దళిత బాలికపై 7 నెలలుగా ఏడుగురి లైంగిక దాడి

ABN , First Publish Date - 2021-12-29T09:09:51+05:30 IST

ఆ బాలిక మానసిక స్థితి బాగోలేదు. ఏ విషయాన్నీ ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి ఆమెది.

దళిత బాలికపై 7 నెలలుగా ఏడుగురి లైంగిక దాడి

నల్లగొండ జిల్లాలో మతిస్థిమితం లేని అమ్మాయిపై దారుణం

గర్భం దాల్చిన బాలిక.. పోలీసులకు ఫిర్యాదు అందని వైనం


నల్లగొండ/నల్లగొండ క్రైం, డిసెంబరు 28: ఆ బాలిక మానసిక స్థితి బాగోలేదు. ఏ విషయాన్నీ ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి ఆమెది. ఇదే అదునుగా భావించిన ఏడుగురు మృగాళ్లు ఆ బాలికపై ఏడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రం నుంచి చౌటుప్పల్‌కు వెళ్లే దారిలో ఉన్న ఓ గ్రామంలో  చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ దళిత దంపతులు కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వారికి మానసిక స్థితి సరిగాలేని ఓ కుమార్తె(16 ఏళ్లు) ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ రోజూ కూలి పనులకు వెళ్తుండగా బాలిక ఇంట్లోనే ఉంటుంది. ఇది గమనించిన గ్రామానికి చెందిన ప్రభుత్వ చిరుద్యోగి ఒకడు బాలిక ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని తాగిన మైకంలో గ్రామానికి చెందిన తోటి స్నేహితులతో పంచుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన  మరో ఆరుగురు కూడా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.


ఇలా ఏడు నెలలుగా ఏడుగురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఆ బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తల్లి స్థానిక వైద్యుడిని సంప్రదించింది. దీంతో ఆ బాలిక గర్భిణిగా నిర్ధారణ అయింది. మూడు రోజులుగా తల్లిదండ్రులు, మేనమామ, బంధువులు బాలికను ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన ఏడుగురు తనపై లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని ఆ బాలిక వివరించగలిగింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు నిందితులు ఏడుగురిని రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇందుకు తామేమీ బాధ్యులంకాదని ఆ ఏడుగురు చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాధిత బాలిక ఇంటి వద్దనే ఉండగా, ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదు. 

Updated Date - 2021-12-29T09:09:51+05:30 IST