వైద్యులనూ వదల్లేదు!

ABN , First Publish Date - 2020-07-10T09:04:48+05:30 IST

కరోనాపై జరుగుతున్న మహాసమరంలో ముందువరుసలో ఉన్న యుద్ధవీరులు! ఇప్పుడు వారే కరోనా నుంచి బయటపడటానికి పోరాడుతున్నారు. అటు వైరస్‌ బాధితులను కాపాడేందుకు నిరంతరం

వైద్యులనూ వదల్లేదు!

  • ఏడుగురు డాక్టర్లు, సిబ్బంది మృతి
  • కరోనా బారిన 150 మందికిపైగానే
  • నిర్వహణ లోపం... చిన్నపాటి నిర్లక్ష్యం!
  • పెరుగుతున్న కేసులు... దొరకని సెలవులు
  • వైరస్‌ సోకిన తర్వాత ఐసొలేషన్‌కు
  • సిబ్బంది సంఖ్య భారీగా పెంచాల్సిందే!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనాపై జరుగుతున్న మహాసమరంలో ముందువరుసలో ఉన్న యుద్ధవీరులు! ఇప్పుడు వారే కరోనా నుంచి బయటపడటానికి పోరాడుతున్నారు. అటు వైరస్‌ బాధితులను కాపాడేందుకు నిరంతరం విధుల్లో ఉంటూ... తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, మైక్రోబయాలజిస్ట్‌, ల్యాట్‌ టెక్నీషియన్లు బాధితులుగా మారుతున్నారు. వైరస్‌ బాధితులను కాపాడటమే కాదు... తామూ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది!


రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైనప్పుడు తొలుత సామాన్యులు, పోలీసులు, ఆ తర్వాత రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందే బాధితులు! ఇప్పుడు వారందరినీ కాపాడే వైద్యులు, సిబ్బంది కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్యులు, సిబ్బంది ఏడుగురికిపైగా కరోనాతో మరణించారు. 150మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తొలిసారి కర్నూలుకు చెందిన ఓ ప్రైవేటు వైద్యుడు మరణించారు. ఆ తర్వాత నెల్లూరులోనూ ఆర్థోపెడిక్‌ వైద్యుడు మరణించారు. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే వీరి మరణానికి కారణమని తేలింది. ఇప్పుడు.... బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. కరోనా ప్రబలిన తొలి రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగినంతగా పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు అందుబాటులో లేవు. ఇప్పుడు పరిస్థితి అంతో ఇంతో మెరుగుపడినా... నిర్వహణాపరమైన లోపాలు వెంటాడుతున్నాయి.


తగిన జాగ్రత్తలతోనే...

కరోనా పేషంట్లకు వైద్యం అందించే ఆస్పత్రుల్లో అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజులో కనీసం రెండుదఫాలుగా శానిటైజ్‌ చేయాలి. అత్యధిక హైజినిక్‌ విధానం పాటించాలి. వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు షిప్టుల వారీ సమకూరుస్తుండాలి. ‘హైరిస్క్‌’ ప్రాంతాల్లో పని చేస్తుండటంతో చిన్న పొరపాటు చేసినా వైద్య సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. రక్షణ పరికరాలను ఉపయోగించడంలో అవగాహన లేకపోవడం... అవగాహన ఉన్నప్పటికీ చిన్నపాటి నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వైరస్‌ సోకే అవకాశముందని వైద్య నిపుణులే చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వైద్యులను పరీక్షించినప్పుడు ఆందోళనకర అంశం వెలుగుచూసింది. ఒక్కో వైద్యుడికి, సిబ్బందికి వైరల్‌ లోడ్‌ 70-90 శాతం మేర నిర్ధారణ అవుతోంది. వారంతా అప్పటికే, లేదా అంతకుముందు కొవిడ్‌ వార్డుల్లో సేవలు అందించినవారే.


చికిత్స అందిస్తున్న సమయంలో సరైన మాస్క్‌, పీపీఈ కిట్‌, షీల్డ్‌ ధరించకుండా సేవలు అందించినప్పుడు తీవ్రస్థాయిలో వైరస్‌ సోకి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, టెక్నీషియన్లు, సిబ్బంది తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.... అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేస్తున్నారు. సెలవు అడిగినా ఇవ్వని ఉన్నతాధికారులు... వైరస్‌ సోకిన తర్వాత మాత్రం 14 రోజులు ఐసొలేషన్‌కు, 10రోజులు హోమ్‌ క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ఆ సమయంలో ఇతర సిబ్బందిపై భారం పెరుగుతోంది. పెరుగుతున్న కేసులకు తగినట్లుగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై ఒత్తిడి పడుతోంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఉన్నది ఒక్కటే లాబొరేటరీ. అందులో పనిచేసే సిబ్బందికి కరోనా వచ్చింది. అంతే, అక్కడ పనిచేసే ఇతరులను క్వారంటైన్‌కు తరలించారు. కొత్తగా పరీక్షలు చేయాలంటే అదనపు సిబ్బంది అవసరం. అప్పటివరకు పరీక్షల కోసం వేచిచూడాల్సిందే. దీంతో చాలాచోట్ల పరీక్షా కేంద్రాలను అనధికారికంగా మూసివేసే పరిస్థితి వస్తోంది. తగినంత సిబ్బంది లేకపోవడంతో పరీక్షలు చేయలేకపోతున్నారు. 


కొవిడ్‌ కోరల్లో..

  1. ప్రకాశం జిల్లాలో 4రోజుల క్రితం ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కరోనాతో మరణించారు. ఒక ప్రభుత్వ, ముగ్గురు ప్రైవేటు డాక్టర్లు, ఇద్దరు హౌస్‌ సర్జన్లు, ఇద్దరు నర్సులు, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు వైర్‌స బారిన పడ్డారు. 
  2. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు వైద్యాధికారులు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఏఎన్‌ఎమ్‌, ఇద్దరు ఆశావర్కర్లు, ముగ్గురు ఆర్‌ఎంపీలకు వైరస్‌ సోకింది. పార్వతీపురం పరిధిలో డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు, ప్రైవేటు డాక్టర్‌ కరోనాతో బాధపడుతున్నారు. 
  3. తూర్పుగోదావరి జిల్లాలో 13మంది డాక్టర్లు,  ఇద్దరు స్టాఫ్‌ నర్సులు బాధితులుగా ఉన్నారు. 
  4. అనంతపురంలో 14మంది డాక్టర్లు, 8మంది నర్సులు, 20మంది ఆశావర్కర్లు, 8మంది ఏఎన్‌ఎమ్‌లకు పాజిటివ్‌ వచ్చింది. 
  5. గుంటూరు జిల్లాలో 20మంది వైద్యసిబ్బంది వైరస్‌బారిన పడ్డారు. 
  6. కృష్ణాజిల్లాలో 18మందికి వైరస్‌ సోకింది. ఇందులో ఒక పీజీ డాక్టర్‌, ఒక ఏఎన్‌ఎమ్‌ మరణించారు. బాధితుల్లో ఇద్దరు  వైద్యులు, ఐదుగురు జూనియర్‌ డాక్టర్లు, నలుగురు స్టాఫ్‌నర్సులు, ఉన్నారు. 
  7. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కారణంగా పీజీ వైద్యవిద్యార్థి ఇటీవల చనిపోయాడు. ఇద్దరు డాక్టర్లు, ఏడుగురు నర్సులు, నలుగురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఒక ఏఎన్‌ఎమ్‌, ఒక ఆశావర్కర్‌ సహా 15 మంది ఈ జిల్లాలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-07-10T09:04:48+05:30 IST