సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-08-07T05:11:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం పేరుతో తీసుకొస్తున్న సంస్కరణలు పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని విద్యకు దూరం చేసేలా ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను ధ్వజమెత్తారు.

సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థ నిర్వీర్యం
ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకులు సాను, ఎమ్మెల్సీ లక్ష్మణరావే తదితరులు

విలీనం పేరుతో పాఠశాలల్ని మూసివేస్తున్నారు

ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను ధ్వజం

గుంటూరు(విద్య), ఆగస్టు 6: కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం పేరుతో తీసుకొస్తున్న సంస్కరణలు పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని విద్యకు దూరం చేసేలా ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను ధ్వజమెత్తారు. శనివారం సేవ్‌ ఎడ్యుకేషన్‌, సేవ్‌ ఇండియా నినాదంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు గుంటూరుకు చేరింది. ఈ సందర్భంగా భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విద్యారంగ పరిరక్షణ కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్‌  వరకు ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన బస్సు యాత్రకు అన్నివర్గాల నుంచి విశేషస్పందన వస్తున్నట్లు తెలిపారు. విలీనం అంటే పాఠశాలల్ని ఇక శాశ్వతంగా మూసివేయడమేని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, పాండిచేరి రాష్ట్రాల్లో చేస్తున్న విలీన ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందన్నారు. దేశంలో వివిధ శాఖల్లో 11లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం కేంద్రానికి చేతకావడం లేదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ సెంట్రల్‌ కమిటీ సంయుక్త కార్యదర్శి నారాయణ్‌ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం అనే బేధం లేకుండా విద్యను అదించాలన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ప్రసంగిస్తూ నాణ్యత పేరుతో పాఠశాలల్ని మూసివేయడం సరికాదని పేర్కొన్నారు. టీచర్‌ పోస్టులు భర్తీచేయకుండా విద్యలో నాణ్యత ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఏపీలోని యూనివర్సిటీల్లో 5వేల ప్రొఫెసర్‌ పోస్టులు, పాఠశాలల్లో 25వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, అశోక్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కిరణ్‌, పి.మనోజ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ ఎస్‌కే నాగూర్‌బీ, రూఫస్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-07T05:11:01+05:30 IST