Shameful: జెండా కోసం పేదల తిండి లాక్కుంటారా?: వరుణ్‌గాంధీ

ABN , First Publish Date - 2022-08-10T22:15:50+05:30 IST

జాతీయ జెండా కోసం పేదల తిండి లాక్కోవద్దని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్రాన్ని..

Shameful: జెండా కోసం పేదల తిండి లాక్కుంటారా?: వరుణ్‌గాంధీ

చండీగఢ్: జాతీయ జెండా కోసం పేదల తిండి లాక్కోవద్దని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) కేంద్రాన్ని విమర్శించారు. రేషన్ షాప్ (Ration shop) కోసం వెళ్లిన తమతో బలవంతంగా రూ.20 వసూలు చేసి జాతీయ జెండా (National Flag) కొనిపించారని పలువురు వ్యక్తులు ఆరోపించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ ఘాటుగా స్పందించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు పేదలకు భారంతా మారితే అంతకంటే దురదృష్టం ఉండదని ఆయన అన్నారు. ''జాతీయ జెండా కొంటేగానీ రేషన్ ఇవ్వమంటూ బలవంతం చేస్తున్నారు. జాతీయ పతాకం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. పేదల తిండి గింజలు లాక్కొని త్రివర్ణ పతాకం ధరలు వసూలు చేస్తుండటం సిగ్గుచేటు'' అని ఆయన వ్యాఖ్యానించారు.


హర్యానాలోని కర్నాల్‌లో ఓ వార్తా సంస్థ రికార్డు చేసిన వీడియోలో పలువురు తమ గోడు వెలిబుచ్చారు. ప్రభుత్వ చౌకధరల దుకాణానికి రేషన్ కోసం వెళ్తే బలవంతంగా తమ నుంచి జాతీయ జెండా కోసం రూ.20 వసూలు చేశారని వారు వెల్లడించారు. జాతీయ జెండా కొనకపోతే రేషన్ ఇవ్వవద్దని వచ్చిన ఆదేశాలనే తాము అమలు చేస్తున్నామని డీలర్ తమతో అన్నట్టు ఒక వ్యక్తి ఆ వీడియోలో వాపోయాడు.


డిప్యూటీ కమిషనర్ వివరణ...

కాగా, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న రేషన్ డిపో ఓనర్‌ లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ అనిష్ యాదవ్ తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజల సౌకర్యార్థమే రేషన్ దుకాణాల్లో జాతీయ జెండాల అమ్మకానికి ఉంచారని, ఇష్టం ఉన్నవాళ్లే కొనుక్కోవచ్చని ఆయన చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కింద హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15 వరకూ ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగురవేయాలని ప్రధానమంత్రి ఇటీవల పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమ ఖాతాల డీపీలుగా జాతీయజెండాను పెట్టుకోవాలని కూడా కోరారు.

Updated Date - 2022-08-10T22:15:50+05:30 IST