న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతా...

ABN , First Publish Date - 2020-10-21T09:11:10+05:30 IST

షబ్నమ్‌ సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని అశోక్‌ నగర్‌ జిల్లా ముంగోలీ గ్రామం. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో భూములమీదా, పంటల మీదా బయటి

న్యాయం కోసం ఎంత దూరమైనా వెళతా...

‘భూమి మన పూర్వీకుల అస్థిత్వం. దాన్ని మనం పోగొట్టుకోకూడదు’ అంటారు షబ్నమ్‌ షా. 

వారసత్వంగా వచ్చిన ఇంటి కోసం తన తండ్రి చేసిన పోరాటాన్నీ, పడిన కషాలనూ ఆమె కళ్ళారా చూశారు.

ఆదివాసీ హక్కుల కార్యకర్తగా ఉద్యమించారు. దాదాపు 1500 వందల కుటుంబాలకు వారి భూమి హక్కులు అందేలా చేశారు.

తన ఉద్యమ స్ఫూర్తికి గుర్తింపుగా ఇటీవల ఉమెన్ప్‌ వరల్డ్‌ సమ్మిట్‌ ఫౌండేషన్‌ పురస్కారాన్ని అందుకున్నారు.


షబ్నమ్‌ సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని అశోక్‌ నగర్‌ జిల్లా ముంగోలీ గ్రామం. ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో భూములమీదా, పంటల మీదా బయటి నుంచి వచ్చినవారిదే పెత్తనం. ఈ ఆధిపత్యానికి షబ్నమ్‌ తండ్రి సైతం బాధితుడే. ఆయనకు పూర్వీకుల నుంచీ వచ్చిన ఇల్లొకటి ఉంది. షబ్నమ్‌తో సహా ఆరుగురు పిల్లలున్న ఆ కుటుంబానికి ఒక కిరాణా దుకాణం, సొంత ఇంటి మీద వచ్చే కొద్దిపాటి అద్దె ఆధారం. 1980ల్లో తమ ఇంటిలో ఒక వాటాను వేరే వర్గానికి చెందిన ఒక వ్యక్తికి షబ్నమ్‌ తాత అద్దెకిచ్చారు. పూర్తిగా ఆ ఇంటినే స్వాధీనం చేసుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడు. 


‘‘అప్పటికి నేను చాలా చిన్న పిల్లని. మా ఇంటినీ బలవంతంగా ఆక్రమించుకోవాలని ఆ వ్యక్తి చేసిన ప్రయత్నాల వల్ల మా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. కానీ ఆ ప్రభావం మా మీద పడకుండా మా అమ్మానాన్నా చూసుకున్నారు. మమ్మల్ని బాగా చదివించాలన్నది వారి కోరిక’’ అంటూ బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు ముప్ఫై మూడేళ్ళ షబ్నమ్‌.


‘‘శక్తిమంతమైన వ్యక్తులు ప్రతిదాన్నీ నియంత్రిస్తూ ఉంటే న్యాయం మీదా, చట్టాల మీదా ప్రజలకు నమ్మకం పోతుంది. కేసు ఎలాగైనా గెలవాలి’’ అని మా నాన్న అంటూ ఉండేవారు. దాదాపు ముప్ఫయ్యేళ్ళ తరువాత ఆ కేసును మా నాన్న గెలిచారు. ఆ సంతృప్తితోనే ఆయన కన్నుమూశారు’’ అని చెప్పారామె.


షబ్నమ్‌ న్యాయవాది కావాలన్నది ఆమె తండ్రి కోరిక. కానీ తండ్రి మరణించడంతో ఎనిమిదో తరగతిలోనే కిరాణా దుకాణం బాధ్యతలను తీసుకున్నారామె. ఆ తరువాత మళ్ళీ చదువు కొనసాగించి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ‘‘పద్ధెనిమిదేళ్ల వయసులో, భూమి హక్కులపై పనిచేస్తున్న ‘ఏక్తా పరిషత్‌’ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యాను. ఆదివాసీలూ, పేదలూ ఎలా దోపిడీకి గురవుతున్నారో నాకు అర్థమయింది. మా నాన్న ఎంత కష్టపడ్డారో గుర్తుకువచ్చింది, ఆయన తన హక్కుల కోసం ఎన్నాళ్ళు, ఎంత గట్టిగా పోరాడారో తలచుకొని గర్వంగా అనిపించింది’’ అంటారు షబ్నమ్‌.


ఆమె తండ్రి కేసు గెలిచాక, తమ భూమి హక్కులు దక్కించుకోవడానికి చాలామంది ఆయనను సలహాలు అడిగేవారు.  ఈ సమస్య ఎంత తీవ్రమైనదో  అప్పుడు ఆమెకు తెలిసింది. తండ్రి స్ఫూర్తితో పేద ఆదివాసీలకు అండగా నిలవాలనుకున్నారామె. వెంటనే ‘ఏక్తా పరిషత్‌’లో సభ్యురాలిగా చేరారు. పదేళ్ళలో ఆ సంస్థకు జిల్లా కో-ఆర్డినేటర్‌ అయ్యారు.  ఆ ప్రాంతంలోని ఊరూరా తిరిగి, పలుకుబడి ఉన్నవారి చేతుల్లో చిక్కుకున్న ఆదివాసీలూ, పేదల భూముల వివరాలు తెలుసుకున్నారు. వారి తరఫున న్యాయపోరాటం ప్రారంభించారు. ‘‘అటవీభూముల హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ) గురించి వారికి ఏమాత్రం తెలీదు. దీంతో యథేచ్ఛగా ఆక్రమణలూ, చట్ట ఉల్లంఘనలూ కొనసాగుతూ వచ్చాయి. ఎఫ్‌ఆర్‌ఎ కింద దఖలు పడిన హక్కులను ఆదివాసీలు వినియోగించు కోకపోవడం, వేరే వ్యక్తులు ఆక్రమించుకోవడం... ఇవీ ప్రధానమైన సమస్యలు. వీటికి ఏకైక పరిష్కారం ఆదివాసీలకు వారి హక్కులేమిటో తెలియజెప్పడం’’ అన్నారామె. దీనికోసం వారానికి కనీసం మూడు సార్లు గ్రామాల్లో తరగతులను ఆమె నిర్వహిస్తున్నారు.  ‘‘దాదాపు వంద గ్రామాల్లో ఆరువేల మంది ఆదివాసీలూ, పేదల కోసం మేము పని చేస్తున్నాం. వారిలో ఎక్కువమది సహారియా తెగవారు. ఇప్పటి వరకూ దాదాపు 1500 కుటుంబాలకు భూమి హక్కులు దక్కేలా చూశాం’’ అని చెప్పారామె. అంగబలం, అర్థబలం ఉన్న కొందరు వ్యక్తుల నుంచి ఓ గిరిజన కుటుంబానికి ఈ మధ్యే వారి భూమిని షబ్నమ్‌ తిరిగి ఇప్పించారు. ఆక్రమణదారుల దాడిలో బలైన ఒక కుటుంబం తరఫున పోరాడి కేసు పెట్టించారు. ఈ క్రమంలో అనేకసార్లు ఆమెను చంపుతామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ‘‘న్యాయం కోసం ఎంతదూరమైన వెళ్ళడానికి నేను సిద్ధం’’ అని ఆమె స్పష్టం చేశారు.


షబ్నమ్‌ కృషి సర్వత్రా మన్ననలు అందుకుంటోంది. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉమెన్స్‌ వరల్డ్‌ సమ్మిట్‌ ఫౌండేషన్‌ ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను మెరుగుపరిచే మహిళా నాయకులకూ లేదా బృందాలకూ ప్రదానం చేసే ‘ప్రైజ్‌ ఫర్‌ ఉమెన్స్‌ క్రియేటివిటీ ఇన్‌ రూరల్‌ లైఫ్‌’’ పురస్కారం షబ్నమ్‌కు లభించింది. ‘‘ఈ అవార్డును నేను ఊహించలేదు. ధైర్యవంతులైన మహిళల సరసన  చోటు దక్కినందుకు సంతోషంగా ఉంది.  జల్‌, జంగిల్‌, జమీన్‌ (నీరు, అడవి, నేల)... వీటిపై న్యాయబద్ధమైన హక్కులు అర్హులకు అందాలి. ఆ ఆశయం కోసం నా కృషి కొనసాగిస్తాను’’ అంటున్నారు షబ్నమ్‌.


ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను మెరుగుపరిచే మహిళా నాయకులకూ ప్రదానం చేసే ‘ప్రైజ్‌ ఫర్‌ ఉమెన్స్‌ క్రియేటివిటీ ఇన్‌ రూరల్‌ లైఫ్‌’’ పురస్కారం షబ్నమ్‌కు లభించింది.

Updated Date - 2020-10-21T09:11:10+05:30 IST