స్వేచ్ఛకు సంకెళ్ళు

ABN , First Publish Date - 2021-02-13T09:23:03+05:30 IST

వాక్‌‌స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణస్వేచ్ఛ పరిరక్షణే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అన్నారు ప్రధానిగా ప్రమాణం చేసిన...

స్వేచ్ఛకు సంకెళ్ళు

వాక్‌‌స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణస్వేచ్ఛ పరిరక్షణే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అన్నారు ప్రధానిగా ప్రమాణం చేసిన నెలరోజుల్లోనే నరేంద్రమోదీ. ఏడేళ్ళక్రితం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం, పౌరహక్కులూ స్వేచ్ఛలూ ఇత్యాది విలువలపట్ల దాని కట్టుబాటు విషయంలో పలువురు అనుమానాలు వెలిబుచ్చితే, మన బలమైన ప్రజాస్వామిక వ్యవస్థలు ఎంతటివారినైనా నిలువరించగలవని మరికొందరు ధైర్యవచనాలు పలికారు. మోదీకి ముందు అటల్‌బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయే పాలననూ, దానికి ఇంకా ముందు ఇందిర ఏలుబడినే చూసినందునా ఈ ధైర్యం కలిగి ఉంటుంది. కానీ, గత ఆరేళ్ళ కాలంలో, మరీ ముఖ్యంగా మలివిడత పాలనలో మోదీ ప్రభుత్వం వైఖరిని గమనించిన తరువాత ఆ ధైర్యం అర్థంలేనిదనీ నిర్థారణ అవుతున్నది.


ఉగ్రవాద నిరోధక చట్టాలు, దేశద్రోహ చట్టాలు ఒక క్రమపద్ధతిన సామాజిక కార్యకర్తలనూ, ప్రభుత్వ విమర్శకులనూ వేటాడుతున్నాయి. తప్పుడు సాక్ష్యాధారాల ప్రాతిపదికన బీమా కోరేగావ్‌ నిందితులు జైళ్ళలో మగ్గుతున్నారన్న విమర్శకు ఆర్సెనల్‌ ఫోరెన్సిక్‌ పరిశోధన మరింత ఊతం ఇచ్చింది. కంప్యూటర్లలోకి జొరబడి మరీ ఆధారాలను చొప్పించగలుగుతున్నవారు ఆ నైపుణ్యాన్ని ఏవో ఒకటి రెండు సందర్భాలకే ఎందుకు పరిమితం చేస్తారు? ప్రస్తుతం పాలకుల గురి మీడియా సంస్థల మీదకు మరింత విస్తరించింది. విధానాలను, చట్టాలను ప్రశ్నించే మీడియా సంస్థల యజమానులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. వాటిని అదిలించి బెదిరించేందుకు ఇన్‌కమ్‌టాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌లు ఉపకరిస్తున్నాయి. అప్పటి ఎన్డీటీవీనుంచి ఇప్పటి న్యూస్‌క్లిక్‌ వరకూ ఈ దాడులూ సోదాల లక్ష్యం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ప్రాథమికంగా కొన్ని ఆధారాలుండి, సోదాలతో మరింత బలం చేకూరుతుందన్న నమ్మకం ఉంటే దర్యాప్తు సంస్థలు అందుకు ఉపక్రమించవచ్చు. కానీ, విదేశీ విరాళాలూ మనీలాండరింగ్‌ ఆరోపణలపై డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ను శోధించాలన్న ఈడీ నిర్ణయానికి ఊహలూ అనుమానాలే ఆధారాలు. ముప్పైఆరుగంటల గాలింపు తరువాత, ఏ ఆధారాలూ సంపాదించలేకపోగా, కోట్లాదిరూపాయల అక్రమ లావాదేవీలేవో జరిగినట్టుగా దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని న్యూస్‌క్లిక్‌ అంటున్నది. గత ఏడాది పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలనూ, ఇప్పటి రైతాంగ నిరసనలను విస్తృతంగా కవర్‌చేసినందుకు న్యూస్‌క్లిక్‌కు ఈ శిక్ష. 


అదొక్కటే కాదు, పరోక్షంగా మొత్తం మీడియానే నియంత్రించే లక్ష్యంతో కొంతమంది ఎంపిక చేసుకున్న పాత్రికేయులను ప్రభుత్వం వేధిస్తోంది, న్యాయస్థానాల చుట్టూ తిప్పుతోంది. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ఒక నిరసనకారుడు మరణించిన ఘటనను ఆ ఉద్యమాన్ని ప్రజలకు చేరువచేసిన పాత్రికేయులమీద ఆయుధంగా ప్రయోగిస్తోంది. జనవరి 26 ర్యాలీ సందర్భంగా అతడు ట్రాక్టర్‌ తిరగబడి మరణించాడన్నది పోలీసుల వాదన. కానీ, అతడు పోలీసు కాల్పుల్లో మరణించాడని కొందరు పాత్రికేయులు, కొన్ని చానెళ్ళు అన్నాయి. పోలీసులు కాల్చడంతోనే అతడు ట్రాక్టర్‌మీదనుంచి పట్టుదప్పి కిందపడి మరణించాడని మృతుడి కుటుంబీకులు కూడా ఆరోపించారు. మృతుడి బంధువుల వాదననూ, వారు ఆ మరణాన్ని అనుమానిస్తున్న విషయాన్నీ బాహ్య ప్రపంచానికి తెలియచెప్పడం నేరం ఎలా అవుతుందో తెలియదు. నాలుగైదు రాష్ట్రాల్లో కేసులు బనాయించి ప్రధానమీడియా పాత్రికేయులను అరెస్టు భయంతో న్యాయస్థానాల చుట్టూ తిరిగేట్టు చేస్తున్న పాలకులు, సోషల్‌ మీడియాను సైతం వదలడం లేదు. అంతర్జాతీయ ప్రపంచానికి మన భోగట్టా తెలియచేస్తున్న ట్విట్టర్‌ను దారికితెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఎకౌంట్ల తొలగింపు విషయంలో అది ఇచ్చిన జవాబు పెద్ద ఎదురుదెబ్బ. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సామాజిక మాధ్యమాలమీద నిఘా పెంచాలని నిర్ణయించుకుంటే, కేంద్రం ఏకంగా ఇందునిమిత్తం సేవకులను నియోగించాలని అనుకుంటోంది. మాటనీ, ఆలోచననీ నియంత్రిస్తూ ప్రజాస్వామ్యానికే ప్రమాదం తెచ్చిపెడుతున్న పాలకులు, మరోపక్క పాత్రికేయుల ట్వీట్లు దేశభద్రతకు పెనుముప్పని వాపోతున్నారు.

Updated Date - 2021-02-13T09:23:03+05:30 IST