ఇప్పటికీ ఈ 7 దేశాల్లో భారతీయులకు ప్రవేశం నిషేధం !

ABN , First Publish Date - 2020-10-26T22:42:40+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ భారత్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79 లక్షలకు పైగా మంది ఈ వైరస్ బారిన పడగా... 1.19 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటికీ ఈ 7 దేశాల్లో భారతీయులకు ప్రవేశం నిషేధం !

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ భారత్‌లోనూ తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 79 లక్షలకు పైగా మంది ఈ వైరస్ బారిన పడగా... 1.19 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తర్వాత భారతదేశం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇండియాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి దృష్ట్యా చాలా దేశాలు భారత పౌరుల రాకపై నిషేధం విధించాయి. కాగా, ఇటీవల భారత ప్రభుత్వం సుమారు 18 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆయా దేశాల్లో రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కానీ, 7 దేశాలు భారత సందర్శకుల ప్రవేశాన్ని ఇప్పటికీ నిషేధించాయి. అవి: 1. ఇటలీ, 2. మలేసియా, 3. చైనా, 4.భూటాన్, 5. దక్షిణాఫ్రికా, 6. హాంగ్ కాంగ్, 7. జర్మనీ.


1. ఇటలీ: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కరోనా విజృంభణ కొనసాగుతున్నందున.. ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల పౌరులను తమ దేశంలోకి రానివ్వడం లేదు. అమెరికా, భారత్, రష్యా దేశాలకు చెందిన వారిని ఇటలీ తమ దేశంలో ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం ఆస్ట్రియా, బెల్జియం, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, హంగరీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, రువాండా, థాయిలాండ్, ట్యునీషియా, ఉరుగ్వే, జార్జియా దేశాలకు చెందిన సందర్శకులకు మాత్రమే ఇటలీ వెళ్లే అవకాశం ఉంది. 


2. మలేసియా: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో భారతీయుల రాకపై మలేసియాలో ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి వరకు భారత సందర్శకులపై మలేసియాలో ఈ నిషేధం ఉంటుందని సమాచారం. మలేసియాతో పాటు ఫిలిప్పైన్స్, ఇండోనేషియా కూడా భారతీయుల ప్రవేశంపై నిషేధం విధించాయి. 


3. చైనా: కరోనా పుట్టినిల్లుగా పేర్కొంటున్న డ్రాగన్ దేశం చైనా కూడా భారతీయుల రాకపై బ్యాన్ విధించింది. ఆగస్టు చివరి నుంచి మలేసియా, జపాన్, కంబోడియా, సౌత్ కొరియా, లావొస్, ఇండోనేషియా, సింగపూర్‌తో పాటు పలు దేశాల వారిని తమ దేశంలోకి ప్రవేశం కల్పించిన డ్రాగన్... ఇప్పటికీ ఇండియన్స్‌ను తమ దేశంలోకి రానివ్వడం లేదు. 


4. భూటాన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించిన కొవిడ్ వల్ల ఇప్పటికే 11 లక్షలకు పైగా మంది చనిపోయారు. కానీ భూటాన్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదు. అందుకే దీనిని కొనసాగించేందుకు మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల సందర్శకులను తమ దేశంలో ప్రవేశించడాన్ని భూటాన్ నిషేధించింది. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. 


5. దక్షిణాఫ్రికా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) జారీ చేసిన మార్గదర్శకాలు, భారతదేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆధారంగా తమ దేశంలో భారతీయుల రాకపై తుది నిర్ణయం తీసుకుంటామని దక్షిణాఫ్రికా పర్యాటక శాఖ మంత్రి మమమోలోకో కుబాయి-న్గుబనే ఇటీవల పేర్కొన్నారు. దీనికి సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి అన్నారు. కనుక భారత సందర్శకులు ఇతర దేశాలకు తమ టూర్లను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 


6. హాంగ్ కాంగ్: ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో హాంగ్ కాంగ్ అక్టోబర్ 17 నుంచి ఈ నెలాఖరు వరకు వీటిపై బ్యాన్ విధించింది. ఎయిరిండియా విమానాలపై ఈ దేశం నిషేధం విధించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. సో... హాంగ్ కాంగ్‌లో కూడా భారతీయులకు ప్రవేశం లేదు. 


7. జర్మనీ: ఇక జర్మనీతో కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య లుఫ్తాన్సా, ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానాల సంఖ్యకు సంబంధించి ఇటీవల సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎయిర్ బబుల్ ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇదిలాఉంటే... తాజాగా ఎయిరిండియా అక్టోబర్ 26 నుంచి మార్చి 28 వరకు జర్మనీ-భారత్ మధ్య విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్‌సైట్, కాల్ సెంటర్స్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-26T22:42:40+05:30 IST