షడ్రుచుల సమ్మేళనం ఉగాది: ఉప రాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-04-13T08:05:59+05:30 IST

షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఆయన దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు

షడ్రుచుల సమ్మేళనం ఉగాది: ఉప రాష్ట్రపతి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం ఆయన దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఉగాది పచ్చడిలోని ప్రతి రుచి జీవితంలోని వివిధ అనుభవాలకు ప్రతి రూపం. తీపి కోసం కలిపే బెల్లం ఆనందానికి, ఉప్పదనం జీవితంలో ఉత్సాహానికి, బాధను కలిగించే అనుభవాలకు వేపపువ్వు, చింతపండు నేర్పునకు, వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు కారణాన్ని ప్రతీకగా చెబుతారు. ఇలా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమపాళ్లలో అనుభవించి, స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్ధేశంతో ఉగాది పచ్చడిని తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు. 


ప్రజలకు సీఎం, గవర్నర్‌ ఉగాది శుభాకాంక్షలు

ప్లవ నామ సంవత్సరాది(ఉగాది) సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు. 


యాదాద్రిలో పంచాంగ శ్రవణంపై కరోనా ఎఫెక్ట్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో.. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది, వసంత నవరాత్రి మహోత్సవ పర్వాలు ఈ ఏడాది లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆస్థాన పరంగానే నిర్వహించనున్నారు. బాలాలయంలో మంగళవారం జరిగే ఉగాది వేడుకలు, సాయంత్రం పంచాంగ శ్రవణానికి భక్తులను అనుమతించడం లేదని దేవస్థాన అధికారులు ప్రకటించారు.

Updated Date - 2021-04-13T08:05:59+05:30 IST