తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తిపీఠాలు..దేనికదే ప్రత్యేకం!

ABN , First Publish Date - 2020-10-25T03:59:51+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఒక శక్తిపీఠం ఉన్నాయి. ఆలంపూర్‌లో ఐదవ శక్తిపీఠం ఉంది. శ్రీశైలంలో ఉన్న శక్తిపీఠం ఆరోది. పిఠాపురంలో ఉన్న శక్తిపీఠం పదవది కాగా, ద్రాక్షారామంలో పన్నెండో..

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తిపీఠాలు..దేనికదే ప్రత్యేకం!

భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా.. పురాణేతి హాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తిపీఠాలు. వాటి ప్రాశస్త్యం, చరిత్ర దేనికదే ప్రత్యేకం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాలుగు శక్తిపీఠాల గురించి వివరంగా చూద్దాం...


ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఒక శక్తిపీఠం ఉన్నాయి. ఆలంపూర్‌లో ఐదవ శక్తిపీఠం ఉంది. శ్రీశైలంలో ఉన్న శక్తిపీఠం ఆరోది. పిఠాపురంలో ఉన్న శక్తిపీఠం పదవది కాగా, ద్రాక్షారామంలో పన్నెండో శక్తిపీఠం ఉంది. ఈ పుణ్యక్షేత్రాల్లో శరన్నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. అమ్మవార్లను ఈ తొమ్మిది రోజుల పాటు.. ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవాలు నిర్వహిస్తారు.


ఆలంపూర్‌. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఐదో శక్తిపీఠమైన ఈ క్షేత్రం నవ  బ్రహ్మేశ్వరాలయాల సముదాయం. కృష్ణా-తుంగభద్రా నదుల సంగమస్థానం. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా, అగస్థ్యుడు నడియాడిన నేలగా కూడా ప్రసిద్ది. ఇంతటి మహత్తరమైన ప్రదేశం మన తెలంగాణాలో ఉన్న ఏకైక శక్తిపీఠం. జోగుళాంబ అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్ర చరిత్ర చాలా గొప్పది, సనాతనమైనది.



ఇక్కడి దేవాలయాలన్నీ ఆరవ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వీటిని బాదామి చాళుక్యల కాలంలో నిర్మించారు. ఈ క్షేత్రంలోని ఆలయాలన్నీ చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఆలంపూర్‌కు పూర్వ నామం హేమలాంపురం. కాల క్రమేణ ఈ నామం రూపాంతరం చెందుతూ హతంపురం, యోగాలాపురం, జోగుళాపురం, ఆలంపురంగా రూపాంతరం చెందింది. ఇది దేశంలోని 18 శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం. అమ్మవారి పైదవడ పంటితో సహా ఇక్కడ పడినట్టు పురాణకథనం. ఇక్కడి అమ్మవారు జోగుళాంబా దేవీగా భక్తులకు దర్శనమిస్తుంది.  


ఆలంపూర్‌లో నవ బ్రహ్మేశ్వరాలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాలబ్రహ్మేశ్వర స్వామి మాత్రమే ప్రస్తుతం పూజలందుకుంటుండగా.. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మాలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తు శకం 702 సంవత్సరంలో నిర్మితమైనట్లు ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తుంది. 


జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి. ప్రధానంగా ఇక్కడి తుంగభద్రానది ఉత్తర వాహిని. కాశీలో గంగానది కూడా ఉత్తర వాహినే. అదేవిధంగా కాశీలో విశ్వేశ్వరుడు.. ఇక్కడి బాల బ్రహ్మేశ్వర స్వామి ఉంటారు. ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో ఆలంపూర్లోని బాల బ్రహ్మేశ్వరున్ని దర్శించినా అంతే మహా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాశీలో 64 స్నాన ఘట్టాలు ఉండగా, ఆలంపూర్లో కూడా 64 స్నాన ఘట్టాలున్నాయి. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. 



జోగులాంబ అమ్మవారి కేశాలు గాల్లో తేలుతున్నట్లు ఉంటాయి. వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనిపిస్తాయి. బల్లి, తేలు, గబ్బిలాల వల్ల కలిగే దోషాలకు ఈ ఆలయంలో విరుగుడు లభిస్తుందని చెబుతారు. జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.  జోగులాంబ అమ్మ వారిని గృహచండిగా కూడా పేర్కొంటారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ.. ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం.


గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదనీ.. మహా విద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలంపూర్‌లో వేలాది సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేశాడని కూడా చెబుతారు. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉధ్బవించాడని.. బ్రహ్మ కారణంగా బాల బ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. శైవ క్షేత్రాల్లో శివ లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. అలంపూర్లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసింది. అందువల్ల ఈ దేవుళ్లను బ్రహ్మేశ్వరులుగా పిలుస్తారు. అమ్మవారిని యోగిని లేదా జోగులాంబ అని పిలుస్తారు. 9వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇంకా ఇక్కడ ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. ఆలంపూర్ దగ్గరలో పాపనాశనం అనే ప్రాంతంలో ఇరవైకి పైగా శివాలయాలు వివిధ ఆకారాలు, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.  


ఆలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి గ్రామంలో సంగమేశ్వరాలయం ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టులో ఆ గ్రామం ముంపునకు గురికావడంతో సంగమేశ్వరాలయాన్ని ఆలంపూర్‌లో పునర్నిర్మించారు. శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలంపూర్ ఆలయాలన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలాజికల్ విభాగంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటుచేసింది. జోగుళాంబ దేవాలయ సమీపంలోనే ఈ పురావస్తు ప్రదర్శనశాల ఉంది. 


అయితే, తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం అయినా, జోగులాంబ అమ్మవారికి అవమానం జరుగుతోందని ప్రతియేటా భక్తులు విమర్శిస్తున్నారు. ఎంతోమందికి కొంగుబంగారంగా విలసిల్లుతున్న జోగులాంబ అమ్మవారికి అధికారికంగా ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించడం లేదు. దీనిపై ప్రతియేటా విజ్ఞప్తులు చేస్తున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇది ఒకరకంగా శక్తిపీఠాన్ని అవమానించడమే అని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తోందని హిందూ ధార్మిక మండలి ఆరోపిస్తోంది.  


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ఆరో శక్తిపీఠం. ఇక్కడ జగన్మాత భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. శక్తిపీఠాల ఆవిర్భావానికి సంబంధించిన కథలో శ్రీశైల క్షేత్రాన సతీదేవి మెడభాగం పడిందని చెబుతారు. అమ్మవారి శక్తిపీఠంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ ఒకటిగా శ్రీశైలం విరాజిల్లుతోంది. ఇక్కడ శివపరమాత్ముడు మల్లికార్జున స్వామి రూపంలో స్వయంభువుగా వెలసి లక్షలాది భక్త జనానికి నిత్యం దర్శనం ఇస్తున్నారు. అటు అష్టాదశ శక్తిపీఠంగా ఇటు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా ఉన్న శ్రీశైలంలో ఆయా ప్రత్యేక రోజుల్లో స్వామి, అమ్మవార్లకు విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి రోజున స్వామికి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకం కాగా దసరా వేడుకల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మ వారి ఉత్సమూర్తిని నవ దుర్గల రూపంలో అలంకరణ చేస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక వాహన సేవలు నిర్వహిస్తారు.


దట్టమైన నల్లమల అడవుల మధ్య వెలసిన శ్రీశైల క్షేత్ర దర్శనానికి ఎంతో ప్రయాసపడి భక్తులు స్వామి, అమ్మ వారి సన్నిధానానికి చేరుకుంటారు. క్షేత్ర సమీపానికి చేరే దశలో శ్రీశైల శిఖర దర్శనాన్ని చేసుకుని భక్తులు తన్మయత్వం పొందుతారు. నల్లమల కొండల్లో అత్యంత ఎత్తైన శిఖరేశ్వర దర్శనంతో సకల పాపాలు హరిస్తాయని పేర్కొంటారు. శ్రీశైలం చేరుకున్న భక్తులు పాతాళ గంగకు చేరుకుని అక్కడ కృష్ణమ్మ ఒడిలో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళతారు. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల మూల ఆలయాల చుట్టూ వందలాది నీటి గుండాలు ఉన్నాయని ప్రతీతి. ఇక్కడ ఉన్న మల్లికార్జున గుండం నీటినే స్వామి వారి అభిషేకానికి పూజాది కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. శ్రీశైల క్షేత్రం చుట్టూ ఎన్నో ఆలయాలు వెలిశాయి. అలాగే పలుధార్మిక కేంద్రాలు, ఆశ్రమాలు ఉన్నాయి. భూలోక కైలాసంగా భావించే ఈ క్షేత్రానికి విచ్చేసే భక్తులు ప్రశాంతమైన మానసిక ఆనందాన్ని, ఆధ్యాత్మిక తత్వానికి లోనవుతారు.   


ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న మరో క్షేత్రం పీఠికాపురం పదవ శక్తిపీఠం. దీనినే పిఠాపురం అంటున్నాం. ఇక్కడ పురుహూతికా మాత కొలువుదీరి ఉంటుంది. సతీదేవి పీఠభాగం పిఠాపురంలో  పడినందున ఈ పట్టణం పీఠపురం, పీఠికాపురం, పిష్టపురం, కాలానుగుణంగా పిఠాపురం అయ్యింది. త్రిగయల్లో ఒకటైన పాదగయ. పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతీ మాధవం..  స్వయం భూ దత్త క్షేత్రం.. శ్రీపాదవల్లభ మహాసంస్థానం. ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మహా పుణ్యక్షేత్రం పిఠాపురం పాద గయా క్షేత్రం.


శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం ద్రాక్షారామం. ఇక్కడ భీమేశ్వర స్వామి సమేతంగా మాణిక్యాంబ దేవి భక్తులకు అభయమిస్తారు.  భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శరన్నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఇక్కడ కన్నులపండుగగా జరుగుతాయి. దసరా ఉత్సవాల్లో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ద్రాక్షారామం తరలివస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 12 వ శక్తి పీఠమైన ద్రాక్షారామంలో అమ్మ వారు శ్రీ చక్ర యంత్రం మేరువపై నిలబడి ఉంటుంది. అమ్మ వారు మేరువపై ఉండటం వల్ల విశేషమైన కళతో దర్శనమిస్తుంది. శక్తి స్వరూపినిగా, సుందర మూర్తిగా ప్రసిద్ధి. ఏకకాలంలో శ్రీ చక్ర యంత్రానికి , అమ్మ వారికి పూజలు చేసే అరుదైన అవకాశం ఇక్కడ ఉంటుంది . 


కరోనా మహమ్మారి అష్టాదశ శక్తి పీఠాలను కూడా తాకింది. శక్తి పీఠాల్లో అంగరంగ వైభవంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ యేడాది వెల వెల బోతున్నాయి. నిరాడంబరంగా శరన్నవరాత్రోత్సవాలు సాగుతున్నాయి. భక్తకోటితో హోరెత్తే శరన్నవరాత్రి వేడుకలు ఏమాత్రం సందడి లేకుండా సాగిపోతున్నాయి. కిక్కిరిసిపోయే రద్దీలో సాగాల్సిన నవరాత్రోత్సవాల్లో.. వేద పండితులు, అధికారులు, కొందరు ముఖ్యులు మాత్రమే పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది.  


- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-25T03:59:51+05:30 IST