భారత క్రికెట్‌కు పెద్ద మార్కెట్ ఉంది.. వాళ్లేం చెబితే అది జరుగుతుంది: షాహిద్ అఫ్రిది

ABN , First Publish Date - 2022-06-22T00:47:18+05:30 IST

భారత క్రికెట్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రీడల్లో భారత్‌కు అతిపెద్ద

భారత క్రికెట్‌కు పెద్ద మార్కెట్ ఉంది.. వాళ్లేం చెబితే అది జరుగుతుంది: షాహిద్  అఫ్రిది

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రీడల్లో భారత్‌కు అతిపెద్ద మార్కెట్ ఉందని, కాబట్టి ప్రపంచ క్రికెట్‌పై అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని అన్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయంపైనా అఫ్రిది స్పందించాడు. ఐపీఎల్ రెండున్నర నెలలపాటు కొనసాగితే ఆ ప్రభావం అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు పాకిస్థాన్ ఎఫ్‌టీపీ షెడ్యూల్‌‌పైనా పడుతుందన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్ అని, వారు ఏది చెబితే అది జరుగుతుందని అఫ్రిది వ్యాఖ్యానించాడు. 


ఐదేళ్ల కాలానికి సంబంధించిన బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను ఐపీఎల్ గతవారం దాదాపు 6.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఫలితంగా ప్రపంచంలోని సంపన్న లీగుల్లో ఒకటిగా నిలిచింది. డిస్నీ స్టార్ రూ. 23,575 కోట్లకు టీవీ హక్కులను సొంతం చేసుకోగా, వయాకామ్ 18 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూకేకు సంబంధించిన డిజిటల్, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను రూ. 23,758 కోట్లకు సొంతం చేసుకుంది 


అఫ్రిది మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను ఎక్కువ రోజులు ఆడించడం వల్ల పాకిస్థాన్ క్రికెట్‌పై ఆ ప్రభావం తప్పకుండా పడుతుందన్నాడు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభమైన పాకిస్థాన్ ఆటగాళ్లు దాదాపు రెండు నెలలపాటు ఖాళీగానే ఉన్నారు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉండటంతో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. ఐపీఎల్ ముగిసి వెస్టిండీస్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు వెళ్లేంత వరకు పాకిస్థాన్ క్రికెటర్లకు మ్యాచ్‌లు లేకుండా పోయాయి. ఇప్పుడు ఐపీఎల్ షెడ్యూల్‌ను ఏకంగా రెండున్నర నెలలు పొడిగిస్తే ఆ ప్రభావం తమపై మరింతగా పడుతుందని అటు పాక్ బోర్డుతోపాటు ఇటు అఫ్రిది కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-06-22T00:47:18+05:30 IST