ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2021-04-11T06:52:50+05:30 IST

ఇండోనేషియాలో శనివారం సంభవించిన భూకంపం ఏడుగురిని బలి తీసుకోగా.. 12మందికి తీవ్రగాయాలయ్యాయి

ఇండోనేషియాలో భూకంపం.. ఏడుగురి మృతి

మలంగ్‌, ఏప్రిల్‌ 10: ఇండోనేషియాలో శనివారం సంభవించిన భూకంపం ఏడుగురిని బలి తీసుకోగా.. 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రధాన దీవి జావాపై సుమారు 300కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయని, బాలి దీవిలోనూ ప్రకంపనలు వచ్చాయని ఇక్కడి అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు ఇండోనేషియా దక్షిణ తీరంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భౌగోళిక సర్వే తెలిపింది. మలంగ్‌ జిల్లాలోని తూర్పు జావా ప్రావిన్స్‌కు దక్షిణంగా 45 కిలోమీటర్ల దూరంలో తాజా భూకంపం కేంద్రీకృతమైందని వెల్లడించింది. అయితే.. సునామీ వచ్చే ప్రమాదం లేదని ఇండోనేషియా భూకంప, సునామీ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని వారు సూచించారు. ఇటీవలి కాలంలో ఇండోనేషియాను ప్రకృతి విపత్తులు వరుసగా కుదిపేస్తున్నాయి. వారం రోజుల క్రితం దేశాన్ని కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ విపత్తులో 174మంది మృతి చెందగా.. 48మంది గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నాశనమయ్యాయి. కొండచరియల మట్టిలో పలువురు కూరుకుపోగా.. వరదల్లో ఎంతోమంది కొట్టుకుపోయారు. ఇక ఈ ఏడాది జనవరిలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 105మంది కన్నుమూయగా, 6500మంది గాయపడ్డారు. 92వేల మంది నిరాశ్రయులయ్యారు. 

Updated Date - 2021-04-11T06:52:50+05:30 IST