తలొంచిన ట్విటర్‌?

ABN , First Publish Date - 2021-06-22T07:02:41+05:30 IST

పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే తమకు ముఖ్యమంటూ.. ఒక నిర్ణీత కేసులో ప్రభుత్వంతో

తలొంచిన ట్విటర్‌?

  •  విత్‌హెల్డ్‌లో వివాదాస్పద 50 ట్వీట్లు!
  •  వీడియోకాల్‌ విచారణకైతే వస్తా: ట్విటర్‌ చీఫ్‌ 


న్యూఢిల్లీ, జూన్‌ 21: పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే తమకు ముఖ్యమంటూ.. ఒక నిర్ణీత కేసులో ప్రభుత్వంతో ఘర్షణకు సైతం సిద్ధమైన ట్విటర్‌ ఇండియా ఎట్టకేలకు తలొంచింది! భారత ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు.. ఉత్తరప్రదేశ్‌లో ఒక వృద్ధుడి వీడియోకు సంబంధించిన 50 వివాదాస్పద ట్వీట్లను ‘విత్‌హెల్డ్‌’లో పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే, ఆ ట్వీట్లు అలాగే ఉంటాయిగానీ, మనదేశంలో కనిపించవు. ట్విటర్‌ వాటిని విత్‌హెల్డ్‌లో పెట్టినట్టుగా ఒక సందేశం మాత్రం మనకు కనిపిస్తుంది. మనదేశానికి ఆవల ఆ ట్వీట్లు కనిపిస్తాయి. నిజానికి ట్విటర్‌ ఇలా కొన్ని ట్వీట్లను, అకౌంట్లను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు.


ఈ ఏడాదిలోనే 500కు పైగా అకౌంట్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు సస్పెండ్‌చేసింది. కానీ.. కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి వచ్చి, ఇంటర్మీడియరీ హోదా కోల్పోయాక ట్విటర్‌పై నమోదైన తొలి కేసుకు సంబంధించిన ట్వీట్లను విత్‌హెల్డ్‌లో పెట్టడమే ఇక్కడ గమనార్హం.


మరోవైపు... ఈ కేసు విచారణకు రావాల్సిందిగా యూపీ పోలీసుల నుంచి విచారణ నోటీసులందుకున్న ట్విటర్‌ ఇండియా ఎండీ మనీశ్‌ మహేశ్వరి స్పందించారు. పోలీసులు ఆయన్ను ఢిల్లీ సమీపంలోని లోని బోర్డర్‌ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి, వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొనగా.. ఆయన వీడియో కాల్‌ ద్వారా విచారణకు హాజరవుతానని చెప్పారు. కానీ, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. గురువారం స్టేషన్‌కు వచ్చి విచారణకు సహకరించాలని తేల్చిచెప్పారు. అలాగే.. ట్విటర్‌ ఇండియా రెసిడెంట్‌ గ్రీవియెన్స్‌ అధికారి ధర్మేంద్ర చతుర్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. 



ఇదీ కేసు నేపథ్యం....

యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన అబ్దుల్‌ సమద్‌ (72) అనే వృద్ధుడు.. తనపై కొందరు దుండగులు దాడిచేసి.. ‘జై శ్రీరామ్‌’, ‘వందేమాతరం’ నినాదాలు చేయాల్సిందిగా బలవంతం చేశారని పేర్కొంటూ జూన్‌ 5న ఫేస్‌బుక్‌ లైవ్‌లో పేర్కొన్నారు. ఆ వీడియోను పలువురు పాత్రికేయులు, కాంగ్రెస్‌ నేతలు ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో..  మతవిద్వేషాలను రగిలించే ఉద్దేశంతోనే వారంతా ఆ వీడియోను షేర్‌ చేశారని పేర్కొంటూ కిందటి వారం ఘజియాబాద్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


ఆ వృద్ధుడు కొందరు వ్యక్తులకు తాయెత్తులు విక్రయించాడని.. అవి పనిచేయకపోవడంతో ఆరుగురు వ్యక్తులు అతణ్ని కొట్టారని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వారిలో ముస్లింలు కూడా ఉన్నట్టు అతడికీ తెలుసని పేర్కొంటున్నారు. కాగా.. కొత్త ఐటీ నియమావళికి సంబంధించి పదిహేను రోజుల్లోగా ప్రశ్న-జవాబుల క్రమంలో కేంద్ర ఐటీ శాఖ పూర్తి సమాచారం విడుదల చేయనున్నట్టు సమాచారం.




Updated Date - 2021-06-22T07:02:41+05:30 IST