పాఠ్యాంశంగా ఏడేళ్ల చిన్నారి కథ..

ABN , First Publish Date - 2020-06-25T00:23:34+05:30 IST

శ్రీనగర్‌కు చెందిన జన్నత్ ఐదేళ్ల ప్రాయంలోనే పరిణతి చెందిన ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడి ప్రఖ్యాత దాల్‌ చెరువును..

పాఠ్యాంశంగా ఏడేళ్ల చిన్నారి కథ..

శ్రీనగర్: ఒంటి చేత్తో రెండేళ్లు పాటు ప్రఖ్యాత దాల్ చెరువును శుభ్రం చేసిన ఏడేళ్ల చిన్నారి జన్నత్‌కు అరుదైన గుర్తింపు లభించింది. జన్నత్ కథ ఇప్పుడు ఎకాఎకిన ఓ పాఠశాల టెక్స్ట్ బుక్‌లో పాఠ్యాంశమైంది.


శ్రీనగర్‌కు చెందిన జన్నత్ ఐదేళ్ల ప్రాయంలోనే పరిణతి చెందిన ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడి ప్రఖ్యాత దాల్‌ చెరువును రెండేళ్ల పాటు పరిశుభ్రం చేసింది. 'దాల్ లేక్‌లో ఎవరూ చెత్త వేయొద్దు.. చెత్త వేయాలంటే డస్ట్ బిన్‌లను వాడండి' అంటూ ప్రచారం సాగించింది. ఆ చిన్నారి పట్టుదలే ఇప్పుడు పాఠ్యాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ పాఠశాల టెక్స్ట్ బుక్‌లో ఆమె కథను పాఠ్యాంశంగా తీసుకున్నారు.


ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న జన్నత్ ఈ విషయం తెలియగానే సంబరపడిపోయింది. 'మా నాన్నగారే నాకు స్ఫూర్తి. ఆయన సహకారంతోనే దాల్ చెరువు శుభ్రం చేశాను. నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే అది బాబా (నాన్న) వల్లే' అంటూ ముద్దుముద్దుగా చెప్పింది జన్నత్. చిన్నారి తండ్రి తారిఖ్ అహ్మద్ సైతం ఈ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మిత్రుడు ఫోన్ చేసి మీ అమ్మాయి పేరు ఓ పాఠశాల పాఠ్యాంశంలో చేర్చినట్టు చెప్పాడని, ఆ పుస్తకం తనకు పంపమని కోరానని తెలిపారు. 'నా అనుభూతి మాటల్లో చెప్పలేను. చాలా గర్వంగా ఉంది' అని తారిఖ్ అహ్మద్ పేర్కొన్నారు.

 



Updated Date - 2020-06-25T00:23:34+05:30 IST