షఫాలీ.. మళ్లీ

ABN , First Publish Date - 2021-06-19T09:26:25+05:30 IST

అరంగేట్ర ఓపెనర్‌ షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌లో భారత్‌ పోరాడుతోంది.

షఫాలీ.. మళ్లీ

చెలరేగిన టీనేజర్‌

భారత్‌ ఫాలోఆన్‌

రెండో ఇన్నింగ్స్‌  83/1

మొదటి ఇన్నింగ్స్‌ 231 ఆలౌట్‌

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు


బ్రిస్టల్‌: అరంగేట్ర ఓపెనర్‌ షఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌లో భారత్‌ పోరాడుతోంది. ఫాలోఆన్‌ ఆడుతున్న మిథాలీసేన.. వర్షంతో శుక్రవారం ఆట ఆపివేసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 83/1 స్కోరు చేసింది. దూకుడుగా ఆడుతూ బౌండరీలతో హోరెత్తించిన షఫాలీవర్మ (68 బంతుల్లో 11 ఫోర్లతో 55 బ్యాటింగ్‌)తోపాటు మూడోస్థానంలో వచ్చిన దీప్తీశర్మ (18 బ్యాటింగ్‌) క్రీజులో ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు భారత్‌ 82 పరుగులు వెనుకంజలో నిలిచింది. 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. శనివారం ఆటకు చివరిరోజు కాగా.. షఫాలీ, దీప్తీతోపాటు ఇతర ప్రధాన బ్యాటర్లు సత్తాచాటితేనే మ్యాచ్‌ను భారత్‌ కాపాడుకోగలుగుతుంది. అంతకుముందు ఓవర్‌నైట్‌స్కోరు 187/5తో మూడోరోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 231 పరుగులకే కుప్పకూలింది.


షఫాలీ స్ట్రోక్‌ప్లే..:

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో మంధాన (8) త్వరగానే అవుటైనా..షఫాలీ, దీప్తి జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. ముఖ్యంగా షఫాలీ బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరుబోర్డును కదం తొక్కించింది. ఈ ద్వయం రెండో వికెట్‌కు అభేద్యంగా 54 రన్స్‌ జోడించింది. మూడోరోజు మొత్తం మూడుసార్లు వాన అడ్డుపడడంతో 45.5 ఓవర్ల ఆటే సాధ్యమైంది. రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన భారత్‌ లంచ్‌ విరామానికి 29/1 స్కోరు చేసింది. వరుణుడు అడ్డుపడడంతో 30 నిమిషాలు ఆలస్యంగా రెండో సెషన్‌ మొదలైంది. ఆ తర్వాత వర్షం కురవడంతో టీ విరామాన్ని ముందుగా ప్రకటించారు.  


మరో 15 పరుగులు చేసిఉంటే..:

మరో 15 పరుగులు చేస్తే ఫాలోఆన్‌ తప్పేది. కానీ మిగిలిన ఐదు వికెట్లను 44 పరుగులకే చేజార్చుకుంది. దీప్తీశర్మ (29 నాటౌట్‌), పూజావస్ర్తాకర్‌ (12) తొమ్మిదో వికెట్‌కు 33 రన్స్‌ జోడించినా ఫాలోఆన్‌ తప్పించలేకపోయారు. ఆదుకుంటుందనుకున్న ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌వుమన్‌ హర్మన్‌ప్రీత్‌ (4) అదే స్కోరువద్ద వెనుదిరిగింది. స్పిన్నర్‌ ఎకెల్‌స్టోన్‌ అంపైర్‌ సమీక్ష ద్వారా హర్మన్‌ను ఎల్బీగా అవుట్‌ చేసింది. ఆపై తానియా (0), స్నేహ్‌రాణా (2)నూ ఎకెల్‌స్టోన్‌ పెవిలియన్‌ చేర్చింది. 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి తీసుకున్న ఇంగ్లండ్‌ ఆపై ఎనిమిది బంతుల్లోనే భారత్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎకెల్‌స్టోన్‌ (4/88) నాలుగు వికెట్లు పడగొట్టింది.


రికార్డుల హోరు

ఇంగ్లండ్‌తో టెస్టులో.. 17 ఏళ్ల టీమిండియా బ్యాటింగ్‌ సంచలనం షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసిన షఫాలీ.. అరంగేట్ర టెస్ట్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాట్స్‌వుమన్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో ఆమె.. 26 ఏళ్లనాటి చంద్రకాంతకౌల్‌ (75 పరుగులు, 1995) రికార్డును తిరగరాసింది. ఇంకా.. తొలి ఇన్నింగ్స్‌లో ఎకెల్‌స్టోన్‌ బౌలింగ్‌లో అద్భుత సిక్సర్‌ కొట్టిన షఫాలీ అరంగేట్ర టెస్ట్‌లోనే సిక్సర్‌ దంచిన తొలి భారత మహిళా క్రికెటర్‌గానూ రికార్డు సొంతం చేసుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా.. అరం గేట్రంలోనే వరుసగా రెండు అర్ధ్ధ శతకాలు నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డుకెక్కింది. ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీ బాదిన అతి పిన్న వయసు (17 ఏళ్ల 139 రోజులు) క్రికెటర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ (17 ఏళ్ల 107 రోజులు) తర్వాతి స్థానంలో నిలిచింది. 


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:


396/9 డిక్లేర్డ్‌; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మంధాన (సి) బ్రంట్‌ (బి) స్కివెర్‌ 78, షఫాలీ (సి) ష్రబ్‌సోల్‌ (బి) క్రాస్‌ 96,  పూనమ్‌ రౌత్‌ (ఎల్బీ) నైట్‌ 2, శిఖాపాండే (సి అండ్‌ బి) నైట్‌ 0, మిథాలీ (సి) బ్యూమాంట్‌ (బి) ఎకెల్‌స్టోన్‌ 2, హర్మన్‌ప్రీత్‌ (ఎల్బీ) ఎకెల్‌స్టోన్‌ 4, దీప్తీశర్మ (నాటౌట్‌) 29, తానియా (ఎల్బీ) ఎకెల్‌స్టోన్‌ 0, స్నేహ్‌రాణా (సి) జోన్స్‌ (బి) ఎకెల్‌స్టోన్‌ 2, పూజావస్త్రాకర్‌ (బి) బ్రంట్‌ 12, జులన్‌ (బి) ష్రబ్‌సోల్‌ 1, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (81. 2 ఓవర్లలో) 231 ఆలౌట్‌; వికెట్లపతనం : 1/167, 2/179, 3/179, 4/183, 5/183, 6/187, 7/187, 8/197, 9/230, 10/231; బౌలింగ్‌: బ్రంట్‌ 11-2-42-1, ష్రబ్‌సోల్‌ 10.2-2-18-1, స్కివెర్‌ 10-3-22-1, క్రాస్‌ 12-4-40-1, ఎకెల్‌స్టోన్‌ 26-5-88-4, నైట్‌ 11-8-7-2, సోఫియా 1-0-9-0.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌:

మంధాన (సి) స్కివెర్‌ (బి) బ్రంట్‌ 8, (బ్యాటింగ్‌) 55,  దీప్తీశర్మ (బ్యాటింగ్‌) 18, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (24.3 ఓవర్లలో) 83/1; వికెట్‌పతనం: 1/29; బౌలింగ్‌: బ్రంట్‌ 8-3-21-1, ష్రబ్‌సోల్‌ 6-1-25-0,  ఎకెల్‌స్టోన్‌ 6-2-12-0, క్రాస్‌ 4.3-0-24-0.

Updated Date - 2021-06-19T09:26:25+05:30 IST