కశ్మీరులో అలజడి సృష్టించేందుకు నిధులు సేకరించిన షబ్బీర్ షా : ఈడీ

ABN , First Publish Date - 2021-06-22T18:48:36+05:30 IST

రు వేర్పాటువాది షబ్బీర్ షా బెయిలు పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌

కశ్మీరులో అలజడి సృష్టించేందుకు నిధులు సేకరించిన షబ్బీర్ షా : ఈడీ

న్యూఢిల్లీ : కశ్మీరు వేర్పాటువాది షబ్బీర్ షా బెయిలు పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన జమ్మూ-కశ్మీరులో అశాంతి, అలజడి సృష్టించేందుకు నేరపూరితంగా పెద్ద ఎత్తున నిధులను సమీకరించినట్లు తెలిపింది. పాకిస్థాన్ సహా అనేక దేశాల నుంచి ఆయన నిధులను సేకరించినట్లు వివరించింది. ఆయన బెయిలు పిటిషన్‌పై స్పందిస్తూ ఢిల్లీ కోర్టులో ఈ మేరకు సమాధానాన్ని మంగళవారం దాఖలు చేసింది. 


షబ్బీర్ షా ఉగ్రవాదానికి నిధులను సమకూర్చుతున్నట్లు ఈడీ తెలిపింది. ఉగ్రవాదులు బలపడటానికి, ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించడానికి నిధులను అందజేసే కార్యకలాపాల్లో ఆయన భాగస్వామి అని వివరించింది. నేరగాళ్ళు తమ చట్టవిరుద్ధ సంపాదన వివరాలను గోప్యంగా ఉంచుకోవడానికి మనీలాండరింగ్‌ చేస్తున్నారని తెలిపింది. ఇటువంటి పద్ధతుల ద్వారా చట్టాన్ని అమలు చేసే దర్యాప్తు సంస్థలకు అనుమానం కలగకుండా జాగ్రత్తపడుతున్నారని తెలిపింది. నేరారోపణ చేయదగిన సాక్ష్యాధారాలు లేకుండా చూసుకుంటున్నారని పేర్కొంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌తో షబ్బీర్ షా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. జమ్మూ కేంద్ర కారాగారం నుంచి విడుదలైన, కశ్మీరుకు చెందిన మహమ్మద్ షఫీ షాయర్‌తో కూడా షబ్బీర్ షా నిరంతరం సంబంధాలు నెరపుతున్నట్లు వివరించింది. మహమ్మద్ షఫీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నట్లు తెలిపింది. 


షబ్బీర్ షా తరపున వాదిస్తున్న న్యాయవాది వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. దీంతో అడిషినల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేశారు. 



Updated Date - 2021-06-22T18:48:36+05:30 IST