిన థాయ్ పోలీసులు తాజాగా వార్న్ ఉన్న విల్లాలోని గదిని పరిశీలించారు. ఆ గదిలో రక్తపు మరకలు, బాత్ టవల్స్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో వార్న్ మృతిపై ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి. థాయ్ పోలీసులను ఉటంకిస్తూ ‘స్కై న్యూస్.కామ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. వార్న్ గదిలో పెద్దమొత్తంలో రక్తపు మరకలను గుర్తించినట్టు స్థానిక ప్రావిన్షియల్ పోలీసులు వెల్లడించినట్టు థాయ్ మీడియా కూడా పేర్కొంది.


అయితే, ఈ రక్తపు మరకల వెనక అనుమానించాల్సిందేమీ లేదని, అతడికి సీపీఆర్ ప్రారంభించినప్పుడు రక్తపు వాంతి చేసుకుని ఉంటాడని, గదిలో ఉన్న రక్తపు మరకలు అవే అయి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.


వార్న్ తాను చనిపోవడానికి ముందు ఓ వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకున్నాడని, అప్పుడు అతడి గుండెను కూడా పరీక్షించారని కో స్యామ్యూస్ బో ఫుట్ పోలీస్ స్టేషన్ సూపరింటిండెంట్ తెలిపారు. ఆ సమయంలో అతడి శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ను గుర్తించలేదని చెప్పారు. కాబట్టి వార్న్  మృతిని అనుమానాస్పదంగా పరిగణించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-06T22:44:09+05:30 IST