ఊరొదిలి పోవాల్సిందేనా..!

ABN , First Publish Date - 2022-05-26T07:08:09+05:30 IST

పలమనేరు మండలం ఇందిరానగర్‌కు చెందిన రైతు సుబ్రహ్మణ్యం(65)ను ఏనుగు తొక్కి చంపిందని బుధవారం ఉదయాన్నే తెలియగానే స్థానికులు అట్టుడికిపోయారు. ఆ గ్రామం.. పరిసరాల ప్రాంతాలకు చెందిన రైతులు క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకొన్నారు. కొన్నేళ్లుగా ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం.. వాటిని అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకోకపోవడాన్ని.. ఏనుగు దాడిలో సుబ్రహ్మణ్యం చనిపోవడాన్ని నిరసించారు పలమనేరు- గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారికి అడ్డంగా రాతికూసాలు వేసి బైఠాయించారు.

ఊరొదిలి పోవాల్సిందేనా..!
ఏనుగు దాడిలో చనిపోయిన సుబ్రమణ్యం

రైతును ఏనుగు తొక్కి చంపిన ఘటనతో రోడ్డెక్కిన స్థానికులు 


గజదాడులను అరికట్టాలంటూ 6 గంటలపాటు రాస్తారోకో 


ఇప్పటి మార్కెట్‌ రేట్లతో పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ 


పలమనేరు, మే 25: పలమనేరు మండలం ఇందిరానగర్‌కు చెందిన రైతు సుబ్రహ్మణ్యం(65)ను ఏనుగు తొక్కి చంపిందని బుధవారం ఉదయాన్నే తెలియగానే స్థానికులు అట్టుడికిపోయారు. ఆ గ్రామం.. పరిసరాల ప్రాంతాలకు చెందిన రైతులు క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకొన్నారు. కొన్నేళ్లుగా ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం.. వాటిని అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకోకపోవడాన్ని.. ఏనుగు దాడిలో సుబ్రహ్మణ్యం చనిపోవడాన్ని నిరసించారు పలమనేరు- గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారికి అడ్డంగా రాతికూసాలు వేసి బైఠాయించారు. ఉదయం 6.30 గంటలకే వీరు మెరుపు సమ్మెకు దిగడంతో రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పది గంటల సమయంలో చిత్తూరు డీఎ్‌ఫవో రవిశంకర్‌, పలమనేరు ఆర్డీవో పద్మావతి రైతుల వద్దకు చేరుకున్నారు. దాదాపు ఒకటిన్నర గంటలపాటు చర్చించారు. ఏనుగుల దాడులతో తాము పడుతున్న బాధలను రైతు సంఘనాయకులు ఉమాపతి నాయుడు, సుబ్రమణ్యం, రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుచేసి సాగుచేసిన పంటలను ఏనుగులు తినిపోతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనిదే తాము ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. 2011లో నిర్ణయించిన ధరల మేరకు కాకుండా, ఇప్పటి మార్కెట్‌ ధరల ప్రకారం పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. ఏనుగుల సమస్యను వెంటనే పరిష్కరించకుంటే తాము గ్రామాలను వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదనతో మాట్లాడారు. 


ప్రభుత్వ పరిశీలనలో పరిహారం పెంపు 


పంటలకు నష్టపరిహారం పెంపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఏనుగుల దాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారంతోపాటు పింఛను మంజూరు చేస్తామన్నారు.  సుబ్రమణ్యం కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ నాయకుడు శివాడి గోవింద్‌ డిమాండు చేశారు. తమ కమిటీలో సుబ్రహ్మణ్యం సభ్యుడన్నారు. ఈ ఆందోళనలో టీడీపీ నాయకులు నాగరాజరెడ్డి, జగదీ్‌షనాయుడు, వైసీపీ నేతలు బాలాజినాయుడు, రాజారెడ్డి, వివిధ సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు. అధికారుల హామీతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రైతులు ఆందోళన విరమించారు. పలమనేరు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పలమనేరు రేంజిలోని రేంజర్‌ శ్రీనివాసులతో పాటు అటవీ సిబ్బంది రైతుల వద్దకు వచ్చారు. 


మధ్యాహ్నం తర్వాత మృతదేహం తరలింపు 


రైతుల ఆందోళన ముగిశాక సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ముగిశాక కుటుంబీకులకు మృతదేహాన్ని అందజేశారు. కాగా, ఆస్పత్రి వద్ద సుబ్రహ్మణ్యం కుటుంబీకులను చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే వెంకటేగౌడ కలిసి పరిహారానికి సంబంధిచి రూ.2.5 లక్షల చెక్కు అందజేశారు. మిగిలిన రూ.2.5 లక్షలను బాధిత కుటుంబం పేరిట బ్యాంకులో డిపాజిట్‌ వేయనున్నారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యంకు ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం ఉన్నారు. 






ఇలా జరిగింది


‘బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మామిడి తోపు సమీపంలో బహిర్భూమికని సుబ్రహ్మణ్యం వెళ్లారు. మామిడి తోటలోనుంచి వచ్చిన ఏనుగు అతడిపై దాడి చేసింది. రోడ్డు సమీపం వరకు దాదాపు 200 అడుగుల దూరం లాక్కొచ్చి పడేసింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు’ అంటూ సంఘటన గురించి గ్రామస్తులు డీఎ్‌ఫవో రవిశంకర్‌కు వివరించారు. 

Updated Date - 2022-05-26T07:08:09+05:30 IST