ఆర్యన్‌కు బెయిలు కష్టమేనని వాపోతున్న షారూక్..!

ABN , First Publish Date - 2021-10-26T20:57:36+05:30 IST

ఆర్యన్ ఖాన్ బెయిల్ ముంబై హైకోర్టు ముందు మంగళవారం విచారణకు వచ్చినప్పటికీ అతనికి బెయిల్ దొరకడం..

ఆర్యన్‌కు బెయిలు కష్టమేనని వాపోతున్న షారూక్..!

ముంబై: ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తు ముంబై హైకోర్టు ముందు మంగళవారం విచారణకు వచ్చినప్పటికీ అతనికి బెయిల్ దొరకడం కష్టమేనని, గుండె దిటవు చేసుకుని మరికొంత సమయం వేచిచూడక తప్పదన్న అభిప్రాయంతో షారూక్ ఖాన్, గౌరి దంపతులు ఉన్నట్టు ఆ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఆర్యన్ తరఫున కేసు బలంగా వాదించేందుకు భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సీనియర్ లాయర్లు అమిత్ దేశాయ్, సతీష్ మనెషిండేలను షారూక్ రంగంలోకి దింపారు. ఇదే సమయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సైతం ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దని, బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయనే బలమైన వాదనతో సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో మన్నత్ (షారూక్ నివాసం)లో ఒకింత గంభీరమైన వాతావరణం నెలకొందని షారూక్ సన్నిహుతులు చెబుతున్నారు. ఆర్యన్‌కు మంగళవారంనాడు బెయిల్ రాదని, మరికొంత కాలం నిరీక్షణ తప్పదనే అభిప్రాయంతో షారూక్, గౌరి ఉన్నారని ఆయన కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. గుండెదిటవు చేసుకునేందుకు గౌరి మానసికంగా సిద్ధమవుతుండగా, ఎలాగైనా బెయిలుపై బయటకు తీసుకు వచ్చేందుకు షారూఖ్ ప్రయత్నాలు సాగిస్తున్నారనీ, అయితే అంత సులువుగా ఆర్యన్‌ బయటకు రాకపోవచ్చనే దిగులు మాత్రం వారిని వెంటాడుతోందని ఆయన తెలిపారు.


పెళ్లిరోజు సెలబ్రేషన్స్ లేనట్టే...

ఆర్ధర్ రోడ్డు జైలుకే ఆర్యన్ పరిమితమైన పక్షంలో తమ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకోరాదని ఆర్యన్, గౌరి దంపతులు నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.  ఢిల్లీలో గౌరి పరిచయం అయినప్పటి నుంచి ఏటా ఈ వేడుకను సంబరంగా ఇద్దరూ జరుపుకొనే వారు. తమ వివాహ వార్షికోత్సవం రోజు ఏదో ఒక కొత్త గిఫ్ట్ గౌరికి ఇవ్వడం షారూక్ ఆనవాయితీ. అయితే ఈ ఒక్క ఏడాది అందుకు మినహాయింపని షారూక్ కుటుంబ సన్నిహితుడు తెలిపారు.

Updated Date - 2021-10-26T20:57:36+05:30 IST