రక్త ‘పరీక్ష’!

ABN , First Publish Date - 2022-04-29T05:18:04+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రులలో చేసే రక్త, మూత్ర పరీక్షల రిపోర్ట్స్‌ ఇవ్వడంలో

రక్త ‘పరీక్ష’!

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమూనా టెస్టు ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం
  • రిపోర్టుల కోసం ఆస్పత్రుల చుట్టూ రోగుల ప్రదక్షిణలు
  • సర్వర్‌ డౌన్‌ అంటున్న వైద్యాధికారులు 
  • ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
  • నిరుపేదలకందని మెరుగైన వైద్యం


ప్రభుత్వ ఆస్పత్రులలో చేసే రక్త, మూత్ర పరీక్షల రిపోర్ట్స్‌ ఇవ్వడంలో తీవ్రజాప్యం చేస్తున్నారు. నమూనా సేకరించిన పది పన్నెండు రోజులకు గానీ ఫలితాలు వెల్లడించడం లేదు. రిపోర్ట్స్‌ కోసం రోగులు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు రక్త నమూనాలు తీసుకుని రోగులను ఇబ్బంది పెడుతున్నారు. సర్వర్‌ డౌన్‌ అంటూ రిసల్ట్స్‌ ఇవ్వడంలో వైద్యాధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొందరు రిపోర్ట్స్‌ కోసం ఎదురుచూడలేక ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్స్‌ను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.


రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 28 : పేదలకు రక్త పరీక్షల భారం తీరటం లేదు. ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయక తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల టెస్టులు అందని ద్రాక్షలా మారింది. తెలంగాణ డయోగ్నొస్టిక్‌ హబ్‌ పేరుతో సర్కారు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కేంద్రం ద్వారా ఒకేసారి 57 రకాల రక్త, మూత్ర, అవయవాల పనితీరు వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. గత ఏడాది ఈ కేంద్రాన్ని అందుబాలోకి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ డయోగ్నస్టిక్‌ హబ్‌ పరిధిలోకి చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబుపేట మండలాల్లోని ప్రాథమిక కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లును అనుసంధానం చేశారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులను ఈ ల్యాబ్‌కు అనుసంధానం చేశారు. ఈ సెంటర్‌లో ఒకేసారి రక్త, మూత్ర, అవయవ పనితీరు, థైరాయిడ్‌, లివర్‌, కిడ్నీ పనితీరు, కొలెస్ర్టాల్‌, చికున్‌గున్యా, మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, క్యాల్షియం, సిరమ్‌ క్రియటినైన్‌, డీహెచ్‌డీఎల్‌, ఎలక్ట్రరేట్స్‌, హెచ్‌బీఎ్‌సహెచ్‌జీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. వీటితోపాటు ఖర్చుతో కూడుకున్న టీస్కాన్‌, 2డీ ఈకో, అలా్ట్రసౌండ్‌, మ్యామోగ్రఫి లాంటి స్కానింగ్‌ పరీక్షలు కూడ నిర్వహిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి నమూనాలను జిల్లా కేంద్రంలోని డయోగ్నస్టిక్‌ సెంటర్‌కు చేరవేసేందుకు ప్రత్యేక వాహన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో దూరాన్ని బట్టి ఒకటి, రెండు లేదా మూడు రూట్లుగా విభజించారు. ప్రతిరోజూ జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల నుంచి నమూనాలను ఐస్‌బాక్స్‌లో పెట్టుకుని తిరిగి మధ్యాహ్నం వరకు ల్యాబ్‌కు చేరుకుంటారు. ఆన్‌లైన్‌లో రోగి పేరు, బార్‌కోడ్‌, వివరాలు నమోదు చేస్తారు. ఆ నమూనాలను జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయోగ్నస్టిక్‌ కేంద్రానికి చేరుస్తారు. అన్ని ఆసుపత్రుల నుంచి తీసుకు వచ్చిన నమూనాలను పరీక్ష చేసి నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ఆయా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ప్రింట్‌ తీసి రోగికి అందజేస్తారు. కానీ.. ఈనెల 12వ తేది నుంచి ఆన్‌లైన్‌లో నివేదికలు రావడం లేదు. రక్త నమూనాలు ఇచ్చిన రోగులంతా రోజూ టెస్ట్‌ రిపోర్ట్స్‌ కోసం ఎదురు చేస్తున్నారు. రక్తపరీక్షల ఫలితాలు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోగుల రోగం కాస్త ముదిరి ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడుతోంది. రక్త పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసి.. అవి రాకపోవడంతో చివరకు కొందరు రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. డబ్బులేని నిరుపేదలకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. తెలంగాణ డయోగ్నస్టిక్‌ సెంటర్‌ లేక ముందు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొన్నిరకాల పరీక్షలు జరిగినా త్వరగా రిసల్ట్‌ వచ్చేదంటున్నారు. ఇప్పుడు తెలంగాణ డయోగ్నస్టిక్‌ సెంటర్‌లో అన్నిరకాల పరీక్షలు చేస్తున్నా ఫలితాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. సర్వర్‌ డౌన్‌ కారణంగా రిపోర్ట్సు అప్‌లోడ్‌ కావడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. రోగుల ప్రాణాలు పోకముందే.. రక్త పరీక్షల ఫలితాలు సకాలంలో అందజేయాలని కోరుతున్నారు.


ఇరుకు గదిలో టెస్ట్‌లు..

చేవెళ్లలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఓపీ గదికి ఆనుకుని చిన్న గదిలోనే ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే అన్ని టెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఇబ్బందిగా ఉందని ల్యాబ్‌టెక్నిషియన్‌ చెబుతున్నాడు. టీబీ టెస్ట్‌ చేసేందుకు గది వేరుగా ఉండాలి.. కానీ అందులోనే చేయాల్సి వస్తుందంటున్నారు. 


అలా్ట్రసౌండ్‌ మిషన్‌ లేక అవస్థలు

చేవెళ్లలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో అలా్ట్రసౌండ్‌ మిషన్‌ లేక పోవడంతో గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. డబ్బులు పెట్టుకోలేని నిరుపేదల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ.. ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దాతలు సహకారంతోనైనా, లేదా ప్రభుత్వం స్పందించి వెంటనే అల్ర్టాసౌండ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇబ్రహీంపట్నంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో స్కానింగ్‌ లేక పోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి రెఫర్‌ చేస్తున్నారు. 


మేజర్‌ టెస్టులన్నీ గాంధీ, ఉస్మానియాకే..

షాద్‌నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చిన్న చిన్న పరీక్షలు చేస్తున్నారు. రక్త నమూనాలను తీసుకుని గాంధీ, ఉస్మానియాకు పంపిస్తున్నారు. రిపోర్ట్సు వచ్చేందుకు కొంత ఆలస్యం ఏర్పడటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రిపోర్టు వచ్చే సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు.


ఇప్పటికి రెండు సార్లు రక్తం ఇచ్చాను

ఇప్పటి వరకు రెండు సార్లు రక్తం ఇచ్చాను. మొదటి సారి రిపోర్స్ట్‌ రాలేవు. మళ్లీ రక్తం ఇవ్వమంటే వారం రోజుల క్రితం ఇచ్చాను. కానీ.. ఇప్పటి వరకు రిపోర్ట్సు రాలేవు. రోజు ఆసుపత్రికి తిరుగుతున్నాను. నేను తిరుగుతున్న మాదిరిగా చాల మంది వస్తున్నారు. రిపోర్టు రాకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళుతున్నారు. 

- సుత్తాన, వ్యవసాయ కూలి, చేవెళ్ల 


సర్వర్‌డౌన్‌ కారణంగానే ఆలస్యం

సర్వర్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌లో నివేదికలు అప్‌లోడ్‌ కావడం లేదు. రోజుకు 300-350 వరకు రక్తనమూనాలు వస్తున్నాయి. టెస్ట్‌లు కూడా చకచకా జరుగుతున్నాయి. రెండు మూడు రోజులుగా సమస్య ఏర్పడింది. రెండురోజుల్లో సమస్యను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో టెస్ట్‌ల రిపోర్టు అప్‌లోడ్‌ చేసి రోగులకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాను. 

- డాక్టర్‌ ప్రదీప్‌, వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రి వైద్యులు


చేవెళ్ల సీహెచ్‌సీలో సేకరించిన రక్త నమూనాలు, పెండింగ్‌లో ఉన్న ఫలితాల వివరాలు

తేది సేకరించిన రక్త పెండింగ్‌లో 

నమూనాలు ఉన్నవి

12 15 02

18 03 02

19 07 07

20 03 03

21 22 22

22 03 03

25 05 05

26 10 10

మొత్తం 68 54

Updated Date - 2022-04-29T05:18:04+05:30 IST