సెజ్‌కు భూములు ఇచ్చేది లేదు

ABN , First Publish Date - 2021-10-23T06:21:25+05:30 IST

సెజ్‌కు భూములు ఇచ్చేది లేదని విజయరాంపురం (వీఆర్‌) అగ్రహారం రైతులు తేల్చి చెప్పారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులు కూలీలుగా మారారని, తాము కూడా ఆ జాబితాలో చేరలేమని స్పష్టం చేశారు.

సెజ్‌కు భూములు ఇచ్చేది లేదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌డీసీ అనిత

 

 తేల్చి చెప్పిన వీఆర్‌ అగ్రహారం రైతులు 

 అప్పన్నపాలెంలో ఎస్‌డీసీ అనిత సమావేశం 

 పరిహారం తీసుకోవాలని సూచన 

 ససేమిరా అన్న రైతులు

రాంబిల్లి, అక్టోబరు 22: సెజ్‌కు భూములు ఇచ్చేది లేదని విజయరాంపురం (వీఆర్‌) అగ్రహారం రైతులు తేల్చి చెప్పారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులు కూలీలుగా మారారని, తాము కూడా ఆ జాబితాలో చేరలేమని స్పష్టం చేశారు.  మండలంలోని గొరపూడి పంచాయతీ శివారు అప్పన్నపాలెం పాల కేంద్రం వద్ద ఎస్‌డీసీ (ల్యాండ్‌ ఎక్విజిషన్‌) అనిత శుక్రవారం అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, తహసీల్దార్‌ పి.భాగ్యవతిలతో కలిసి  వీఆర్‌ అగ్రహారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్ట ప్రకారం ఇచ్చే పరిహారాన్ని తీసుకొని సెజ్‌కు రైతులు భూములు అప్పగించాలని  కోరారు. సెజ్‌కు వీఆర్‌ అగ్రహారం పరిధిలోని 8వ బ్లాక్‌లో ఏపీఐఐసీ 101 ఎకరాల భూమికి ల్యాండ్‌ ఎక్విజెషన్‌ చేసిందన్నారు. ఇది వరకే 2017లో వచ్చిన కొత్తచట్టం ప్రకారం 34 ఎకరాలకు ఎకరాకు  రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు.  2008లో ఆరు ఎకరాలకు రూ.5.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించినట్టు చెప్పారు. ఇళ్లకు, ఇళ్ల స్థలాలకు కూడా పరిహారం ఇవ్వడం జరిగిందని వివరించారు.  ప్రస్తుతం మరో 60 ఎకరాలకు సంబంధించి పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు చట్టప్రకారం ఇస్తున్న పరిహారాన్ని తీసుకొని ప్రభుత్వానికి భూములు అప్పగించాలని ఆమె సూచించారు. అనంతరం రైతులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఎస్‌డీసీ కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ  తమ భూముల జోలికి అధికారులు రావద్దని తేల్చిచెప్పారు. రైతుల భూములు తీసుకొని ఏపీఐఐసీ వ్యాపారం చేసుకుంటుందని ఆరోపించారు. ఎట్టి పరిస్ధితిలోనూ తమ భూములు ఇచ్చేది లేదని పునరుద్ఘాటించారు. రైతులకు ఎటువంటి సమాచారం లేకుండా, అభిప్రాయాలు తెలుసుకోకుండా రెవెన్యూ రికార్డులో తమ పేర్లు తొలగించారని ఆరోపించారు. అనంతరం ఎస్‌డీసీ అనిత, ఆర్డీవో సీతారామరావులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రుత్తల గణేశ్‌, ఎంపీటీసీ లాలం చినసత్యం, ఉప సర్పంచ్‌ నాగేష్‌, వీఆర్‌అగ్రహారం గ్రామ నాయకులు కిల్లాడ చిన్న, లాలం శ్రీరామ్మూర్తి, ఏపీఐఐసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఆర్డీవో సీతారామారావు రాంబిల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌ భాగ్యవతి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:21:25+05:30 IST